ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్

ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్రాగం: అమృత వర్షిణి


పర్జన్యదేవ! పాలింప రావా!
సంద్రమ్ముపై వ్రాలి సలిలములు త్రావి
ఆది దేవుని వోలె ఆతసీదేహుడవై
ఆకసము పైకెక్కి గర్జించుమా! //పర్జన్య//
సుందర బాహు అరవిందనాభు హస్తాన
చక్రమ్ము వలె మెరసి, శంఖమ్ము వలె ఉరిమి
శార్‌జ్ఞ నిర్ముక్త శర పరంపరగా
లోకమ్ము హర్షింప వర్షమ్ము కురియుమా!
మార్గశిర స్నానమ్ము చ్సి తరించెదము
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతముఈ పాశురంలో గోదాదేవి మన సర్వస్వం ఆ భగవంతుడే అనే భావనతో ధనుర్మాస వ్రతం ప్రారంభిస్తే ఆతని వద్ద వినయవిధేయతలతో మెలిగిన దేవతలందరూ మనకు కూడా వశులైపోతారు అని నిరూపిస్తూ పర్జన్య దేవుడిని ఇలా ఆదేశిస్తుంది.. " గంభీరమైన స్వభావము కలిగి వర్షం కురిపించే మేఘదేవా! నీ దాతృత్వంలో ఏమాత్రం సంకోచించవద్దు. నీ ఔదార్యంలో ఇసుమంతైనా వెనకడుగు వేయకు. నడి సముద్రం మధ్యలోకి వెళ్లి అడుగు వరకు నీరంతా బాగా త్రాగి గర్జించు..తర్వాత మెల్లిగా గర్భిణీ స్త్రీవలె నిదానంగా మేడ మెట్లెక్కినట్లు పైకి వెళ్ళి ఆకాశమంతా వ్యాపించు. సమస్త జగత్తులకు కారణభూతుడైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నలుపును ధరించుము. అటుపిమ్మట ఆ భగవంతుని సుందరమైన విశాల దీర్ఘబాహువుల జంటలో కుడిచేతిలోని చక్రమువలె మెరుస్తూ, ఎడమచేతిలోని శంఖమువలె ఉరుముతూ, శ్రీమహావిష్ణువు చేతిలోని విల్లు శార్గము నుండి వెలువడే బాణములవలె వర్షధారలను కురిపించుము. ఆ వర్షధారలు లోకాన్నంతటినీ సుఖింపచేయగా మేము సంతోషంతో ఆ మార్గశిర స్నానం చేసి శ్రీవ్రతము చేస్తాము.చూడడానికి ఈ పాశురం వర్షం కొరకు ప్రార్ధించినట్లు కనిపించినా అసలు అంతరార్ధం వేరే ఉంది. గోదాదేవి ప్రకృతిలో భగవంతుని , భగవంతునిలో ప్రకృతిని దర్శించింది. ప్రకృతిలో కాని అందమైన వస్తువులో భగవంతుని దర్శించకున్నా అందులో ఏదో లోతు ఉంటుంది. ఇందులో మనకు మేఘానికి, గురువుకు గల కొన్ని పోలికలు గోచరిస్తున్నాయి. మేఘము సముద్రంలోని ఉప్పునీటిని త్రాగి మనకు మంచి నీరును ఇస్తుంది. అదే విధంగా గురువు కూడా క్లిష్టమైన వేదార్ధాలను సరలము, సులభము చేసి మనకు అందిస్తారు. ఎడారి, పొలము, పల్లము, మెట్ట అనే తేడా లేక మేఘం అన్ని చోట్లా వర్షిస్తుంది. అలాగే గురువులు కూడా తన శిష్యులలో తక్కువవారు, ఎక్కువవారు, గుణవంతుడు, గుణహీనుడు, తెలివైన వాడు , తెలివిలేనివాడు అన్న తేడా లేకుండా అందరికీ విజ్ఞానమందిస్తారు. మేఘము , గురువులు ఇద్దరూ ప్రత్యుపకారాన్ని ఆశించరు. మేఘము తన నీరంతా ఇచ్చేసి వెలవెలపోతుంది. అలాగే గురువు తన విద్యనంతా ఇచ్చినా ఇంకా ఇవ్వలేకపోతున్నానే అని బాధపడతాడు. వర్షం ఏ చోట పడినా ఆయా స్థానాలను బట్టి ముత్యపు చిప్ప, తామ్రాకు, కాలినపెనం .. నీటి రూపం మారుతుంది. అలాగే గురువు అందరికీ సమానంగా బోధించినా శిష్యుల యోగ్యతలను బట్టి వేర్వేరు ఫలితాలనిస్తాయి. ఒక్కోరు ఒక్కో విధంగా వృద్ధిలోకి వస్తారు. మేఘుడికి ఉరుము, మెరుపు ఉన్నట్టే గురువుకు కూడా జ్ఞానము, ఆచరణ రెండూ ఉంటాయి. ఇద్దరూ పరిపూర్ణులే...