మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్

మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: చక్రవాకం

మాలే! మణి వర్ణా! మార్గళి స్నానం చేసి
పెద్దలు చేసిన రీతిని సిరినోము నోచుటకు
ఏమేమి కావలనో స్వామీ! ఇక విందువా! // మాలే //
పాలవలె తెల్లని పాంచజన్యమును పోలు
లోకాలు కంపింప మ్రోయు శంఖములు,
పెద్ద పరవాద్యము, మంగళాశాసనపరులు,
మంగళ దీపాలు, ధ్వజము, చాందినీలు
కృపసేయుమా! మావటపత్రశాయి!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము

ఇక గోఫికలు స్నాన వ్రతం పూర్తి చేయబోతున్నారు. ఈరోజు నుండి 'నీరాట్టం' అంటారు. అంటే స్నానం ప్రారంభమైందన్నమాట. ఇక్కడ స్నానం అంటే నదిలో మునగడం కాదు. భగంతుని అనుభవంలో మునిగి అహంకార మమకారాలను తొలగించుకోవడం. అందుకే ఈ బాహ్య, అంతర స్నానానికి కావాల్సిన పరికరాలను ఇవ్వమని శ్రీకృష్ణుని కోరుతున్నారు గోపికలు.

"ఆశ్రిత వ్యామోహ మూర్తి! (మాలే). ఇంద్ర నీలమణీని పోలిన శరీరకాంతి, స్వభావము కలిగినవాడా! ఈ మార్గశిర స్నాన వ్రతం చేయడానికి కావాలసిన పరికరాల గురించి చెప్తే వింటాము. ప్రపంచమంతా వణికిపోయేలా శబ్దం చేసే పాలవంటి తెల్లని నీ శంఖము వంటి శంఖాలు, పతాకాలు, మంగళ దీపాలు, విశాలమైన , చాల పెద్ద 'పర' వాద్యాలు కావాలి. మంగళగానం చేయడానికి భాగవతులు కావాలి. ఓ వతపత్రశాయీ! ఇవన్నీ మాకు సమకూర్చుము"

మనకు భగవంతుని మీద ఉన్న వ్యామోహానికంటే ఆ పరమాత్మకు మనమీద ఎక్కువ వ్యామోహం ఉంటుందంట. అందుకే గోదాదేవి శ్రీకృష్ణుడిని "మాలే" అని సంబోధిస్తుంది.ఆళ్వార్లు పరమాత్మను పొందడానికి చేసే ప్రయత్నాలకంటే అతను ఆళ్వార్లను పొందడానికి ఎక్కువ పాట్లు పడతాడు. గోపికలు పూర్వం పెద్దలు చెప్పినట్టుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పారు. మొదటగా కృష్ణుడి శంఖాన్ని కోరుకోవడంలో ఆ శంఖంతో పాటు కృష్ణుడు కూడా తమతో వస్తారనే ఆశ కనిపిస్తుంది. ఆత్మ పరంగా చూస్తే ఇది నదీ స్నానంకంటే పరమాత్రం ప్రాప్తి అనే స్నానంగా భావించవచ్చు. భగవంతుని కంటే ముందు భగవంతుని భక్తులను పొందడం చాలా ముఖ్యం. మంగళ శాసనాలు, భగవంతుని ప్రార్ధనలో నిష్టలైన భాగవతోత్తములచే ఆ స్వామిని కీర్తింపచేయాలి అని వారి ఆలోచన. అలాగే వారందరూ గుంపుగా పోవునపుడు ముందు మంగళశాసనపరులు, మంగళ దీపాలు దారి చూపాలి అనుకుంటున్నారు. తర్వాత ధ్వజము, చాందినీ (మేలుకట్టు) కూడా కావాలి. ఉత్సవంలో వెళ్ళేటప్పుడు దగ్గరగా, దూరంగా ఉన్నవారికి కూడా కంపడేలా ప్రత్యేకమైన ధ్వజం లేదా జండా కావాలి. అలాగే మంచు , వర్షం పడకుండా చాందినీ లేదా గొడుగు కావాలి. నారాయణుడి ధ్వజమైన గరుడుడిని, అనంత శేషుని కోరుకుంటున్నారు గోపికలు. స్వామి వారి వాహనాన్ని, తల్పాన్ని , శంఖాలను కోరుకోవడంతో వాటితో పాటు స్వామి కూడా వచ్చేస్తాడు కదా అనే ఆలోచనతో ఆ పరమాత్మను ప్రార్ధిస్తున్నారు ఆ గోపికలంతా..