మీకు గుర్తుందా?? వర్షం వచ్చేటప్పుడు ఒక్కోసారి ఉరుములు, మెరుపులు వస్తాయి. అలాగే అప్పుడప్పుడు పిదుగులు కూడ పడతాయి. ఆ భయంకరమైన ధ్వనితో భయపడేవారిని "అర్జునా, పార్ధా "అని అర్జునుడి పది పేర్లు చదువుకోమని పెద్దలనేవారు. అవునేమో. అలా అనుకుంటే భయం పారిపోతుంది అనుకునేవాళ్లం. కాని దీని వెనక ఉన్న అసలు కథ మహాభారతానికి సంబంధించినది. పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని విరాటుని కొలువులో గడిపారు. అజ్ఞాతవాసం పూర్తి కాబోతున్న వేళ ఉత్తర గోగ్రహణం సందర్భంగా ఉత్తరుడు బృహన్నల తోడుగా యుద్ధానికి బయలుదేరుతాడు. ఆయుధాల కోసం ఉత్తర కుమారుడితో కలిసి బృహన్నల ( అర్జునుడు) శమీ వృక్షం దగ్గరకు వస్తాడు. ధైర్యంగా బయలుదేరినా ఉద్ధండులైన కౌరవులను ఎదుర్కొనడానికి ఉత్తర కుమారుడు భయపడుతుంటే తన పది పేర్లు చెప్పి, అతని భయం పోగొట్టి విశ్వాసం కలిగిస్తాడు అర్జునుడు. ఆ పది పేర్లూ ఇవి. అర్జునఁ , ఫల్గుణ, పార్ధః ,కిరీటి, శ్వేతవాహనః , బీభత్స, విజయ, కృష్ణ:, సవ్యసాచీ, ధనంజయః. ఈ నామాలకు గల అర్ధాలు కూడా తెలుసుకుందాం.

అర్జునుడు - తెల్లనివాడు.

ఫల్గుణుడు - ఫల్గుణ నక్షట్రంలో,మాసంలో పుట్టినవాడు.

పార్ధుడు - పృధ(కుంతీదేవి) కుమారుడు.

కిరీటి - యుద్ధంలో అతని కిరీటం బాగా ప్రకాశిస్తుంది కాబట్టి కిరీటి అయ్యాడు.

శ్వేతవాహనుడు - తెల్లని గుర్రాలు పూంచిన రధం కలవాడు.

భీభత్సుడు - అతను యుద్ధం చేసే రీతి భీబత్సంగా ఉంటుంది కాబట్టి.

విజయుడు - ఎప్పుడూ విజయం అతడినే వరిస్తుంది కాబట్టి విజయుడు.

కృష్ణః - మిక్కిలి ఆకర్ణీయమైన వాడు

సవ్యసాచి - రెండుచేతులతో కూడా సమానంగా ధనుస్సును ఎక్కుపెట్టి యుద్ధం చెయగలవాడు.

ధనంజయుడు - ధనం మీద మోజు లేనివాడు.ఈ పది పేర్లు వాటి అర్ధాలతో సహా చెప్పుకుంటే ఏ భయమైనా తీరిపోతుందని పెద్దల నమ్మకం.