ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్రాగం: కేదారగౌళ

పెరిగి లోకాలు కొలిచిన పురుషోత్తముని కీర్తించి
నోము పేరున కలిసి మేము నీరాడితే, దేశమంతా
నెల మూడు వానలు కురిసి ఈతిబాధలు తొలగు //పెరిగి //
పెరిగిన ఎఱ్ఱని వరిచేల పైకెగురు చేపలు
నీరజముల మెరసి నిదురించి తుమ్మెదలు
స్థిరముగ కూర్చుండి సిరములను లాగ
కలశములను నింపు కామధేనువులు
నిత్య సంపదలతో నిండుగా నుండు
జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..ఇది ఆశీర్వచన పాశురం. ఎక్కడ శుభకార్యం జరిగినా పెద్దలు ఈ పాశురాన్ని చదువుతారు. త్రివిధ తాపములు (తాపత్రయములు) తొలగి అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు. అంతే కాక ఈ పాశురంలో శుభప్రదమైన వామనావతారం ప్రస్తావన వస్తుంది. పూర్వము దేవతలను కాపాడటానికి శ్రీహరి వామనావతారం ఎత్తి పెరిగి లోకాలను తన కాలితో కొలిచిన పురుషోత్తముని కొలిచి నామసంకీర్తనం చేసి వ్రతస్నానం చేసినంతనే దేశమంతా నెలకు మూడు వానలు కురిసి, ఈతిబాధలు లేకుండా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండును. పచ్చగా పెరిగిన పంటచేలలోని నీటిలో చేపపిల్లలు త్రుళ్లి పడుతుండగా, కలువపూలలో మెరిసే తుమ్మెదలు నిద్రిస్తుంటే బాగా పెరిగిన వరిచేలు ఆనందాన్ని ఇవ్వాలి. గోపాలురు పాలు పితకడానికి కొట్టములలో ప్రవేశించి, స్థిరముగా కూర్చొని బలిష్టమైన పొదుగులను పిండగానే కుండలనిండుగా క్షీరధారలు కురిసే గోసంపద సమృద్ధి కావాలి. వామనుడు త్రివిక్రముడైనట్టు దేశమంతా నిత్య సంపదలతో, ఆనందంతో తులతూగాలని గోదాదేవి ఈ పాశురంలో కోరుకుంటుంది..అహంభావియైన బలి వామనునికి ఇచ్చిన మూడు అడుగులు - అహంకారము, మమకారము, అవిద్య. అహంకారము పోవుట అంటే పరమాత్మకు సొంతమైనది అతనికే అర్పించడం. మనదంటూ ఏమీ లేదు అంతా ఆ భగవంతుడితే అని అర్ధం .. వామనావతారాన్ని కీర్తించి వ్రతస్నానాన్ని చేస్తే నెలకు మూడు వర్షాలు కురుస్తాయట? ఏమిటా మూడు వర్షాలు ?1.అనన్య శేషత్వము (నీకే నీకే చెందినవాడను) 2. అనన్య శరణత్వము (నీవే నీవే నాకు ఉపాయము) 3. అనన్య భోగ్యత్వము (నీవే తప్ప అన్యము నాకు భోగ్యం కాదు). దీనినే అకారగ్రయజ్ఞానమందురు.ఈ జ్ఞానవర్షము కురిసినపుడు ఆత్మ పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ వ్రతఫలములో మరో విశేషము ఈతిబాధలు 1. అతి వృష్టి 2. అనావృష్టి. 3. ఎలుకలు 4. చిలుకలు 5. మిడతలు 6. క్రూరులైన రాజులు .. ఇవి తొలగిపోవును. ఈతిబాధలు తొలగి పంటలు విరివిగా పెరిగి ఆ వరిచేలలోని నీటిలో చేపలు సంతోషంతో త్రుళ్లిపడుచుండును. శ్రీహరిని చూసి ఆనంద పరవశులైన ఇంద్రాది దేవతలే ఆ చేపలు. భగవంతుని అనుగ్రహం పొందిన జీవులే సమృద్ధిగా పండి నీటితో నిండి వంగిన వరిచేలు. ఈ చేలలోని నీటి అడుగున కలువపూలు వాటిలో నిద్రిస్తున్న తుమ్మెదలు. ఈ పూవులు జ్ఞానుల హ్రదయాలు అందులో లక్ష్మీ సమేతుడైన నారాయణుడు తుమ్మెదలా ఉయ్యాలలూగుతున్నాడు. వ్రేపల్లేలోని పాడి అనగా గురువులు. పాలను పితుకువారు శిష్యులు. అనగా భక్తితో, స్ధిరముగా సేవించినపుడు గురువులు గోవులవలె సర్వ విద్యలను అందిస్తారు. అందుకే ఈ వ్రతము చేసినంతనే నిత్య సంపదలతో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అని గోదాదేవి కోరుకుంటుంది..