కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు

శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎన్బావాయ్


రాగం: కేదారగౌళ

వేల లేగదూడల ఆవుల పాలు వేగ పిడికెడువారు
అరుల బలము అణగ పోరు సైపెడువారు
దోషమించుక లేని గోప వంశస్వర్ణలతా!
పుట్టలోని పాము బోలు కటికల వనమయూరీ!
రావే! వయ్యారీ! రావే! శ్రీమంతురాలా! //లేగదూడల//
చుట్టాలు చెలులూ అందరు నీ ముంగిట నిలచీ
నీలమేఘ శ్యామ సుందరుని కీర్తింప
ఉలుకవు పలుకవు నీ నిద్రకర్ధమేమి?!
చెలియరో చెప్పవే - వేగ మేల్కొనవె
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..


ఈరోజు నిద్ర మేల్కొల్పే గోపిక కులంలో, గుణంలో, అందంలో మిన్నయైనదై కృష్ణుడివలెనే వ్రెపల్లెలో అందరి మన్ననలను పొందింది. భగవంతుని కైంకర్యమే ఐశ్వర్యంగా భావిస్తుంది ఈ గోపిక. వివిధములైన ధర్మములను ఆచరిస్తూ వాటి ఫలితములకోసం ఎదురుచూడక అవి భగవదారాధనా రూపాలని భావిస్తుంది.


ఈ గోపికను గోదాదేవి ఇలా మేల్కొపుతుంది. "లేగదూడలు కల ఆవులైనా దూడలవలె ఉన్న పలు ఆవుల మందల పాలు పితికేవారు, శత్రువులను బలాన్ని నశింప చేయడానికి యుద్ధం చేసేవారు, ఎట్టి దోషము లేనివారైన గోపాలవంశాన జన్మించిన ఓ స్వర్ణలత! పుట్టలోని పామువలె నున్న నడుము గలదానా! వనమయూరీ! సంపన్నురాలా! రమ్ము. చుట్టాలు, చెలికత్తెలు అందరూ వచ్చారు.. నీలమేఘశ్యాముడైన ఆ శ్రీకృష్ణుని నామాలను గానం చేస్తున్నారు. అయి నా నీవు ఉలకవు. పలకవు. దేనికోసం ఇంతగా నిద్రిస్తున్నావో చెప్పమ్మా!"


వ్రేపల్లెలోని ఆవులు దూడలు కలిగి ఉన్నా కూడా శ్రీకృష్ణుని వేణుగానము, స్పర్శచే సమృద్ధిగా పాలు ఇస్తున్నాయట. ఆ గోవులే సంసారబంధం వదిలిపెట్టిన ముక్తపురుషులు. వారి వయస్సు ఎప్పటికీ 25 ఏళ్లే.. ప్రకృతితత్వాలు 24 కాగా ఇరవై ఐదవది జీవతత్వము. ప్రకృతితత్వాలను దాటుకుని స్వస్వరూపంలో ఆవిర్భవించినవాడు ముక్తపురుషుడు. అలాగే భగవంతుడే కాక భాగవత్ శేషత్వాన్ని కలిగి ఉండడవల్ల ఈ గోపిక ధృఢమైన బంగారు తీగవలె కనిపిస్తున్నదట. ఆ గోపిక పడుకున్న తీరు ఎలా ఉందంటే పుట్టలోని పాములాంటి నడుము కలిగి ఉన్నది. మన శరీరంలోని మూలాధారంలో కుండలినీ శక్తి పుడుతుంది. ఈ కుండలినీ సర్పం ఆకారంలో 3 1/2 చుట్టలు చుట్టుకుని ఉంటుంది. దీనిని మూలాధారం నుండి కదిలించి పైన శిరస్సులో ఉన్న సహస్రార చక్రంలో ప్రకాశింపచేయాలి. ఆమె కేశాలు నెమలి పురివిప్పినట్టుగా ఉన్నాయి . శ్రీవిద్యా సంప్రదాయం తెలిసి, హఠయోగంలో ప్రాణాయమం చేసే యోగులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ పాశురంలో చెప్పబడిన గోపాలవంశంవారు తమ సంపదనంతా భగవంతుడు, భాగవత్ కైంకర్యానికే వినియోగించేవారు. అట్టి వంశానికి చెందిన గోపికను ఈ రోజు మేల్కొలిపి తమతో పాటు శ్రీవ్రతాన్ని ఆచరించడానికి తీసికెళ్లారు.