నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్

మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్


రాగం: పూరీ కళ్యాణీ

నోచి స్వర్గభోగముల తేలేటి ఓ తల్లి!
తలుపు తీయకున్నావు! మాటయిన అనరాదా
తులసి కిరీటధారి నారాయణుని మనము
సేవించితే చాలు - పరనొసగు పుణ్యమూర్తి
ఆనాడు శ్రీరామునిచే మృత్యువు వాతబడిన
కుంభకర్ణుడు ఓట్ అతని గాఢ నిద్ర నీకొసగెనా?
నిద్రమత్తుని వీడి ఓ నీలవేణి!
తెప్పరిల్లుచు వచ్చి తలుపు తీయగరావె!
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


ఈరోజు నిద్ర మేల్కొలిపే గోపిక శ్రీకృష్ణుని పొరుగింటి పిల్ల. ఈమె తనకు తానుగా కృష్ణుడికోసం ఎదురు చూసేది కాదు. ఆ కృష్ణుడే తన వద్దకు వస్తాడనే నమ్మకం కల చిన్నది. ఈ గోపిక ఫలితం వచ్చినా రాకున్నా దాని వల్ల వచ్చే లాభనష్టాలన్నీ భగవంతుడివే కాని తనవి కావనే నిశ్చింతతో నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు మనసు తప్ప ఇంద్రియాలన్నీ పని మానేస్తాయి. కాని ఆ మనసు మాత్రం పరమాత్మనే తలుచుకుంటూ ఉంటుంది. అలా నిద్రపోతున్న గోపికను గోదా, మిగిలిన గోపికలు కాస్త వ్యంగ్యంగా మేల్కొల్పుతున్నారు.


"ఏమమ్మా! మాకంటే ముందే నోము నోచుకుని స్వర్గంలోకి ప్రవేశించావా? పోనీ వాకిలి తెరవకున్నా పర్లేదు. ఈ ఒక్క మాటైనా చెప్పు. పరిమళించే పవిత్రమైన తులసీదళాలు ధరించిన నారాయణుడు మాచే వేనోళ్ల కొనియాడబడి మాకు పురుషార్ధాన్ని ఇస్తున్నాడు కదా. ఆ రామచంద్రుని మూలంగా మృత్యువు నోటిలోకి త్రోయబడిన కుంభకర్ణుడు నీతో అతని గాఢనిద్రను పణంగా పందెం కాచి ఓడిపోయి నీకు ఇచ్చి వెళ్ళాడా? చెప్పమ్మా! మరీ ఇంత మొద్దు నిద్దరైతే ఎలాగమ్మా? మాకందరికి అరుదైన శిరోభూషణమైనదానివి నీవే కదా తల్లీ. ఇకనైనా నిద్ర లేచి వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు....


ఇక్కడ స్వర్గమనగా భగవదనుగ్రహం. ఆనందము. భగవంతునితో కలిసి ఉండడమే స్వర్గంతో సమానం. అంతేకాక ఈ పొరుగింటి గోపిక కోసం ఆ శ్రీకృష్ణుడే వ్రతం చేస్తున్నాడంట.. ఒకరిని పొండడానికి ఒకరు వ్రతం చేస్తున్నారు. అందుకే ఆ దేవదేవుడు ధరించే తులసీమాలల సౌరభాలు బయటకు కూడా వస్తున్నాయి. ఆ పరమాత్మ వద్దకు వెళ్లి మనమేమీ అడిగే పని లేదు. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. మనకు కావలసిన వన్నీ తానే తెలుసుకుని ఇస్తాడు.