అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది.తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకపోతే చెయ్యి చేసుకుంటుంది. అప్పుడు బిడ్డ తన తప్పు తెలుసుకుని సరయిన మార్గంలో అంటే అమ్మకు నచ్చే బాటలో పయనిస్తాడు. అదే అమ్మకు - బిడ్డలకూ ఉండే సంబంధం.ప్రకృతిమాత అయిన అమ్మకు కోపం వచ్చి కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుంది? ప్రకృతి విలయతాండవం చేస్తుంది.ఆ విలయంలో ఎన్నో అనర్ధాలు జరుగుతాయి, అంటురోగాలు ప్రబలుతాయి. అందుకే అమ్మకు కోపం రానీకుండా ప్రతియేటా జాతర,తిరునాళ్ళూ, ఉత్సవాలు జరుపుకుంటారు.





తెలంగాణా ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదు,సికిందరాబాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతి యేటా ఆషాఢమాసంలో చిన్న పెద్దా,బీదా బిక్కీ, ఆడా మగా, ముసలీ ముతకా అన్న భేధం లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. భోజనాలనే క్లుప్తంగా బోనాలు అంటారు. దీనినే బోనాల పండగగా తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దాదాపు నూట యాభై ఏళ్ళకు పైగా ఆనవాయితీగా జరుపుకుంటున్న పండగ ఇది.

ఈ బోనాల పండగ ముఖ్య ఉద్ధేశ్యం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా చల్లగా చూడమని కోరడమే. భక్తులందరూ ఆషాఢమాసంలో అమ్మవారికి భక్తితో భోజనాలు(బోనాలు) లేదా నైవేద్యాలు సమర్పించుకుంటారు. ఉగాది తర్వాత వచ్చే మొదటి పండగ ఇదే.





భోజనం లేదా బోనం అంటే శుచిగా అన్నం వండుకుని,పచ్చళ్ళూ,ఉల్లిపాయ ముక్కలు మొదలైనవన్నీ దానికి జత చేసి దానిని ఘటంలో లేదా శుభ్రంగా తోమిన ఇత్తడి గుండిగ లాంటి పాత్రలో వుంచి, పానకం,లేదా కల్లుని పానీయంగా మరో కుండలో ఉంచి దానిని పసుపు,కుంకుమ, సున్నం బొట్లతో అలంకరించి దానికి వేపాకు తోరణాలు కట్టి, ఘటపాత్ర మీద మట్టి ప్రమిదలో దీపం పెట్టి కొత్త బట్టలు కట్టుకున్న ఆడవారు తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు,డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్ళి అమంకు నివేదిస్తారు. దీనినే బోనాలు సమర్పించడం అంటారు. బోనాలు అందుకున్న అనంతరం అమ్మవారు చల్లగా చూడడటమే కాకుండా విస్తారంగా పంటలు పండిస్తుందని,కోరిన వరాలెల్ల ఇచ్చి తమ పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతుందని భక్తుల నమ్మకం.





అమ్మవారి సోదరుడు పోతరాజు. గ్రామంలోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా అడ్డుకోవడంలో పోతరాజు అక్కకు సహకరిస్తాడు. అందుకే బోనాల పండగనాడు పోతరాజులు ప్రత్యేకమైన వస్త్ర, వేషధారణతో అమ్మవారికి సమర్పించడం కోసం సిద్ధం చేసిన పలహారం బండి ముందు నాట్యం చేస్తారు. పూనకం వచ్చినట్టు విలయ తాండవం చేస్తారు.




బోనాల పండగ రంగం చెప్పడంతో ముగుస్తుంది. ఆదివారం బోనాల పండగ జరుపుకుంటే మరుసటిరోజు రంగం జరుగుతుంది.రంగం చెప్పడమంటే అమ్మవారు ఒక అవివాహిత శరీరంలోకి ప్రవేశించి నగర ప్రజలకు ఆ ఏడాది జరగబోయే మంచి చెడులను చెబుతుంది. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చికుండ మీద కాలు పెట్తి అమ్మవారివైపు దీక్షగా చూస్తూ పూనకంతో బూగిపోతూ భవిష్యత్తు చెబుతుంది.వేలాది మంది భక్తులు ఈ రంగం వినడానికి గుంపు కూడతారు.

ఆషాఢ మాసారంభంలో గోల్కొండలో కొలువై ఉన్న జగదంబికాలయంలో ఎదుర్కోలు వేడుకలతో ఈ బోనాల పండగ మొదలువుతుంది. పదిహేను రోజుల తర్వాత సికిందరాబాదు ఉజ్జయిని మహంకాళికి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం వారం రోజులకు లాల్ దర్వాజా, హైదరాబాదు మొత్తంలో బోనాల పండగ జరుపుకుంటారు. ఆఖరి సోమవారం రంగం చెప్పడంతో ఈ సంరంభం ముగుస్తుంది.



powered by ODEO