పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్

రాగం: భూపాల

పక్షులు కూసెనులే! పక్షివాహను గుడిని
తెలి సంకు పొలికేక వినలేదటే!
బాల మేలుకొనవే.. // పక్షులు //
పూతన స్తనముల విషమును పీల్చి
కపట శకటమును కాల్చాచి కూల్చి
పాల్కడలిలో యోగ నిద్రలో నున్న విష్ణుని
ఉల్లమున నిలిపి మునులు యోగులు
మెల్లగా లేచి "హరిహరీ" అని పాడ
హృదయములు కదలాడి ఆహ్లాదమును తేల
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.

గోదాదేవి వ్రతారంభం చేద్దామని గోపికలతో చెప్పగానే ఉదయాన్నే నిద్ర లేచారందరూ.. కాని ఇంకా పది మంది గోపికలు మేల్కొనలేదని తెలుసుకుని మరికొందరు గోపికలను తోడ్కొని వెళ్లింది. భగవంతుని ఆశ్రయించినప్పుడు మన ఒక్కరి సంకల్పము, ప్రయత్నముతోనే అది సాధ్యం కాదు. ఆ భగవంతుని సేవించే నిష్ణాతులైన వారి సహకారం తీసుకోవాలి. . మనకు సర్వాన్ని ఇచ్చే పరమాత్మను చేరడానికి యోగ్యులుగా చేసేవాడు గురువు. అతని ద్వారా ఆ స్వామిని చేరగలుగుతున్నాము. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆండాల్ తల్లి భగవదనుభవ నిష్టలైన పదిమంది గోపికలను మేల్కొలిపి, వారిని తోడ్కొని కృష్ణుని సన్నిధికి వెళ్తుంది.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆ కృష్ణుని చేరుకుందామా అని ఆత్రుతతో నిద్ర రాక ఉండవలసిన వాళ్లు అలా నిద్రపోవటమేంటి? నిద్ర అనగా అన్ని ఇంద్రియ వ్యాపారాలు మాని మనసు విశ్రాంతి తీసుకోగా ఆత్మ, పరమాత్మతో చేరి ఉంటుంది. ప్రతీ నిత్యం ప్రతీ జీవునికి సుషుప్తిలో జరిగేది ఇదే... కాని మన సుషుప్తిలో అజ్ఞానం మనను కప్పివేయడం వల్ల ఆ దివ్యానుభూతిని పొందలేకున్నాము. యోగులవలె ఆ పదిమంది గోపికలు సాత్వికమైన సుషుప్తిలో ఉన్నారు. అందరిలోకి చిన్నదైన ఉత్తిష్టను ఇలా మేల్కొలుపుతుంది గోదాదేవి. " ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు అప్పుడే లేచి కలకలలాడుతూ వెళ్తున్నాయి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునికి స్వామి అయిన శ్రీమహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము స్వామి సేవకు వేళయింది రమ్మని పిలుస్తుంది. ఆ శబ్దం వినపడలేదా పిల్లా! లే ఇంకా పడుకున్నావ్.. మేము ఎవరూ లేపకుండానే లేచామనుకుంటున్నావా? పూతన స్తన్యమున విషాన్ని తాగినవాడు, శకటాసురుని కాలితో తన్ని కూల్చినవాడు, పాలసముద్రంలో ఆదిశేషునిపై యోగనిద్రలో నున్న మహావిష్ణువును తమ మనసులో పదిల పరుచుకుని మునులు, యోగులు చేస్తున్న హరీ హరీ అనే సంకీర్తనాలు మా మనసులోకి చేరి మమ్మల్ని గాఢనిద్రనుండి మేల్కొలిపాయి. ఓ పిల్లా! లే! నీవు కూడా లేచి రా" అని ఆ ముగ్ధను మేల్కొలిపారు. ఆమె లేచి వారితో కలిసింది.

ఈ పాశురంలో పది మంది గోపికలు, పూతన, శకటాసురుల ప్రస్తావన వెనకల పరమార్ధం ఉంది . ఈ పాశురంలో పదిమందిని మాత్రమే మేల్కొల్పడం గల విశేషం ఏమిటంటే... విష్ణు ఆలయాలలో మూల విగ్రహంతోపాటుగా పదిమంది ఆళ్వారులను కూడా ప్రతిష్టిస్తారు. ఆలయానికి వెళ్లినప్పుడు ముందు ప్రదక్షిణం చెసి ఆల్వారులను సేవించి , ద్వజస్తంభమునకు నమస్కరించి , అమ్మవారిని సేవించిన తర్వాతే మూలవిరాట్టును సేవించడం ఆచారంగా వస్తుంది. ఆ పదుగురిని సేవించి వారి కటాక్షము మనపై పడునట్లు చేసుకోవడమే ఆ పదిమంది గోపికలను మేల్కొలపడం. పూతన వృత్తాంతము కూడా మనకు కొన్ని గుణపాఠాలు నేర్పుతుంది. ఈ ప్రకృతి అనే పూతన అహంకార, మమకారాలు అనే స్తనముల ద్వారా విషయ భోగాలు అనే విషాన్ని ఇచ్చి మనను చంపుతుంది కాని పోషింపదు. అందుకే అది పూత న.. పవిత్రము గానిది అని అర్ధమవుతుంది. శకటాసురుని వృత్తాంతంలో ఆ బండి మన దేహము, దాని చక్రాలు పాపపుణ్య కర్మలు, అహంకార, ఆవేశాలతో ప్రవర్తించినపుడు ఆ భగవంతుడి పాదాలు తాకినంతనే ఆ చక్రాలు విరిగిపోయి మనకు మోక్షము లభిస్తుంది.