ఆవు కడుపులోని దూడ కనిపించును
రెండు యోనుల దూడ పుట్టేనయ!
మూడు కాళ్ళావుకు మనుజుడే పుట్టేను
ప్రజలతో వాదముల్ చేసేనయా!

తల్లి గర్భమునుండి బిడ్డ పుట్టిన క్షణమే
తల్లితో మాట్లాడు నమ్మండయ!
ఒకరి ఆలిసొమ్ము యింకొకరి పాలగు
యిదియేమి చిత్రమో తెలియండయ!

మేకలు పులులును ఒక్క రేవులోనె
నీరు త్రాగేకాల మెచ్చేనయా!
మనిషి మనిషిని చంపి మాంసంబుగా జేసి
మణుగొకనూటికి అమ్మేరయ!

వావి వరుసలు లేక పెండ్లిండ్లు జేసేరు
కుల గోత్రమన్నది మరిచేరయా!
కాసులున్న యెడల దాసికొడుకుని కైన
కట్నాలతో పెండ్లి జేసేరయా!

ఆకాశమందు దేవతలు పిలిచేరు
అష్టదిక్పాలకులు అదిరిపడి లేచేరు
ఆకాశవాణియు, హరహరయని యేడ్చు
అది విన్న పాపులు అదిరిపడి సచ్చేరు!

చంటి బిడ్డలకన్న బలహీనమైనట్టి
మనుషులే యిలలోన పుడతారయా!
కుక్క నక్కలు బట్టి చంపుకొని తినియేను
పెద్దగాలికి యెగిరిపోయెరయా!

తల్లి బిడ్డను నమ్మి బిడ్డ తల్లిని నమ్మి
జీవించు రోజులే పోయేనయా!
దైవంబునే మరచి జీవించువారికి
నమ్మకం బెట్లొచ్చు తెలియండయా!

దున్న పోతుమీద యమధర్మరాజొచ్చి
ప్రజలకు హితబోధ చేసేనయా!
పెడ చెవిని పెట్టేటి ప్రజలచూచి తాను
పెద్దగా నిట్టూర్పు విడిచేనయా!

మనసులోని విషము మాటలోన తీపి
కలిమాయ కొడుకులను తెలియండయా!
హెచ్చరిక లేకుంటె క్షణములో మ్రింగేరు
కొండ సిలలే మేలు నమ్మండయా!

కాణి పాకము లోని విఘ్నేశ్వర స్వామి
గంగ పై వెలిసేని తెలియండయా!
ఆ గంగ రక్తమై ఆరు ఆమడ పారు
అప్పుడే నారాక నమ్మండయా!

నేనొచ్చువేలను తెలియ చేసెద వినుడు
యెఱ్ఱ చీమలన్ని యేనుగులా కనబడును
కందిమల్లయ్య పల్లె పెద్ద పట్నంబౌను
నా మఠము శిధిలమై దొండతెగలు క్రమ్ము

దేవాలయములోని విగ్రహము లన్నియు
నృత్యంబు సలుపుచు పాడేనయ
క్షుద్ర దేవతలన్నీ గ్రామాలపై బడి
పాపాత్ములను యేడిపించేనయా!