"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి" ..

భగవంతుడు ఒక్కడే అని అందరూ అంటారు కాని మతాలు ఎన్నో. తమ మతమే గొప్పది అంటూ ఇతరుల మతాన్ని విమర్శిస్తారు. ఒక్కోసారి ద్వేషిస్తారు. పరమాత్మ ఒక్కడే కాని పండితులు ఆయనను అనేక పేర్లతో పిలుస్తారు. అసలు మతం అంటే అర్ధం అభిప్రాయం అని. లోకో భిన్న రుచిః అంటే లోకంలోని వ్యక్తులు భిన్నమైన రుచులు కలిగి ఉంటారు. ఆలోచన, వివేచన, శోధన మనిషికి దేవుడిచ్చిన వరాలు . ఈ మూడింటి విషయంలో ఏ వ్యక్తి మరొ వ్యక్తిని పోలి ఉండడు. ఎవరి వ్యక్తిత్వం, వారిదే. అనాదినుండి ఈ జగత్తు ఉనికిని తెలుసుకోవడానికి , మనుష్య జీవన గమ్యం పరమార్ధం తెలుసుకుని చేరుకోవాలని ఎంతోమంది జ్ఞానులు, శాస్త్రవేత్తలు, మునులు ప్రయత్నించారు. ప్రకృతికి , సర్వ జీవరాశికి అతీతమైన శక్తి ఏదో ఉందని అందరూ అంగీకరించారు. ఎవరెవరి తపస్సు, అన్వేషణ, పరిశోధనను బట్టి తమ తమ మతాలను (అభిప్రాయాలను) వెలిబుచ్చారు. ఆయా మతాల ఆచరణకు ప్రత్యేకమైన కట్టుబాట్లు ఏర్పరిచారు. అలా ఒకదాని తర్వాత మరోటి అనేక మతాలు ఏర్పడ్డాయి.

ఏ మతమైనా చెప్పేది ఒక్కటే. ధర్మాన్ని, నీతిని పాటించు. నిజాయితీగా జీవించు. సాటివారిని ప్రేమించి ఆదరించు. సాయం చేయి. నీవు చేసే పనిలోనే దైవాన్ని దర్శించి తరించు అని చెబుతాయి. ఎవరి మతంలో వారు భద్రత ఉందని భావిస్తారు. ఈ విలువలు, విశ్వాసాలే అన్ని మతాలకు ఆధారం. కాని ఈ అభిమానం శృతిమించి దురభిమానంగా మారుతుంది. బలవంతపు మత మార్పిడులు, అనవసరపు మత విద్వేషాలు చెలరేగుతున్నాయి. దీనికి రాజకీయ నాయకులు మతాభిమానాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. శాసిస్తున్నారు. ఎవరి మతాలు వారికి ఉన్నతమైనవే కాని పరమతాన్ని కూడా గౌరవించాలి.

సర్వే జనా సుఖినోభవంతు..