కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై

ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: భాగ్యశ్రీ

కూడని వారిని కూడించే గోవిందా! నిను
కీర్తించి పరను పొంది, జగము పొగడ
మేము పొందు సమ్మానము, అపురూపము // కూడని //
కంకణములు, భుజకీర్తులు, చెవిదుద్దులు, జుమికీలు
మెట్టెలు, పట్టీలు అనగ పలు ఆభరణములు
ఉడుపులు ధరించి - ఆపై క్షీరాన్నము
మునుగ నేయి పోసి - మోచేతుల జార నీతో కలసి
చల్లగా హాయిగా ఆరగింతుము గాక!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.



నిన్నటి పాశురంలో గోపికలు అడిగిన అన్ని వ్రత సామగ్రిని పరమాత్మ సమకూర్చాడు. ఇపుడు ఈ వ్రతం ఆచరించినందువల్ల తమకు కలిగే ఫలం గురించి గోపికలు వివరిస్తున్నారు.



"నీతో చేరని వారిని కూడా జయించే కళ్యాణ గుణాలుకలిగిన గోవిందుడా! నిన్ను కీర్తించి, నీ సహకారంతో వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి మేము పొందబోయే లాభం లోకాలన్నీ ప్రశంసించే విధంగా ఘనంగా ఉండాలి. చేతులకు కంకణాలు, భుజాలకు దండకడియాలు, చెవులకు దుద్దులు, పూలు, కాలికి పట్టీలు మొదలైన ఆభారణాలెన్నో మేము ధరించి, మంచి బట్టలు కట్టుకోవాలి. ఆ తర్వాత పాలు అన్నం, అది మునిగేటట్టుగా నేయిపోసి వండిన పాయసం మోచేతి మీదవరకు జారేవిధంగా నీతో కలిసి సంతోషంగా తినాలి. ఇదే మా వ్రతఫలం కావాలి స్వామీ"

భక్తునితో కూడి ఉండనివారు నాలుగు విధాలుగా ఉంటారు. మహాభక్తులైన ఆళ్వార్లు, ప్రణయంతో దూరమైన గోపికలు, కోపం, పగతో ద్వేషించే కంసుడు, దుర్యోధనుడు లాంటివారు, స్నేహం, ఉదాసీనతతో దూరమయ్యే మనలాంటి సామాన్య భక్తులు. కాని తన సౌశీల్యంతో, ప్రేమతో, పరాక్రమంతో అందరినీ వశపరుచుకుంటాడు శ్రీకృష్ణుడు. వ్రతానికి కావలసిన పరికరాలను అడిగి తీసుకున్న గోపికలు వ్రతం పూర్తి చేసాక కృష్ణుడు తమకు సన్మానం చేయాలని కోరుకుంటున్నారు. అది కూడా లోకం పొగిడే రీతిలో ఘనంగా ఉండాలంట. ఈ సన్మానం ఆ పరమాత్మను చేరడమే లక్ష్యం గా కలిగింది. ఈ సన్మానంలో వారి కోరికలు ఇలా ఉన్నాయి .. వారు కోరే ఆభరణాలు వధూవరులు (ఆత్మ, పరమాత్మ) పాణిగ్రహణ సమయంలో ఉపయోగపడేవే కావడం విశేషం. సంసారమనే సాగరంలో దిగుతున్న వ్యక్తి తనను ఉద్ధరించేవాడి హస్తానికై ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురుచూసే సమయంలో జీవుడికి, భగవంతుడికి మధ్య ఉండే అజ్ఞానమే వివాహ ప్రారంభంలో వధూవరుల మధ్య పట్టే తెర. వధువు చేతిని వరుని చేతిలో పెట్టి కన్యాదానమొనర్చే తండ్రే గురువు. ఆ తర్వాత ఆ తెర తొలగిపోతుంది. ఆ సమయంలోనే ధరించడానికి చేతికి కంకణాలు కోరుతున్నారు గోపికలు. ఆ తర్వాత వధూవరులు ఎదురెదురుగా ఉండక ఒకే పీటపై పక్క పక్కనే కూర్చుని వివాహకార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఒకరి భుజాన్ని మరొకరు తాకుతూ ఉంటారు. అందుకే ఆ భుజాలకు అందమైన దండకడియాలు కావాలట. ఆచార్యులు సమాశ్రయణం చేసేటప్పుడు పరమాత్మకు ముంద్రించే శంఖచక్రాలే ఈ ఆభరణాలు.



భర్త(పరమాత్మ)తో చేరి శయనించి గుసగుసలు వినే సమయంలొ చెవులకోసం దుద్దులు, పూలు కావాలట. గురువులు వినిపించే రహస్యాలలో తిరుమంత్రం చెవి దుద్దు కాగా, ద్వయమంత్రం చెవి పూలు.. ఒకటి భక్తి ఒకటి జ్ఞానం. చివరి చరం శ్లోకం కాలి అందియలు. తర్వాత మంచిగా దుస్తులు ధరిస్తారట. స్త్రీకి ఎన్ని ఆభరణాలు ఉన్నా మంచి వస్త్రాలు లేనప్పుడు అందం, ప్రయోజనం లేదు కదా. అదేవిధంగాఅత్మగుణాలు ఎన్ని ఉన్నా కూడా శేషత్వ జ్ఞానం లేనప్పుడు అది శోభించదు. ఎంత జ్ఞానం ఉన్నా కూడా మంచి నడవడి లేనప్పుడు ప్రయోజనం ఉండదు. ఈ ఆభరణాలు, దుస్తులు ధరించి నేయిలో మునిగేట్టుగా పాలన్నం లేదా పాయసం తయారు చేసుకుని శ్రీకృష్ణుడితో కలిసి కూర్చుని ఆనందంగా తినాలట. పరమాత్మ అన్నం కాగా, అందులోని పాలు ఆతని కళ్యాణగుణాలు, నెయ్యి భగవంతుని యందు ప్రీతి. ఆ పరమాత్మతో కలిసి ప్రీతిగా ఆయన కళ్యాణ గుణాలను ఆస్వాదిస్తామని కోరుకుంటున్నారు.