వాడల వాడల వెంత వాఁడెవో
నీడ నుండి చీరలమ్మే నేఁత బేహారి.

పంచ భూతములనెడి పలువన్నె నూలు
చంచలపు గంజితోడ చరిసేసి
కొంచెపు కండెల నూలి గుణముల నేసి
మంచి మంచి చీరలమ్మే మారు బేహారి. //వాడల //

మట మాయముల తన మగువ పసిఁడి నీరు
చిటిపొటి యలుకలఁ జిలికించఁగా
కుటిలంపుఁ జేఁతలు కుచ్చులుగాఁ గట్టి
పటవాళి చీరలమ్మే బలు బేహారి. //వాడల //

మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన
వెచ్చపు కర్మధనము విలువ చేసి
పచ్చడాలుగా గుట్టి బలు వేంకటపతి
ఇచ్చ కొలఁదుల నమ్మే ఇంటి బేహారి. //వాడల //
అన్నమయ్య ఆ శ్రీనివాసుడిని ఒక నేతవ్యాపారిగా చిత్రిస్తున్నాడు. వాడవాడల తిరిగే చీరల వ్యాపారిలా స్వామి విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు. నీడలో ఉండి అంటే మనకు కనపడకుండానే మంచి మంచి చీరలని (సృష్టిని) తయారుచేస్తున్నాడు ఈ వ్యాపారి.

పంచభూతాలైన భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు .. వీటినే దారాలుగా చేసాడు. నేతగాడు నూలుపోగులను గంజి పెట్టి కండెలకు చుట్టి నేతపని ప్రారంభిస్తాడు. అదే విధంగా ఈ నేతగాడు ఈ దారపు పోగులకు చంచలత్వమనే గంజి పెట్టి సరిచేసి సత్వ, రజో, తమో గుణములనెడి కండెలకు చుట్టి మంచి మంచి చీరలు నేసి అమ్ముతున్నాడు.

నేసిన చీరలకు అలాగే ఎక్కువ ధర పలకదు. వాటికి రంగులు, బంగారు అద్దకం ఉండాలి. అప్పుడు అది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. సృష్టిలోని మాయను అన్నమయ్య ఆ దేవుడి ఇంటి ఇల్లాలిగా మార్చాడు. ఆమె ఈ సృష్టికి బంగారపు నీరు చిలకరిస్తుంది. అంటే సంపదల మీద వ్యామోహమనే గుణం కలుపుతుంది. నేతగాడు పంచభూతాలు, త్రిగుణాలు కలిపి నిలువుగా , అడ్డంగా పట్టీలుగా నేస్తాడు అంటే సృష్టి చేస్తున్నాడు. మనిషిలోని స్వార్ధం అతనితో ఎన్నో తప్పుడు పనులు చేయిస్తుంది. ఆ కుటిలమైన పనులనే కుచ్చులుగా చేసి కుడుతున్నాడు. వారు చేసిన మంచి, చెడు అన్నింటికి తగిన ఫలితాన్ని ఇస్తున్నాడు.

సాధారణంగా మనకు అలవాటైన వ్యాపారి దగ్గరే కొనుగోలు చేస్తాము. సహజసిద్ధమైన ఆ అలవాటుతో జీవులు ఆ వ్యాపారి దగ్గరకు చేరి తమ కర్మ అనే ధనాన్ని వెలగా ఇస్తారు. వాటికి తగినట్టుగా చీరలు ఇస్తాడు ఆ చీరల వ్యాపారి. అంటే దేవుడు ఎవరి కర్మకు తగినట్టుగా వారికి తగిన జన్మలు ప్రసాదిస్తాడు.