మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

రాగం: కమాస్

మాయావి మన మధుర అధినాధుడు హరీ!
కూలంకష స్వచ్చ యమునా తీర విహారీ!
గోపాల వంశమున భాసించు మణిదీపము
తల్లి కడుపునకు చల్లని వెలుగు దామోదరు దరికి
పరిశుద్ధిగానేగి సుమముల రువ్వి, సేవించి
నోరార కీర్తించి - మనసారా ధ్యానింప
ఆగామి సంచిత పాపమ్ములన్నియు
నిప్పులో తూలికలగును నామమనుసంధింప
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము+++++++++++++++++

గోదాదేవి పిలుపును అందుకున్న గోపికలందరూ వ్రతాన్ని మొదలుపెట్టడానికి ఒక చోట చేరారు... ఎంత గొప్పవారికైనా శుభకార్యాలకు పూనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అలాగే తాము మొదలుపెట్టబోయే వ్రతానికి గతంలో చేసిన పాపాలు ఆటంకములవుతాయేమో అని సందేహించారు. మనము తెలిసీ తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకొని మరలా ఆ పాప కర్మల జోలికి పోకుండా ఉంటేనే ఈ వ్రతఫలం దక్కుతుంది ఆ కృష్ణుడి సేవాభాగ్యం లభిస్తుంది అని ఒక గోపిక చెప్పింది. అసలు కర్మంటె ఏమిటి అన్న చర్చ జరిగింది. ఎన్ని పాపాలు చేసినా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను దర్శించినంతనే కర్మలన్నియు మాసిపోతాయి అని ఉపనిషత్తులే చెప్పాయి. మన కర్మలకు ఫలాన్ని ఇచ్చేది భగవంతుడే కాని కర్మలు కావు.

మనము చేసిన పుణ్యకర్మల వల్ల సుఖము, పాపకర్మల వల్ల దుఖము లభిస్తుందని అనుకుంటాము కాని ఇది సరి కాదు. ఏ కర్మ చేస్తే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందో అది పుణ్యకర్మ, ఏ కర్మ చేసినందువల్ల ఆగ్రహం లభిస్తుందో అది పాపకర్మ. పెద్దల ఆచరణను బట్టి మన ప్రవర్తనను దిద్దుకుని భగవంతుని అనుగ్రహానికి పాత్రులము కావాలి. అప్పుడే మనం గతజన్మలో చేసిన కర్మలు నిప్పులో వేసిన దూదిలా నశిస్తాయి. ఈ జన్మలో కర్మలు తామరాకు మీది నీటి బొట్టులా నిలవవు. మనం శ్రీమన్నారాయణుడే సర్వస్వమని నమ్మినవారము అందుకే భగవంతుడు మనను ఎల్లప్పుడూ సుఖంగా ఉండేలా చేసి తనలో ఐక్యం చేసుకుంటాడు. గోదాదేవి శ్రీవ్రతము నిర్విఘ్నముగా జరగడానికి తమ కర్మలు తొలగి వారు కోరిన ఫలాన్ని పొందుటకు గల సులభమైన ఉపాయాన్ని చెప్తుంది గోపికలకు... శ్రీకృష్ణుడే ఈ వ్రతానికి అధినాయకుడు. అతని చేష్టలు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. భగవంతునితో సంబంధం కలిగిన ఉత్తర మధురకు నాయకుడు. నిర్మలమైన జలముగల యమునా నదీ ఒడ్డున నివసించేవాడు, మనకొరకే యదుకులమున అవతరించిన మహానుభావుడు, తన పుట్టుకతో యశోధకు శోభను కలిగించిన మంగళమూర్తి. అందుకే మనము ఎటువంటి సందేహాలు లేకుండా నిర్మల మనస్సుతో వెళ్ళి పవిత్ర పుష్పాలను అర్పించి, నమస్కరించి, నోరారా కీర్తించి, ధ్యానించినంతనే గత, వర్తమాన జన్మలో చేసిన కర్మలన్నీ అగ్నిలో వేసిన దూదిలా భస్మమైపోతాయి. మన వ్రతానికి ఎటువంటి ఆటంకము కలగదు. అందుకే రండి ఆ భగవంతుని కీర్తిద్దాం.

ఇంతవరకు మొదటి ఐదు పాశురాలలో గోదాదేవి గోపికలను వ్రతానికి సన్నద్ధం చేసింది ఇక రే పటినుండి శ్రీవ్రతము లేదా తిరుప్పావై వ్రతము మొదలవుతుంది.