ప్ర.ద్రౌపదికి అయిదుగురు పాండవుల వల్ల అయిదుగురు కుమారులు జన్మించారని అంటారు. వారు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ద్రోణుని కుమారుడు అశ్వద్ధామ చేతిలో మరణించారని అంటారు. వారి పేర్లు ఏమిటి?

జ. ద్రౌపదిని కుంతీదేవి ఆజ్ఞానుసారం పాండవులు అయిదుగురు వివాహం చేసుకున్నారు. నారదుని ఆజ్ఞానుసారం పాండవులు అయిదుగురు ఒక్కొక్క సంవత్సరంకాలం పాటు ద్రౌపదికి భర్తలుగావున్న తరుణంలో అయిదుగురు కుమారులు జన్మించారు. వారు ఉపపాండవులు. ధర్మరాజు కుమారుడి పేరుప్రతివింధ్యుడు. భీముని కుమారుడు సుతసోముడు. అర్జునుని కుమారుడు శృతకర్మ. నకులుని కుమారుడు శతానికుడు. సహదేవుని కుమారుడు శ్రుతసేనుడు. వీరు ద్రౌపదీ పుత్రులు. ఉపపాండవులుగా ప్రసిద్ధులయ్యారు. కురుక్షేత్ర సంగ్రామానంతరం అశ్వద్ధామ, దుర్యోధుని ఊరువులు భగ్నమవడం చూచి, కోపంతో అర్ధరాత్రి సమయంలో పాండవులవైపు అక్షౌహిణి సేనతోపాటు, ద్రుపదపుత్రుడు పాండవసేనాని అయిన దృష్టద్యుమ్నునితో సహా, ఈ అయిదుగురు ఉపపాండవులను వీరావేశంతో విచక్షణా రహితంగా తలలు కోసి సంహరించాడు.

ప్ర. భారతం పంచమవేదమంటారు. దానిలోని భాగాలకు పర్వములంటారు. అవి ఏమిటి?

జ. భారతం పంచమవేదం అన్నమాట నిజం. భారతం మూడు భాగాలు. అవి 1. ఆదిపంచకం.2.యుద్ధషట్కం. 3. శాంతిసప్తకం..
ఆది పంచకం: అంటే ప్రారంభ పర్వములు అయిదు. మొదటి విభాగం 1. ఆది పర్వం 2. సభాపర్వం 3.అరణ్యపర్వం 4.విరాటపర్వం
5. ఉద్యోగపర్వం. ఈ అయిదు పర్వాలకు ఆది పంచకం అని పేరు.

రెండవ విభాగం: యుద్ధ షట్కం. 1. భీష్మపర్వం 2. ద్రోణపర్వం 3.కర్ణ పర్వం 4. శల్యపర్వం 5. సౌప్తికపర్వం 6. స్త్రీపర్వం.
మూడవ విభాగం: శాంతి సప్తకం. ఏడు పర్వాలు. 1. శాంతిపర్వం 2. అనుశాసనికపర్వం 3. అశ్వమేధ పర్వం 4. ఆశ్రమవాస పర్వం 5. మౌనలపర్వం 6. మహాప్రస్థాన పర్వం 7. స్వర్గారోహణ పర్వం.

మహాభారతంలోని పర్వాలు పర్వాలు పద్ధెనిమిది.