ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటి చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పూరోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది. తలంబ్రాల కార్యక్రమం తర్వాత వధూవరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. ఇప్పుడు జరిగేది సప్తపది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. పూరోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.

"సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం"
"సభాసప్తపదాభవ"

ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు.

మొదటి అడుగు..
"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"

రెండవ అడుగు..
"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక

మూడవ అడుగు...
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు"
ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.

నాలుగవ అడుగు..
"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు"
ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.

ఐదవ అడుగు..
"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు"
ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.

ఆరవ అడుగు..
"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు "
ఈ ఆరవ అదుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.

ఏడవ అడుగు..
"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు"
ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక.


సప్తపది మంత్రార్ధం గురించి తెలుసుకుందాం..

"సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదా బభూవ! సఖ్యంతే గమేయం సత్యాత్, తేమాయోషం సఖ్యాన్నే మాయోష్మాః సమయావః సంప్రియౌ రోచిష్ణూ సుమన సుమానౌ! ఇష మూర్జం అభిసంపసానౌ సం నౌమనాంసి సంవ్రతా సమచిత్తాన్యాకరం"

"ఓ నా అర్ధాంగి! ఈ ఏడడుగులతో నీవు నా స్నేహితురాలవయ్యావు. ఈ స్నేహాన్ని ఎన్నటికీ వీడకుండా నాతో సహవాసిగా ఉండిపో. ఒకరినొకరు విభేదించక సమానమైన ఆలోచనలతో కలిసి ఉందాము. మన బంధం శాశ్వతమైనది. నీవు నన్ను ఎన్నటికీ విడిచిపోరాదు" అంటాడు వరుడు.

"సాత్వమసి అమూహం! అమూహమస్మి! సాత్వం ద్యౌః అహం పృధివీ! త్వమ్ రేతో అహంరేతో భృత్ ! త్వం మనో అహమస్మివాక్! సామాహమస్మి! ఋక్తం సా మాం అనువ్రతాభవ !"

" ఓ స్వామి! నీవు ఎప్పుడూ ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండుము. నేను కూడా ఏ పొరపాటు చేయక నీతో కలిసి మెలిసి ఉంటాను. నీవు ఆకాశమైతే నేను ధరణిని. నీవు శుక్రమైతే నేను శోణితాన్ని. నీవు మనసైతే నేను వాక్కును. నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించే ఋక్కువు. మనిద్దరిలో బేధం లేదు. ఎప్పటికీ ఒక్కటే. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడునీడగా కలిసి ఉందాము " అని సమాధానమిస్తుంది పెళ్లి కూతురు.

ఎంత చక్కని సన్నివేశమిది..
భార్యను భర్త ఎలా ప్రేమించాలో, ఆదరించాలో , భర్తను భార్య ఎలా గౌరవించాలో వివాహ మంత్రాల్లొ స్పష్టంగా చెప్పబడింది. కష్టసుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవించడమే వివాహధర్మం. ప్రతీ వివాహంలో కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న కలతలు, కలహాలు సహజమే. అర్ధం చేసుకుని సర్దుకుపోవడమే జీవితం.