సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడే ఉండేవాడు. సృష్టికి కారణమైన మాయాశక్తి
ఆయనలో నిద్రాణమై ఉండేది. సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగినప్పుడు ఆయన
తన మాయాశక్తిని (ప్రకృతిని) జాగృతం చేసి, పురుషరూపంలో చైతన్య శక్తిని
ప్రవేశపెట్టాడు. అప్పుడు నామరూపాలు లేని (అవ్యక్త) మాయాశక్తి నుంచి
మహత్తత్వం ఆవిర్భవించింది. విజ్ఞానాత్మకమై, తమస్సును(అజ్ఞానాన్ని)
హరించే ఈ మాహత్తత్వం అనేక మార్పులు చెందగా అహంకారం అనే తత్వం
పుట్టింది. ఇది పంచభూతాలకు(కార్యరూపం), తన్మాత్రలకు (కారణరూపం),
ఆధారమై సాత్వికం, రాజసం, తామసం అనే మూడు విధాలుగా ప్రకటమై
వికారాలు చెందుతుంది. సాత్వికాహాంకారం వల్ల మనస్సు ఏర్పడి,
ఇంద్రియాలకు అధిదేవతలు ప్రకటమవుతారు. రాజసాహంకారం వల్ల కర్మేంద్రియ
జ్ఞానేంద్రియాలు, తామసాహంకారం వల్ల తన్మాత్రలు(శబ్దం,స్పర్ష, రూపం,
రసం, గంధం) ఏర్పడ్డాయి. శబ్దం వల్ల ఆకాశం ఏర్పడింది. ఆకాశం వికారం
చెందగా స్పర్శవల్ల వాయువు పుట్టింది. వాయువు వికారం చెందగా రూపం వల్ల
తేజస్సు పుట్టింది. తేజస్సు వికారం చెందినప్పుడు రసం ద్వారా జలం ఏర్పడింది.
జలం వికారం చెందినప్పుడు గంధం వల్ల భూమి ఏర్పడింది.