తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

రాగం : అమీర్ కళ్యాణి

మేలి రతనాల మేడలో చుట్టూ దీపాలు వెలుగ
ధూపాలు వీవ, మేలితల్పాన నిదురించు
మా మామ కూతురా! మణితలుపు గడి తెరువు // మేలి రతనాలు //

అత్తా! ఆమెను లేపవమ్మా! నీ తనయ
మూగదా లేక చెవిటిదా? అలసినదా?
కావలి ఉంచిరా! మంత్రము వేసిరా!
మహా మాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని
పలు తిరునామములు అనుసంధించుము - ఆమె మేల్కొనగ
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..

ఇంతకుముందు రెండు పాశురాలలో శ్రవణం యొక్క ప్రాధాన్యత చెప్పబడింది. 8 - 12 పాశురాలలో మననం, ధ్యాన ప్రాముఖ్యం గురించి నిరూపించబడింది. అట్టి ధ్యానంలో పరాకాష్ట చెందిన గోపికను ఈనాడు మేల్కొపుతున్నారు..

నీ మేడ ఉజ్వలము, పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. ఆ మేడలో మెత్తని పాన్పుపై కళ్ళుమూసుకుని హాయిగా నిద్రపోతున్నావు. నీ చుట్టూ దీపాలు ప్రకాశిస్తున్నాయి. అగరుధూపాల పరిమళాలు వ్యాపించాయి. ఇంకా నిద్రపోతున్న ఓ అత్త కూతురా! లేచి మణికవాటము యొక్క గడియను తీయుము. అత్తా! నువ్వైనా ఆమెను లేపరాదా? ఏం? నీ కూతురు మూగదా? లేక చెవిటిదా? లేక అలిసిపోయి ఉన్నదా? ఎవరైనా నువ్వు కదిలితే మేము ఊరుకోము అని కట్టడి చేసి కాపలాగా ఉన్నారా? అలా మొద్దు నిద్రపట్టేట్టుగా ఎవరైన మంత్రం వేసారా?అయితే మాధవా! మాయావీ! వైకుంఠవాసా! ఆని ఆ నారాయణ నామస్మరణ చేసి ఆమెను మేల్కొలుపు. ఆమె లేచి మాతో వచ్చి చేరుతుంది. అని గోదాదేవి గానం చేసింది.

ఈనాటి గోపిక స్థితి వశీకావస్థలో ఉంది. భగవంతుదే సర్వస్వం అని తెలుసుకున్నదై ఆతని చేరడానికి ఆరాటపడక స్వప్రయత్నం పూర్తిగా వదిలిపెట్టి ఏ పనీ చేయక మూగ, చెవుడు కమ్మినట్టుగా గాఢనిద్రలో ఉంది. ఆ మేడ పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. భగవంతునితో జీవునికి గల సంబంధాలు కూడా తొమ్మిది విధాలు. 1.తండ్రి. 2. రక్షకుడు 3. శేషి. 4. భర్త. 5. జ్ఞేయుడు 6. స్వామి 7. ఆధారము 8. ఆత్మ 9.భోక్త.. ఈ నవవిధాలతో పరమాత్మను కూడి ఉండడమే ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞలో స్థిరంగా ఉండడమే స్తితప్రజ్ఞత. ఆ మేడలో దీపాల వెలుగుతో పాటు అగరు ధూపం పరిమళిస్తుంది. జ్ఞానం దీపంవంటిది కాగా ఆచరణ సుగంధం వంటిది. ఈ రెండు కలిగినవారికి ఆ భగవదనుగ్రహం సులువుగా లభిస్తుంది. ఈనాటి గోపిక సర్వభోగములు తన చుట్టూ పెట్టుకుని కూడా వాటిని అనుభవించకుండా తన మనస్సులో భగవంతుని నిలుపుకుని వశీకావస్థలో ఉంది. గోదాదేవి ఇతర గోపికల భగవన్నామస్మరణలు విని లేచి బయటకు వచ్చి వాళ్లతో కలిసింది.