అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్

రాగం : భూపాల

అల ఇల కొలిచిన చరణాలకు మంగళం!
ఆ లంకను గూల్చిన అతి బలునకు మంగళం! // అల ఇల //
శకటాసురు కాల్ రాచిన యశస్వికి మంగళం!
అసుర ద్వయమును అణచిన అడుగులకు మంగళం!
గోవర్ధనమును గొడుగుగనెత్తిన గుణనిధికి జయ మంగళం!
వైరుల వధియించు నీ వేలాయుధమునకు మంగళం!
అని అని నీ వీర చరితము గానము జేసి
పరను పొందగ వచ్చేము కరుణించవయ్యా!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.
నిన్నటి పాశురంలో శ్రీకృష్ణుడిని మేల్కొల్పి శౌర్యసింహంలా నడిచి రమ్మని ప్రార్ధించారు గోపికలు. కాయ పరిపక్వం చెంది పండుగా మారినట్టు గోపికల జ్ఞానం పరిపూర్ణమై ప్రేమగా మారింది. అందుకే స్వామియొక్క దివ్యమంగళ రూపం చూసిన తర్వాత వారు ప్రేమ పారవశ్యంతో పరమాత్మయే రక్షకుడు అని మరచి తామే అతనిని రక్షించాలని పూనుకుంటారు. ప్రీతిగా స్వామికి సేద తీరేలా మంగళశాసనం పలుకుతున్నారు. ఈ సంప్రదాయం దేవాలయాలలో , గృహంలో పూజాకార్యక్రమాల తర్వాత చివరిగా మంగళశాసనం పలుకుతారు. స్వామిని దర్శించుకున్న ఆనందంలో గోపికలు తమకోసం కోరుకోవడం మరచిపోయి శ్రీకృష్ణుడికి మంగళం పాడుతున్నారు.


"ఆనాడు వామనుడవై ముల్లోకాలను కొలిచిన పాదాలకు మంగళం. రావాణాసురుడిని సంహరించి లంకను ద్వంసం చేసిన బాహుబలానికి మంగళం. శకటాసురుని కాలితో తన్ని నేలకూల్చిన యశస్సుకు మంగళం. వత్సాసురుని కపిత్తాసురునిపై విసిరినపుడు స్థిరంగా నిలబెట్టిన దివ్యపాదాలకు మంగళం. గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుమీద నిలబెట్టి గోవులను, గోకులాన్ని కాపాడిన ప్రేమ, వాత్సల్యాలకు మంగళం. శత్రువులను సమూలంగా నాశనం చేసిన చేటిలోని వేలాయుధానికి మంగళం. నీ వీరగాధలను కీర్తించి పురుషార్ధం (పర) అనే వ్రతసాధనాన్ని పొండడానికి మేము వచ్చాము. అనుగ్రహింపు స్వామి!"


బలిచక్రవర్తి నుండి దానం తీసుకున్న వామనుడు తన కాలితో కొలిచి తీసుకుని దేవతలకు ఇచ్చాడు. అది తీసుకున్న దేవతలు సంతోషంగా వెళ్లిపోయారు. కాని ఆ స్వామి పాదాలు ఎంతగా శ్రమపడ్డాయో మంగళం పాడాలని వారికి అనిపించలేదు. నిద్రనుండి మేల్కొన్న శ్రీకృష్ణుడి నీలాదేవితో వచ్చి సింహాసనం మీద కూర్చుండి ఒక పాదాన్ని కింద పీఠం మీద ఉంచి రెండవ పాదాన్ని తొడపై పెట్టుకుని కూర్చున్నాడు. అప్పుడా స్వామి పాదం ఎర్రగా కనిపించింది. అది సహజమని కూడా వారికి తోచలేదు. ప్రేమాతిశయంతో స్వామి పాదం కందిపోయిందే అని ఎప్పుడో వామనావతారంలో ఆ పాదం పడిన శ్రమకు మంగళం పాడుతున్నారు ఈ పాశురంలో..

శకటాసురుని ప్రస్తావన ఎందుకొచ్చింది అంటే. శకటం అనేది బండి. అది మనుష్యులను ఒకచోటినుండి ఇంకోచోటికి చేర్చే సాధనం. అదేవిధంగా ఆత్మను ఒక శరీరం నుండి మరో శరీరానికి మార్చే బండి మన కర్మ. స్వామి దివ్య పాదం తాకినంతనే ఆ కర్మ అనే శకటం విఱిగి భగవంతుని సాయుజ్యం లభిస్తుంది. కపిస్తాసుర వృత్తాతంలో వత్సాసురుడు రుచి, కపిత్థాసురుడు వాసన. ఈ రెండు కూడా తొలగాలి. సర్వ పదాలను పరమాత్మయే ప్రతిపాదిస్తాడనేదానికి నిదర్శనం గోవర్ధనగిరి ఎత్తడం. ఈ పాశురంలో మరో విశిష్టత ... షడ్రుచుల వలె గోపికలు ఆరుసార్లు పరమాత్మకు మంగళం పాడారు.