శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్

పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్

రాగం : కేదారగౌళ

తెలతెల వారకమున్నె వచ్చి నిన్ను సేవించి, నీ
సుందర పాదారవిందముల ప్రస్తుతి చేయుటకు
ప్రయోజనము వినుము - ఇదె వినుము! //తెల తెల //
మా గోకులమున అవతరించి మన్ననలందిన నీవు
మేము చేయు కైంకర్యము వలదనుట తగదు1
నీ విచ్చే పరవాద్యము మాకెందుకు గోవిందా!
ఏడేడు జన్మలకు.. ఎప్పటికీ నీతోనే
వీడని బంధము కావలె, నీ సేవల తరింపవలె
చిల్లర కోరికల కెల్ల చెల్లు చీటి వ్రాయించుము!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


మార్గశిరమాసంలో పెద్దల అనుమతి తీసుకుని నదీస్నానం చేయడనైకి పదిమంది గోపికలను మేల్కొల్పి తమతో తీసికెళ్లారు గోపికలు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని , అతని భార్యను నిద్రలేపి తమ వ్రతానికి కావలసిన పరికరాలు ఇవ్వమని కోరి, తమకు పర ఇచ్చి వ్రతం చేయించి సకలాభరణాలు, వస్త్రాలు, స్వామితో కలిసి పాయసాన్ని తినాలనే కోరుకున్నారు. కాని ఇప్పుడు వాళ్లందరూ తమ కోరికను మార్చుకున్నారు.


"తెల్లవారకముందే లేచి, స్నానం చేసి వచ్చి నిన్ను సేవించి, కీర్తించి మగలం పాడడానికి గల కారణాలు వినుము స్వామి. పశువులను మేపి జీవించే యాదవ వంశంలో అవతరించిన నీవు మేము చేసే సేవలను తిరస్కరించడం తగదు. మేము నీ నుండి పరవాద్యాన్ని తీసుకుపోవడానికి రాలేదు. ఎప్పటికి ఏడేడు జన్మాలకు కూడా నీతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. ఎటువంటి వాంఛలు లేకుండా నీకు సేవ చేయాలని ఉంది. దాని వలన మా జన్మ ధన్యమవుతుంది. అలాగే మేము పూజలు చేసేది, మంగళం పాడేది మాకోసం కాదు నీకోసమే. మమ్మల్ని పొందడానికే కదా నువ్వు మా గోపాలకుల కులంలో జన్మించావు. ఎన్నో కష్టాలు పడ్డావు..అందుకే మా సేవలు నువ్వు అందుకోక తప్పదు. ఎప్పటికీ నీ సన్నిధిలో ఉండి , నీ సేవలు చేయడానికి నియమించుకో. నీకు తులసీమాల వేయడానికి, ప్రసాదం పాత్ర తీసుకురావడానికి, హారతి ఇవ్వడానికి, పాదములొత్తడానికి, చామర వీయడానికి, తాంబూలం అందించడానికి, మంచి తీర్థం ఇవ్వడానికి, బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు కడిగి తుడవడానికి, అమ్మగారికి కబురందించడానికి మమ్మల్ని సేవకులుగా నియమించుకో..


అదేంటి . మీరు పరను కోరి వచ్చినవారు నాతోనే ఉండిపోతా అంటారేంటి? అని శ్రీకృష్ణుడు అడుగగా.. ఊరివారికోసం వ్రతం చేయడానికి పర అనే వాద్యం కావాలి కాని మాకెందుకు? నీ అంతరంగ కైంకర్యమే మాకు కావలసిన పర. ఎల్లప్పుడు నీతోనే ఉండేట్టుగా అనుగ్రహించు దేవా. శ్రీ మహాలక్ష్మి నిన్ను విడవకుండా ఎలా ఉంటుందో మమ్మల్ని కూడా అలాగే ఉండనివ్వు..అందుకు మాలోని ఇతరములైన కోరికలను పోగొట్టు. ఇదే మా కోరిక!