అరిషడ్వర్గాలు

Filed under:
దుఃఖాలకు మూలమైన అరిషడ్వర్గాలు

1.కామము - ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.

2. క్రోధము - కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.

3. లోభము - కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.

4. మోహము - తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

5. మదము - తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

6. మాత్సర్యము - తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.

ఈ అరిషడ్వర్గాలు శరీరములో చేరి మంచితనాన్ని దొంగిలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులగుచున్నారు. అరిషడ్వర్గాలనే దొంగలనుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది.

దాన గుణములు..

Filed under:
దైవత్వము సిద్ధించే దాన గుణములు…


1. రజోగుణ దానము - వచ్చినవారు చిన్నవారైననూ, పెద్దవారైననూ విసుగుకుంటు, పాత్రమెరుగక, నేను ధనవంతుడను నేను ఎంత ఇచ్చినా ఫర్వాలేదని తన అంతస్థుకు తక్కువగా ఎడమచేతితో పడవేయిట ఇది రజోగుణదానము. నిరర్ధకము.

2. తమోగుణదానము - పాత్రమెరుగకుండ, ఎవరు ఎంత దానము చేసినారో చూసి, ఎదో నల్గురు ఇచ్చినారు మనమివ్వకుంటే బాగుండదు అని ఎంతో కొంత ఇచ్చుట, ఇది తమోగుణదానము. నిష్ప్రయోజనము.

3. సత్వగుణదానము - వచ్చినవారు చిన్నవారైన,పెద్దవారైన సమానంగా చూసి, మాట్లాడి పాత్రమెరిగి తన అంతస్థుకు తగినట్లుగా, దానము చేయుట, ఇది సత్వగుణదానము మానవులకు శ్రేష్టము.

అష్టవిధ పుష్పములు..

Filed under:
భగవంతుని అనుగ్రహముకై అష్టవిధ పుష్పములు

1. అహింస - (జీవహింస చేయకుండుట) ప్రధమ పుష్పము.

2. ఇంద్రియ నిగ్రహము - (మాట్లాడకుండ, వినకుండ, కళ్ళతో చూడకుండ ఉండడము) పరమత్మునికి రెండవ పుష్పము.

3. సర్వభూతదయ - (పేదవారిని, రోగులను, నిస్సహాయులను ఆదరించుట, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టుట మొదలగునవి) మూడవ పుష్పము.

4. శాంతము - (అపకారము చేసిన వారికి ఉపకారము చేయడము, జరిగినది మన కర్మానుసారముగా వచ్చినదని భావించడము) నాల్గవ పుష్పము.

5. క్షమ - (తాను చేసిన తప్పులకు క్షమాపణ కోరడము, ఇతరులు చేసిన తప్పులను క్షమించడము) ఐదవ పుష్పము.

6. జ్ఞానము - (తెలియనిది తెలుసుకోవడము) ఆరవ పుష్పము.

7. తపము - (సదాదేవుని తలంచుటయే తపస్సు అనెడి) ఏడవ పుష్పము.

8 సత్యము (సత్యమును తెలుసుకొనుట) ఎనిమిదవ పుష్పము.

మనోనిగ్రహతకై నవవిధ భక్తి...

Filed under:
1. శ్రవణము (వినుట)

2. కీర్తనము ( పాడుట)

3. ధ్యానము (స్మరించుట)

4. దేవోపాసనము (ఉపవాస దీక్ష)

5. అర్చన (పూజ చేయుట)

6. వందనము (మ్రొక్కుట)

7. దాస్యము (సేవ చేయుట)

8. సత్యము ( సత్యమును తెలుసుకొనుట)

9. ఆత్మనివేదనము ( ఆత్మను నైవేద్యముగా అర్పించుట)

అష్ట విధ గురువులు - వారి లక్షణములు

Filed under:
1. బోధక గురువు - అనుభవ జ్ఞానము అవంతయును లేక, గ్రంధములలో ఉన్న విషయాన్ని మాత్రమే బోధించేవారు. వీరు బోధక గురువులుగా వ్యవహరింపబడతారు.

2. వైదిక గురువు - వేదాలలోని, వేదాంత భావములను వివరించువారు వైదిక గురువులుగా ప్రఖ్యాతి కెక్కుతారు.

3. ప్రసిద్ధ దేశికులు - ప్రతిఫలాన్ని ఏమీ ఆశించకుండానే, ఆధ్యాత్మిక బోధనను చేసేవారు ప్రసిద్ధ దేశిక గురువులనబడతారు.

4. కామ్యక గురువు - పాపపుణ్య క్రియల వల్ల సంభవించే, పాపపుణ్యముల ఫలితాల గురించి చెప్పేవారు కామ్యక గురువులు.

5. వాచక గురువు - అన్ని అంటి అంటకుండా ఉండే మార్గమనే వైరాగ్యమును తెలుపువారు వాచక గురువు అనబడతారు.

6. సూచక గురువు - ఏకాగ్రతతొ చూపు నిలిపి, కన్నులలో దర్శించే, విశ్వములోని కళలన్నీ ఏవిధంగా సాధ్యమవుతాయో తెలుపు గురువులు సూచక గురువులు అనబడతారు.

7. కారణ గురువు - ఇహలోక, సంపద సుఃఖాలపై, మోహమును పోగొట్టి, ముక్తి అనే సంపదను కైవసము చేయించగల గురువులు కారణ గురువులు అనబడతారు.

8. విహితోపదేష్ట - అంతు చిక్కని, అతి నిగూఢమైన , సృష్టి తత్వాన్ని బోధించి, విశ్వరూపుని దర్శించు మార్గమును చూపించే గురువులు విహితోపదేష్ట గురువులు అనబడతారు.

ధర్మసందేహాలు

Filed under:
ప్ర.ద్రౌపదికి అయిదుగురు పాండవుల వల్ల అయిదుగురు కుమారులు జన్మించారని అంటారు. వారు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ద్రోణుని కుమారుడు అశ్వద్ధామ చేతిలో మరణించారని అంటారు. వారి పేర్లు ఏమిటి?

జ. ద్రౌపదిని కుంతీదేవి ఆజ్ఞానుసారం పాండవులు అయిదుగురు వివాహం చేసుకున్నారు. నారదుని ఆజ్ఞానుసారం పాండవులు అయిదుగురు ఒక్కొక్క సంవత్సరంకాలం పాటు ద్రౌపదికి భర్తలుగావున్న తరుణంలో అయిదుగురు కుమారులు జన్మించారు. వారు ఉపపాండవులు. ధర్మరాజు కుమారుడి పేరుప్రతివింధ్యుడు. భీముని కుమారుడు సుతసోముడు. అర్జునుని కుమారుడు శృతకర్మ. నకులుని కుమారుడు శతానికుడు. సహదేవుని కుమారుడు శ్రుతసేనుడు. వీరు ద్రౌపదీ పుత్రులు. ఉపపాండవులుగా ప్రసిద్ధులయ్యారు. కురుక్షేత్ర సంగ్రామానంతరం అశ్వద్ధామ, దుర్యోధుని ఊరువులు భగ్నమవడం చూచి, కోపంతో అర్ధరాత్రి సమయంలో పాండవులవైపు అక్షౌహిణి సేనతోపాటు, ద్రుపదపుత్రుడు పాండవసేనాని అయిన దృష్టద్యుమ్నునితో సహా, ఈ అయిదుగురు ఉపపాండవులను వీరావేశంతో విచక్షణా రహితంగా తలలు కోసి సంహరించాడు.

ప్ర. భారతం పంచమవేదమంటారు. దానిలోని భాగాలకు పర్వములంటారు. అవి ఏమిటి?

జ. భారతం పంచమవేదం అన్నమాట నిజం. భారతం మూడు భాగాలు. అవి 1. ఆదిపంచకం.2.యుద్ధషట్కం. 3. శాంతిసప్తకం..
ఆది పంచకం: అంటే ప్రారంభ పర్వములు అయిదు. మొదటి విభాగం 1. ఆది పర్వం 2. సభాపర్వం 3.అరణ్యపర్వం 4.విరాటపర్వం
5. ఉద్యోగపర్వం. ఈ అయిదు పర్వాలకు ఆది పంచకం అని పేరు.

రెండవ విభాగం: యుద్ధ షట్కం. 1. భీష్మపర్వం 2. ద్రోణపర్వం 3.కర్ణ పర్వం 4. శల్యపర్వం 5. సౌప్తికపర్వం 6. స్త్రీపర్వం.
మూడవ విభాగం: శాంతి సప్తకం. ఏడు పర్వాలు. 1. శాంతిపర్వం 2. అనుశాసనికపర్వం 3. అశ్వమేధ పర్వం 4. ఆశ్రమవాస పర్వం 5. మౌనలపర్వం 6. మహాప్రస్థాన పర్వం 7. స్వర్గారోహణ పర్వం.

మహాభారతంలోని పర్వాలు పర్వాలు పద్ధెనిమిది.

శ్రావణ మాసం

Filed under:


సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం "శ్రావణ మాసం"

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.


శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.


పాడ్యమి - బ్రహ్మదేవుడు
విదియ - శ్రీయఃపతి
తదియ - పార్వతీదేవి
చవితి - వినాయకుడు
పంచమి - శశి
షష్టి - నాగదేవతలు
సప్తమి - సూర్యుడు
అష్టమి - దుర్గాదేవి
నవమి - మాతృదేవతలు
దశమి - ధర్మరాజు
ఏకాదశి - మహర్షులు
ద్వాదశి - శ్రీమహావిష్ణువు
త్రయోదశి - అనంగుడు
చతుర్దశి - పరమశివుడు
పూర్ణిమ - పితృదేవతలు






మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం

శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.


వరలక్ష్మీ వ్రతం


మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్లచవితి-నాగులచవితి

మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి

ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.





శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ


సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.


పూర్ణిమ - హయగ్రీవ జయంతి


వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.


కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి



క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.







కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి


ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.


కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య


ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

సృష్టి ఏర్పడిన విధానం - సృష్టి తత్వాలు

Filed under:



సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడే ఉండేవాడు. సృష్టికి కారణమైన మాయాశక్తి
ఆయనలో నిద్రాణమై ఉండేది. సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగినప్పుడు ఆయన
తన మాయాశక్తిని (ప్రకృతిని) జాగృతం చేసి, పురుషరూపంలో చైతన్య శక్తిని
ప్రవేశపెట్టాడు. అప్పుడు నామరూపాలు లేని (అవ్యక్త) మాయాశక్తి నుంచి
మహత్తత్వం ఆవిర్భవించింది. విజ్ఞానాత్మకమై, తమస్సును(అజ్ఞానాన్ని)
హరించే ఈ మాహత్తత్వం అనేక మార్పులు చెందగా అహంకారం అనే తత్వం
పుట్టింది. ఇది పంచభూతాలకు(కార్యరూపం), తన్మాత్రలకు (కారణరూపం),
ఆధారమై సాత్వికం, రాజసం, తామసం అనే మూడు విధాలుగా ప్రకటమై
వికారాలు చెందుతుంది. సాత్వికాహాంకారం వల్ల మనస్సు ఏర్పడి,
ఇంద్రియాలకు అధిదేవతలు ప్రకటమవుతారు. రాజసాహంకారం వల్ల కర్మేంద్రియ
జ్ఞానేంద్రియాలు, తామసాహంకారం వల్ల తన్మాత్రలు(శబ్దం,స్పర్ష, రూపం,
రసం, గంధం) ఏర్పడ్డాయి. శబ్దం వల్ల ఆకాశం ఏర్పడింది. ఆకాశం వికారం
చెందగా స్పర్శవల్ల వాయువు పుట్టింది. వాయువు వికారం చెందగా రూపం వల్ల
తేజస్సు పుట్టింది. తేజస్సు వికారం చెందినప్పుడు రసం ద్వారా జలం ఏర్పడింది.
జలం వికారం చెందినప్పుడు గంధం వల్ల భూమి ఏర్పడింది.

పంచాంగం..

అనుసరించంఢి..

మీ రాశిఫలాలు చూసుకోంఢి