మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం

శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్


రాగం : మలయమారుతం

వానకారున కొండగుహలో, ఒద్దికగా
నిదురించిన శౌర్యరాశి సింహం
మేల్కాంచి, ఠీవిగ చూచి, జూలు విదిల్చి
మేను చాచి, గర్జించి బయలుదేరు రీతి
అతసీ సుమవర్ణా! అరుదెంచకయ్యా //వానకారున //
కోవెల నుండి కొలువు కూటమికి విచ్చేసి
మనోహర మహిత సింహాసనము నెక్కి
మా కార్యమ్ము మదినెంచి, మమ్ము మన్నించి,
కృపసేయుమా వేగ చిన్నికృష్ణయ్యా!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

చివరికి గోపికలు శ్రీకృష్నుడిని మేల్కొల్పగలిగారు. స్వామి కళ్లు విప్పి చూశాడు. స్వామీ! ఇక లేచిరా! అని ప్రార్ధిస్తున్నారు గోపికలు. మామూలుగా కాకుండా సింహంలా ఎలా నడిచిరావాలో చెప్తున్నారు ఈ పాశురంలో. ఈ పాశురంలో సృష్టిక్రమం వివరిస్తున్నారు.

"పర్వత గుహలో వర్షాకాలంలో చలనము లేకుండా పడుకుని నిద్రపోయిన సింహం మేలుకుని తీక్షణంగా చూస్తూ, వాసన వేసే జూలుని విదుల్చుకుని, అన్నిదిక్కులా దొర్లి, దులుపుకుని అటు ఇటు చాపి గర్జిస్తూ భారీ శరీరంతో గుహబయటకు వచ్చినట్టుగా నీవు కూడా నీ అంతఃపురం నుండి బయటకు వచ్చి శ్రేష్టమైన ఈ సింహాసనాన్ని అధిష్టించి మా కోరికలను పరిశీలించి దయ చూపమని వేడుకుంటున్నాము" అని అన్నారు గోపికలు.

ఇక్కడ సృష్టిక్రమం వివరించబడింది. సృష్టికి ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన తెలివి తెచ్చుకుని లేవాలని అనుకున్నాడు. ఆతను తీక్షణంగా చూసాడు. అప్పుడు జరిగింది సృష్టి రచన. పృద్వి, జలం, భూతసృష్టి, పర్వాతలు అన్నీ ఆవిర్భవించాయి. స్వామి సింహంలా బయటకు రాగానే ఆతని రూపు కనిపించింది. అతను పడుకున్నప్పుడు ఏమీ తెలియలేదు. అందరికీ కనపడే జగత్తు స్వామి యొక్క రూపం. లోపల నిద్రపోయేటప్పుడు స్వామి ఉన్నా ఆతని రూపం మనకు కనిపించలేదు.స్వామి ఒకోసారి విశ్వంగా దర్శనమిస్తాడు. విశ్వంలో తాను ఒకటై , విశ్వాంతర్యామిగా కూడా కనిపిస్తాడు. ఒక్కసారి అలా కూర్చుని మేము ఎందుకు వచ్చామో పరిశీలించి దయచూడుము అని అడుగుతున్నారు. భక్తుల మనోరధాలను తెలుసుకుని వారు కోరకముందే తీర్చడం స్వామి బాధ్యత. అందుకే సాధన చేయకుండా స్వామి కృప కోసం వచ్చారు. స్వామి కృప చేసినప్పుడే వారి అహంకారం తొలగిపోతుంది. అందుకే అతనుసింహంలా నడిచి రావాలి అంటున్నారు గోపికలు. అందుచేత ఈ పాశురంలో ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తూ అందులో ఒక పర్వతాన్ని, సింహాన్ని, దాని నడకలో అందాన్ని అనుభవించండి. అలాగే స్వామి నడకను చూడండి, ఆ రూపాన్ని, అందాన్ని చూసి ఆనందాన్ని పొండండి. అని చెప్పబడింది.