కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు

మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం

పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -

క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ

పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు

మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ

దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్

ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

రాగం: చక్రవాకం

తూరుపు తెలవారె నెచ్చెలీ మేలుకో!

ఎనుములు చిరుబీడుకు మేయగా ఏగెనే

బాలికలందరు అదే పోతగా పోతుంటే

ఆపి, నిను పిలువగా వచ్చి నిలచి నామమ్ము // తూరుపు //

శ్రీకృష్ణు కీర్తించి పరవాద్యమును పొంద

కేశినోటిని చీల్చి, మల్లుర నణచిన

దేవదేవుని చేరి సేవించి నిలువగా

అయ్యో! మీరే వచ్చిరా అనుచు కటాక్షించు..

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.

తూరుపు దిక్కున తెల్లని కాంతి వ్యాపిస్తుంది. మేతకు విడిచిన గేదెలు అన్ని దిక్కులకు వెళ్ళనారంభించాయి. మనతోటి పిల్లలు వ్రతస్థలానికి వెళ్లాలని బయలుదేరారు. శ్రీకృష్ణునివద్దకు వెళ్ళడం చాలా ముఖ్యమని భావించి వారందరూ అలా వెళ్తున్నారు. అలా వెళ్ళెవారిని నిలిపి మరీ నిన్ను పిలవడానికి నీ గుమ్మం ముందు నిలబడ్డాం. కుతూహలంగల ఓ పిల్లా తొందరగా నిద్ర లేచిరా!!. ఆ కృష్ణుని గుణగానము చేసి వ్రతానికి చాలా అవసరమైన పర అనే సాధనాన్ని సంపాదించి, కేశి అనే రాక్షసుని సంహరించి, చాణూర ముష్టికులనే మల్లయోధులను చంపిన ఆ భగవంతుని సమీపించి సేవించినపుడు అతడు మెచ్చుకుని "అయ్యో! మీరే వచ్చారా " అని బాధపడి మనను పరిశీలించి మన కోరికను నెరవేరుస్తాడు. కనుక వెంటనే లేచి రా" అని ఆ గోపికను మేల్కొలుపుతున్నారు.

సూర్యోదయానికి ముందు తూరుపు తెల్లబడటం అనగా మనలో సత్వగుణము ప్రభవించి, రాజస తామస భావాలు తగ్గడం. అదే జ్ఞానోదయానికి ముందు కలిగే మానసిక పశాంతత. భక్తులందరూ సాధారణంగా భగవంతుడిని మేల్కొలుపుతారు. కాని గోదాదేవి మాత్రం భగవంతుని ప్రియ భక్తులను మేల్కొలుపుతుంది. శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని చంపాడని కీర్తిస్తున్నారు. ఈ కేశి అనేది అహంకారము. మనలోని అహంకారం, మమకారాలను పట్టి చీల్చవలసింది ఆ పరమాత్మే కదా.. అదే విధంగా మనలోని కామ క్రోధాలనే మల్లురను కూడా ఆ దేవదేవుడే తొలగించాలి. పరమాత్మను మేము ప్రత్యక్షంగా చూసామని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందినవాళ్లే. కాని ముదలాళ్వార్లు ముగ్గురు, పెరియాళ్వార్లు మున్నగువారు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా దర్శించారు. అలాగే మొన్నా, నిన్నా, ఇవాళ మేల్కొన్న గోపికలు ముగ్గురూ భగవదనుభవంలో మునిగి ప్రపంచాన్ని మరచి సుషుప్తిలో ఉండిపోయారు.