కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్

అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్


రాగం: వలజి

ఆలమందల తోడి అడవులలో పడి తినెడి
కుడియడమ తెలియని గోపకులజులము
నీవు తోడ పుట్టిన పుణ్యమే మా పుణ్యము //ఆల//
కొరత కొంచెం లేని గోవిందా! నీతోడి
సంబంధము కాదన్న పోవునది కాదురా!
లోకమర్యాదల లోతెరుంగని లేమలము
చిన్న పేరున నిన్ను ప్రేమతో పిలిచేము
కోపగించక స్వామీ! కరుణించి పరనిమ్ము!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.గత పాశురంలో దివ్యమైన ఆభరణాలు, వస్త్రాల పేరుతో భగవంతుని సాన్నిహిత్యాన్ని కోరిన గోపికలను వాటిని అందుకోవడానికి మీకున్న యోగ్యత ఏమిటి అని అడిగాడు శ్రీకృష్ణుడు." మాకున్న పశువులను మేపుకుంటూ అడవిలో తిరుగుతూ దొరికింది తినడమే మా జీవనంగా ఉన్నాము. ఏమీ తెలియని మా గోపవంశంలో నీవు జన్మించడం వల్ల దొరికినదే మా పుణ్యం. మాలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా అన్నీ తీర్చగలిగే లోపరహితుడవు నీవు. గోవిందా! నీతో మాకు గల సంబంధం వదులుకుందామన్నా పోయేది కాదు.మాకు లోకంలోని మర్యాదలు అంతగా తెలీవు అందుకే ప్రేమతో నిన్ను చిన్నపేరుతో పిలుచుకుంటున్నాము. అందుకు కోపగించుకుని మాపై దయ చూడడం మానకు దేవా. మేము కోరిన పరను ఇవ్వు"గోపికలు తమ ఆవులను ఆచార్యులుగా, అడవే ఒక గురుకులంగా , తినే ఆహారమే వారి విద్యగా భావిస్తున్నారు. అందుకే భగవంతుని ప్రాప్తి పొందడానికి తమకు అర్హత లేదని అనుకుంటున్నారు. శ్రీకృష్ణుడి గోపికలకు ఏదో ఒక అర్హత ఉందని నిరూపించి తమను స్వీకరింపడేమో, వదిలిపెడతాడేమో అని భావించిన గోపికలు తమకు ఏమీ తెలియదని, తాము చేసేదంతా పొట్టకూటికే తప్ప కర్మయోగం కాదని చెప్తున్నారు. మా ఆహారంలో పరిశుద్ధి లేదు. అటువంటప్పుడు మాకు ఆత్మజ్ఞానమెలా కలుగుతుంది. నీవు మా వంశంలో జన్మించడమే మేము చేసుకున్న గొప్ప పుణ్యం. అంతకంటే వేరే యోగ్యత ఉండునా? అలాగే నువ్వు, మేము ఇద్దరమూ ఏమీ లేనివారమే. మాకు జ్ఞానం లేదు నీకు జ్ఞానకొరత లేదు. మాకు లేనిది నీవే కదా ఇవ్వాల్సింది. మాతో సంబంధం వదులుకుందామన్నా అది సాధ్యం కాదు. సకలజగత్తుకు నీవు ఆత్మవైతే మేము శరీరం. ఈ బంధం ఎన్నటికీ వీడేది కాదని నీకు తెలియదా స్వామి అని అమాయకంగా చెప్పారు వారంతా. స్వామికి ఎన్నో పేర్లు ఉన్నా తమ సౌలభ్యం కోసం చిన్న పేరుతో పిలిచినందుకు కోపగించకుమని కోరుతున్నారు. గోపికలు శ్రీకృష్ణుడే తమ సర్వస్వమని ఆశ్రయించారు కాబట్టి తమకు ఉన్న యోగ్యత, సాధన, పుణ్యము అన్నీ ఆతనే అని అఖండ విశ్వాసంతో నమ్మి ప్రకటించారు.