వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయ్యముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్


చెలులందరికీ వ్రతం యొక్క విశేషాలు చెప్పిన తర్వాత గోదాదేవి ఆ వ్రత నియమాలను ఈ పాశురంలో వివరించింది.. భగవంతుని దర్శించుటకు వెళ్ళేవాళ్లు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శ్రీకృష్ణుడు అవతరించిన లోకంలో పుట్టి దుఃఖమయమైన జీవితం గడుపుతున్నా ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆనందంగా ఉన్నవారలారా ఈ తిరుప్పావై వ్రతం కొరకు మేము ఏర్పరుచుకున్న వ్రత నియమాలు వినండి. ముందుగా పాలసముద్రంలో నిద్రించుచున్న శ్రీహరి యొక్క పాదపద్మములకు మంగళము పాడుదాము. ఈ వ్రతం ఆచరించు సమయంలో నేతిని, పాలను గాని తీసుకోము. తెల్లవారుఝామునే లేచి చన్నీటి స్నానం చేసి కళ్లకు కాటుక ధరించక కేశములకు పరిమళాన్ని ఇచ్చే పూలను ధరింపకుండా ఉందాము. మా పెద్దలు విడిచిపెట్టిన చెడుపనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించే మాటలు, అసత్యాలు ఎప్పుడు గాని, ఎక్కడా గానీ మాట్లాడము. ఇతరులకు హాని కలిగించే కష్టములు కలిగించే పనులనుగాని, ఆలోచనలు గాని చేయము. మహాత్ములైన వారిని సేవించి ధనధాన్యాలతో సత్కరిస్తాము.


బ్రహ్మచారులకు, బిక్షువులకు బిక్ష పెడతాము. భగవంతుని గుణగణనము చేస్తూ ఈ సంసార బంధనాలనుండి విముక్తి పొండడం గురించి ఆలోచిస్తాం .. శాస్త్రముకంటే నిర్దిష్టమైన క్రమము కంటే భక్తి ప్రధానమైంది. భగవత్కృప, గురు కృప చాలా ముఖ్యమైనవని భావిస్తాము. దేవతలు మనపై కోపించినప్పుడు గురువు మనకు ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తాడు. కాని గురువుకు కోపం వస్తే మనను రక్షించేవాడు లేడు. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా భావించాలని పెద్దలు చెప్పారు. శ్రీకృష్ణునిసేవకే అంకితమైనందున తన యవ్వనమంతా ఆ శ్రీకృష్ణుడి సొంతమని భావించిన గోడాదేవి ఈ పాశురంలో వ్రత నియమాలు చెప్పింది..