తిరుప్పావై --- 30 పాశురం

Filed under:


వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై

త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.

రాగం : అమృతవర్షిణీ

ఓడల కడలిని చిలికిన మాధవుని కేశవుని
చంద్రాననలు కోరి చేరి స్తుతించి // ఓడల //
అల వ్రేపల్లెలో పరపొందిన ప్రకారమును
భట్టనాధుని పట్టి గోద చెప్పిన ముప్పది
పాటలు క్రమము తప్పక పాడెడివారు, అరుణనేత్రుడు
చతుర్భుజుడు, దివ్యముఖారవిందుడు
శ్రీమన్నారాయణుని కరుణను పొంది
బ్రహ్మానందము ననుభవింతురు గాక!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

ఆండాల్ తిరువడిగళే శరణం..
ఇతిశమ్

అలనాడు గోపికలు శ్రీ వ్రతము చేసి శ్రీకృష్ణుడిని పొందినట్లుగానే గోదాదేవి కూడా శ్రీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీరంగనాధుని భర్తగా పొందింది. వ్రతం సమాప్తమయ్యే సమయంలొో రంగనాధుడు గోదాదేవిని తాను వివాహమాడడానికి తీసుకురమ్మని ఆమె తండ్రిని ఆదేశించాడు. శ్రీరంగంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. భోగమును పొందిన రోజు కావును శ్రీరంగనాధుడు, గోదాదేవి వివాహం చేసుకున్న ఈ రోజును భోగిగా చెప్పుకుంటారు.

ఎంతో పవిత్రమైన అందరూ ఆచరింపదగిన ఈ వ్రతాన్ని నియమిత సమయంలో ఆచరించకున్నా రోజూ ఈ ముప్పై పాశురాలను మననం చేయడం చాలా మంచిది. ముక్తి దాయకం. అమ్మవారైన లక్ష్మీదేవిని పొందడానికి శ్రీమన్నారాయణుడు ప్రయత్నించాడని క్షీరసాగరమధనంలో చెప్పినట్టుగా మనము కూడా ఆ పరమాత్మను పొందాలి అని అనుకోకుండా ఆతడే మనను పొందడానికి ప్రయత్నం చేస్తాడు అని ఈ అమృత మధనం గురించి ఈ చివరి పాశురంలో వర్ణిస్తున్నారు.

" నారాయణుడు లక్ష్మీదేవిని పొందడానికి ఓడలతో నిండిన క్షీరసాగరాన్ని దేవతలు , అసురులతో మధింపచేసాడు. అదేవిధంగా శివుడు, బ్రహ్మలకు కూడా గురువైన కేశవుని గోపికలు కీర్తించి, భక్తిశ్రద్ధలతో నియమానుసారంగా శ్రీవ్రతాన్ని ఆచరించి భగవంతుని సాన్నిధ్యాన్ని పొందారు. ఆ ప్రకారంగానే శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన గోదాదేవి తామరపూవులు, చల్లని పూసలు మాలగా ధరించి రంగనాధుని పొందడానికి శ్రీవ్రతాన్ని ఆచరించి తమిళంలో ఈ ముప్పై పాశురాలను ఒక మాలగా తయారు చేసింది. ఆమె ఆచరించి కీర్తించినట్టుగానే ఈ పాశురాలను పాడేవారు పెద్ద శిఖరాలవంటి భుజాలు కలవాడు, పుండరీకాక్షుడు, దివ్యమైన ముఖసౌందర్యం కలవాడు, శ్రీపతియైన పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు..."

నారాయణుడు సముద్రమధనం జరిగేటప్పుడు క్షీరసాగరంలో తిరుగాడే ఓడలకు ఎటువంటి ఆటంకం కలగకుండా నేర్పుగా కూర్మావతారుడై చిలికాడు. ఎవరికీ కనిపించని ఆ ఓడలు గోదాదేవికి మాత్రమే గోచరించాయి. ఆ ఓడలే మన ఆత్మలు, సంసారమే ఒక మహా సముద్రము, ఆ సముద్రాన్ని నేర్పుగా చిలికేవాడే మాధవుడు. సముద్రాన్ని చిలికేటప్పుడు ఆతని కేశాలు అటుఇటూ ఊగాయంట. అందుకే కేశవుడైనాడు. పాలకడలిపై శయనించిన పరమాత్మ ప్రార్ధనతో ఈ వ్రతాన్ని మొదలుపెట్టి చివరకు ఆ క్షీరసాగరమధనాన్ని ప్రస్తావిస్తూ వ్రత సమాప్తి చేసి ఆ దేవదేవుని సాయుజ్యాన్ని పొందారు ఆనాడు ఆ గోపికలు, ఈనాడు గోదాదేవి.

ఈ ముప్పై పాశురాలను భావార్ధాలతో సహా భక్తితో అధ్యయనం చేసి ఆచరించినంత ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. శ్రీకి శ్రీ ఐన స్వామి ఆ శ్రీతో కలిసి మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. తనలో చేర్చుకుంటాడు. అన్ని వయసులవారు, అన్ని ఆశ్రమాలవారు, అన్ని వర్ణాలవారు, అన్ని ప్రాంతాలవారు, శ్త్రీలు, పురుషులు. అందరూ భగవంతుని ప్రాప్తికై ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన కోరిన కోరికలు తీరును అని గోదాదేవి ఫలశ్రుతిగా చెప్పింది గోదాదేవి..ఈ తిరుప్పావై పాశుర టపాలకు ప్రేరణ, సహకారం.. చిత్రకవి ఆత్రేయ రచించిన తిరుప్పావై పూదండ. మరికొన్ని పుస్తాకాలు..

తిరుప్పావై --- 29 పాశురం

Filed under:


శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్

పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్

రాగం : కేదారగౌళ

తెలతెల వారకమున్నె వచ్చి నిన్ను సేవించి, నీ
సుందర పాదారవిందముల ప్రస్తుతి చేయుటకు
ప్రయోజనము వినుము - ఇదె వినుము! //తెల తెల //
మా గోకులమున అవతరించి మన్ననలందిన నీవు
మేము చేయు కైంకర్యము వలదనుట తగదు1
నీ విచ్చే పరవాద్యము మాకెందుకు గోవిందా!
ఏడేడు జన్మలకు.. ఎప్పటికీ నీతోనే
వీడని బంధము కావలె, నీ సేవల తరింపవలె
చిల్లర కోరికల కెల్ల చెల్లు చీటి వ్రాయించుము!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


మార్గశిరమాసంలో పెద్దల అనుమతి తీసుకుని నదీస్నానం చేయడనైకి పదిమంది గోపికలను మేల్కొల్పి తమతో తీసికెళ్లారు గోపికలు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని , అతని భార్యను నిద్రలేపి తమ వ్రతానికి కావలసిన పరికరాలు ఇవ్వమని కోరి, తమకు పర ఇచ్చి వ్రతం చేయించి సకలాభరణాలు, వస్త్రాలు, స్వామితో కలిసి పాయసాన్ని తినాలనే కోరుకున్నారు. కాని ఇప్పుడు వాళ్లందరూ తమ కోరికను మార్చుకున్నారు.


"తెల్లవారకముందే లేచి, స్నానం చేసి వచ్చి నిన్ను సేవించి, కీర్తించి మగలం పాడడానికి గల కారణాలు వినుము స్వామి. పశువులను మేపి జీవించే యాదవ వంశంలో అవతరించిన నీవు మేము చేసే సేవలను తిరస్కరించడం తగదు. మేము నీ నుండి పరవాద్యాన్ని తీసుకుపోవడానికి రాలేదు. ఎప్పటికి ఏడేడు జన్మాలకు కూడా నీతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. ఎటువంటి వాంఛలు లేకుండా నీకు సేవ చేయాలని ఉంది. దాని వలన మా జన్మ ధన్యమవుతుంది. అలాగే మేము పూజలు చేసేది, మంగళం పాడేది మాకోసం కాదు నీకోసమే. మమ్మల్ని పొందడానికే కదా నువ్వు మా గోపాలకుల కులంలో జన్మించావు. ఎన్నో కష్టాలు పడ్డావు..అందుకే మా సేవలు నువ్వు అందుకోక తప్పదు. ఎప్పటికీ నీ సన్నిధిలో ఉండి , నీ సేవలు చేయడానికి నియమించుకో. నీకు తులసీమాల వేయడానికి, ప్రసాదం పాత్ర తీసుకురావడానికి, హారతి ఇవ్వడానికి, పాదములొత్తడానికి, చామర వీయడానికి, తాంబూలం అందించడానికి, మంచి తీర్థం ఇవ్వడానికి, బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు కడిగి తుడవడానికి, అమ్మగారికి కబురందించడానికి మమ్మల్ని సేవకులుగా నియమించుకో..


అదేంటి . మీరు పరను కోరి వచ్చినవారు నాతోనే ఉండిపోతా అంటారేంటి? అని శ్రీకృష్ణుడు అడుగగా.. ఊరివారికోసం వ్రతం చేయడానికి పర అనే వాద్యం కావాలి కాని మాకెందుకు? నీ అంతరంగ కైంకర్యమే మాకు కావలసిన పర. ఎల్లప్పుడు నీతోనే ఉండేట్టుగా అనుగ్రహించు దేవా. శ్రీ మహాలక్ష్మి నిన్ను విడవకుండా ఎలా ఉంటుందో మమ్మల్ని కూడా అలాగే ఉండనివ్వు..అందుకు మాలోని ఇతరములైన కోరికలను పోగొట్టు. ఇదే మా కోరిక!

తిరుప్పావై --- 28 పాశురం

Filed under:కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్

అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్


రాగం: వలజి

ఆలమందల తోడి అడవులలో పడి తినెడి
కుడియడమ తెలియని గోపకులజులము
నీవు తోడ పుట్టిన పుణ్యమే మా పుణ్యము //ఆల//
కొరత కొంచెం లేని గోవిందా! నీతోడి
సంబంధము కాదన్న పోవునది కాదురా!
లోకమర్యాదల లోతెరుంగని లేమలము
చిన్న పేరున నిన్ను ప్రేమతో పిలిచేము
కోపగించక స్వామీ! కరుణించి పరనిమ్ము!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.గత పాశురంలో దివ్యమైన ఆభరణాలు, వస్త్రాల పేరుతో భగవంతుని సాన్నిహిత్యాన్ని కోరిన గోపికలను వాటిని అందుకోవడానికి మీకున్న యోగ్యత ఏమిటి అని అడిగాడు శ్రీకృష్ణుడు." మాకున్న పశువులను మేపుకుంటూ అడవిలో తిరుగుతూ దొరికింది తినడమే మా జీవనంగా ఉన్నాము. ఏమీ తెలియని మా గోపవంశంలో నీవు జన్మించడం వల్ల దొరికినదే మా పుణ్యం. మాలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా అన్నీ తీర్చగలిగే లోపరహితుడవు నీవు. గోవిందా! నీతో మాకు గల సంబంధం వదులుకుందామన్నా పోయేది కాదు.మాకు లోకంలోని మర్యాదలు అంతగా తెలీవు అందుకే ప్రేమతో నిన్ను చిన్నపేరుతో పిలుచుకుంటున్నాము. అందుకు కోపగించుకుని మాపై దయ చూడడం మానకు దేవా. మేము కోరిన పరను ఇవ్వు"గోపికలు తమ ఆవులను ఆచార్యులుగా, అడవే ఒక గురుకులంగా , తినే ఆహారమే వారి విద్యగా భావిస్తున్నారు. అందుకే భగవంతుని ప్రాప్తి పొందడానికి తమకు అర్హత లేదని అనుకుంటున్నారు. శ్రీకృష్ణుడి గోపికలకు ఏదో ఒక అర్హత ఉందని నిరూపించి తమను స్వీకరింపడేమో, వదిలిపెడతాడేమో అని భావించిన గోపికలు తమకు ఏమీ తెలియదని, తాము చేసేదంతా పొట్టకూటికే తప్ప కర్మయోగం కాదని చెప్తున్నారు. మా ఆహారంలో పరిశుద్ధి లేదు. అటువంటప్పుడు మాకు ఆత్మజ్ఞానమెలా కలుగుతుంది. నీవు మా వంశంలో జన్మించడమే మేము చేసుకున్న గొప్ప పుణ్యం. అంతకంటే వేరే యోగ్యత ఉండునా? అలాగే నువ్వు, మేము ఇద్దరమూ ఏమీ లేనివారమే. మాకు జ్ఞానం లేదు నీకు జ్ఞానకొరత లేదు. మాకు లేనిది నీవే కదా ఇవ్వాల్సింది. మాతో సంబంధం వదులుకుందామన్నా అది సాధ్యం కాదు. సకలజగత్తుకు నీవు ఆత్మవైతే మేము శరీరం. ఈ బంధం ఎన్నటికీ వీడేది కాదని నీకు తెలియదా స్వామి అని అమాయకంగా చెప్పారు వారంతా. స్వామికి ఎన్నో పేర్లు ఉన్నా తమ సౌలభ్యం కోసం చిన్న పేరుతో పిలిచినందుకు కోపగించకుమని కోరుతున్నారు. గోపికలు శ్రీకృష్ణుడే తమ సర్వస్వమని ఆశ్రయించారు కాబట్టి తమకు ఉన్న యోగ్యత, సాధన, పుణ్యము అన్నీ ఆతనే అని అఖండ విశ్వాసంతో నమ్మి ప్రకటించారు.

తిరుప్పావై --- 27 పాశురం

Filed under:


కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై

ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: భాగ్యశ్రీ

కూడని వారిని కూడించే గోవిందా! నిను
కీర్తించి పరను పొంది, జగము పొగడ
మేము పొందు సమ్మానము, అపురూపము // కూడని //
కంకణములు, భుజకీర్తులు, చెవిదుద్దులు, జుమికీలు
మెట్టెలు, పట్టీలు అనగ పలు ఆభరణములు
ఉడుపులు ధరించి - ఆపై క్షీరాన్నము
మునుగ నేయి పోసి - మోచేతుల జార నీతో కలసి
చల్లగా హాయిగా ఆరగింతుము గాక!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.నిన్నటి పాశురంలో గోపికలు అడిగిన అన్ని వ్రత సామగ్రిని పరమాత్మ సమకూర్చాడు. ఇపుడు ఈ వ్రతం ఆచరించినందువల్ల తమకు కలిగే ఫలం గురించి గోపికలు వివరిస్తున్నారు."నీతో చేరని వారిని కూడా జయించే కళ్యాణ గుణాలుకలిగిన గోవిందుడా! నిన్ను కీర్తించి, నీ సహకారంతో వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి మేము పొందబోయే లాభం లోకాలన్నీ ప్రశంసించే విధంగా ఘనంగా ఉండాలి. చేతులకు కంకణాలు, భుజాలకు దండకడియాలు, చెవులకు దుద్దులు, పూలు, కాలికి పట్టీలు మొదలైన ఆభారణాలెన్నో మేము ధరించి, మంచి బట్టలు కట్టుకోవాలి. ఆ తర్వాత పాలు అన్నం, అది మునిగేటట్టుగా నేయిపోసి వండిన పాయసం మోచేతి మీదవరకు జారేవిధంగా నీతో కలిసి సంతోషంగా తినాలి. ఇదే మా వ్రతఫలం కావాలి స్వామీ"

భక్తునితో కూడి ఉండనివారు నాలుగు విధాలుగా ఉంటారు. మహాభక్తులైన ఆళ్వార్లు, ప్రణయంతో దూరమైన గోపికలు, కోపం, పగతో ద్వేషించే కంసుడు, దుర్యోధనుడు లాంటివారు, స్నేహం, ఉదాసీనతతో దూరమయ్యే మనలాంటి సామాన్య భక్తులు. కాని తన సౌశీల్యంతో, ప్రేమతో, పరాక్రమంతో అందరినీ వశపరుచుకుంటాడు శ్రీకృష్ణుడు. వ్రతానికి కావలసిన పరికరాలను అడిగి తీసుకున్న గోపికలు వ్రతం పూర్తి చేసాక కృష్ణుడు తమకు సన్మానం చేయాలని కోరుకుంటున్నారు. అది కూడా లోకం పొగిడే రీతిలో ఘనంగా ఉండాలంట. ఈ సన్మానం ఆ పరమాత్మను చేరడమే లక్ష్యం గా కలిగింది. ఈ సన్మానంలో వారి కోరికలు ఇలా ఉన్నాయి .. వారు కోరే ఆభరణాలు వధూవరులు (ఆత్మ, పరమాత్మ) పాణిగ్రహణ సమయంలో ఉపయోగపడేవే కావడం విశేషం. సంసారమనే సాగరంలో దిగుతున్న వ్యక్తి తనను ఉద్ధరించేవాడి హస్తానికై ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురుచూసే సమయంలో జీవుడికి, భగవంతుడికి మధ్య ఉండే అజ్ఞానమే వివాహ ప్రారంభంలో వధూవరుల మధ్య పట్టే తెర. వధువు చేతిని వరుని చేతిలో పెట్టి కన్యాదానమొనర్చే తండ్రే గురువు. ఆ తర్వాత ఆ తెర తొలగిపోతుంది. ఆ సమయంలోనే ధరించడానికి చేతికి కంకణాలు కోరుతున్నారు గోపికలు. ఆ తర్వాత వధూవరులు ఎదురెదురుగా ఉండక ఒకే పీటపై పక్క పక్కనే కూర్చుని వివాహకార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఒకరి భుజాన్ని మరొకరు తాకుతూ ఉంటారు. అందుకే ఆ భుజాలకు అందమైన దండకడియాలు కావాలట. ఆచార్యులు సమాశ్రయణం చేసేటప్పుడు పరమాత్మకు ముంద్రించే శంఖచక్రాలే ఈ ఆభరణాలు.భర్త(పరమాత్మ)తో చేరి శయనించి గుసగుసలు వినే సమయంలొ చెవులకోసం దుద్దులు, పూలు కావాలట. గురువులు వినిపించే రహస్యాలలో తిరుమంత్రం చెవి దుద్దు కాగా, ద్వయమంత్రం చెవి పూలు.. ఒకటి భక్తి ఒకటి జ్ఞానం. చివరి చరం శ్లోకం కాలి అందియలు. తర్వాత మంచిగా దుస్తులు ధరిస్తారట. స్త్రీకి ఎన్ని ఆభరణాలు ఉన్నా మంచి వస్త్రాలు లేనప్పుడు అందం, ప్రయోజనం లేదు కదా. అదేవిధంగాఅత్మగుణాలు ఎన్ని ఉన్నా కూడా శేషత్వ జ్ఞానం లేనప్పుడు అది శోభించదు. ఎంత జ్ఞానం ఉన్నా కూడా మంచి నడవడి లేనప్పుడు ప్రయోజనం ఉండదు. ఈ ఆభరణాలు, దుస్తులు ధరించి నేయిలో మునిగేట్టుగా పాలన్నం లేదా పాయసం తయారు చేసుకుని శ్రీకృష్ణుడితో కలిసి కూర్చుని ఆనందంగా తినాలట. పరమాత్మ అన్నం కాగా, అందులోని పాలు ఆతని కళ్యాణగుణాలు, నెయ్యి భగవంతుని యందు ప్రీతి. ఆ పరమాత్మతో కలిసి ప్రీతిగా ఆయన కళ్యాణ గుణాలను ఆస్వాదిస్తామని కోరుకుంటున్నారు.

తిరుప్పావై --- 26 పాశురం

Filed under:


మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్

మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: చక్రవాకం

మాలే! మణి వర్ణా! మార్గళి స్నానం చేసి
పెద్దలు చేసిన రీతిని సిరినోము నోచుటకు
ఏమేమి కావలనో స్వామీ! ఇక విందువా! // మాలే //
పాలవలె తెల్లని పాంచజన్యమును పోలు
లోకాలు కంపింప మ్రోయు శంఖములు,
పెద్ద పరవాద్యము, మంగళాశాసనపరులు,
మంగళ దీపాలు, ధ్వజము, చాందినీలు
కృపసేయుమా! మావటపత్రశాయి!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము

ఇక గోఫికలు స్నాన వ్రతం పూర్తి చేయబోతున్నారు. ఈరోజు నుండి 'నీరాట్టం' అంటారు. అంటే స్నానం ప్రారంభమైందన్నమాట. ఇక్కడ స్నానం అంటే నదిలో మునగడం కాదు. భగంతుని అనుభవంలో మునిగి అహంకార మమకారాలను తొలగించుకోవడం. అందుకే ఈ బాహ్య, అంతర స్నానానికి కావాల్సిన పరికరాలను ఇవ్వమని శ్రీకృష్ణుని కోరుతున్నారు గోపికలు.

"ఆశ్రిత వ్యామోహ మూర్తి! (మాలే). ఇంద్ర నీలమణీని పోలిన శరీరకాంతి, స్వభావము కలిగినవాడా! ఈ మార్గశిర స్నాన వ్రతం చేయడానికి కావాలసిన పరికరాల గురించి చెప్తే వింటాము. ప్రపంచమంతా వణికిపోయేలా శబ్దం చేసే పాలవంటి తెల్లని నీ శంఖము వంటి శంఖాలు, పతాకాలు, మంగళ దీపాలు, విశాలమైన , చాల పెద్ద 'పర' వాద్యాలు కావాలి. మంగళగానం చేయడానికి భాగవతులు కావాలి. ఓ వతపత్రశాయీ! ఇవన్నీ మాకు సమకూర్చుము"

మనకు భగవంతుని మీద ఉన్న వ్యామోహానికంటే ఆ పరమాత్మకు మనమీద ఎక్కువ వ్యామోహం ఉంటుందంట. అందుకే గోదాదేవి శ్రీకృష్ణుడిని "మాలే" అని సంబోధిస్తుంది.ఆళ్వార్లు పరమాత్మను పొందడానికి చేసే ప్రయత్నాలకంటే అతను ఆళ్వార్లను పొందడానికి ఎక్కువ పాట్లు పడతాడు. గోపికలు పూర్వం పెద్దలు చెప్పినట్టుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పారు. మొదటగా కృష్ణుడి శంఖాన్ని కోరుకోవడంలో ఆ శంఖంతో పాటు కృష్ణుడు కూడా తమతో వస్తారనే ఆశ కనిపిస్తుంది. ఆత్మ పరంగా చూస్తే ఇది నదీ స్నానంకంటే పరమాత్రం ప్రాప్తి అనే స్నానంగా భావించవచ్చు. భగవంతుని కంటే ముందు భగవంతుని భక్తులను పొందడం చాలా ముఖ్యం. మంగళ శాసనాలు, భగవంతుని ప్రార్ధనలో నిష్టలైన భాగవతోత్తములచే ఆ స్వామిని కీర్తింపచేయాలి అని వారి ఆలోచన. అలాగే వారందరూ గుంపుగా పోవునపుడు ముందు మంగళశాసనపరులు, మంగళ దీపాలు దారి చూపాలి అనుకుంటున్నారు. తర్వాత ధ్వజము, చాందినీ (మేలుకట్టు) కూడా కావాలి. ఉత్సవంలో వెళ్ళేటప్పుడు దగ్గరగా, దూరంగా ఉన్నవారికి కూడా కంపడేలా ప్రత్యేకమైన ధ్వజం లేదా జండా కావాలి. అలాగే మంచు , వర్షం పడకుండా చాందినీ లేదా గొడుగు కావాలి. నారాయణుడి ధ్వజమైన గరుడుడిని, అనంత శేషుని కోరుకుంటున్నారు గోపికలు. స్వామి వారి వాహనాన్ని, తల్పాన్ని , శంఖాలను కోరుకోవడంతో వాటితో పాటు స్వామి కూడా వచ్చేస్తాడు కదా అనే ఆలోచనతో ఆ పరమాత్మను ప్రార్ధిస్తున్నారు ఆ గోపికలంతా..

పంచాంగం..

అనుసరించంఢి..

మీ రాశిఫలాలు చూసుకోంఢి