దేవుడికి దీపం ఎలా వెలిగించాలి??
Filed under: జిజ్ఞాస Author: జ్యోతిదేవుడి విగ్రహానికి లేదా పటానికి ధూపధీప నైవేద్యాలు సమర్పించటం మన ఆరాధనా పద్ధతి. ఉదయము వెలిగించు దీపము కన్నా ప్రదోష కాలమందు వెలిగించు దీపం అత్యంత మంగళకరమైనదిగా పెద్దల మాట. పూజలో అత్యంత ముఖ్యమైన దీపం ఆ తర్వాత ధూపం, పుష్పాలు, పసుపు కుంకుమలు, గంధచందన విభూతులు, కొబ్బరికాయ, అరటిపండ్లు వక్క, తమలపాకులు, మంగళ హారతి మొదలగునవి క్రమానుగతిలో ప్రాధాన్యము కలిగినటువంటివి. కావున పూజ చేయువారిపై వీటి అనుకూల శక్తి, ప్రభావము వెంటనే పడుతుంది. అష్టోత్తరములు మరియు శ్లోకములు మనలో దాగి ఉన్న దైవీశక్తులను మేల్కొలిపి మనకు మానసిక, శారీరక శుభాలను కలిగిస్తాయి. ఇలా మనం దేవుడిని ప్రసన్నము చేసుకొని అతని దీవెనలను పొందునట్లు చేయునదే కాక పూజకై మనము చేయు క్రియలన్నియూ మనకు శుభమును చేకూర్చును.
దీపమును నేలపై ఏమీ వేయకుండా సరాసరి నేలపై పెట్టి వెలిగించరాదు. అరటి ఆకును గానీ, తమలపాకును గానీ, పళ్లెమును కానీ, నీటితో శుభ్రం చేసి, ముగ్గువేసిన నేలపై ఉంచి దీపం కుంది పెట్టాలి. ఇక ఇంటియందు దేవతారాధనకై మనమొక ప్రత్యేక స్థానమును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ స్థానం నేలకు కాస్త పై భాగంలో ఉండునట్లు చూసుకొనవలెను. నేలను తాకునట్లు పూజా ద్రవ్యములు మరియు పవిత్ర గ్రంధములు ఉంచరాదు.
దీపములోని చమురుకై ఆవునెయ్యిని కాని నల్ల నువ్వుల నూనెను వాడుట శ్రేష్టము. ఎట్టి పరిస్థితిలోనూ గేదె నెయ్యితో దీపారాధన చెయ్యరాదు. ఉదయము పూజ చేయునపుడు దీపము యొక్క ముఖము తూర్పు దిక్కుగా ఉంచవలెను. సాయంత్రం పూజలో ఒక వత్తి తూర్పుదిక్కుగా మరొకటి పడమర దిక్కుగా ఉంచి దీపము వెలిగించవలెను. మూడు వత్తులను వాడినచో తూర్పు, పడమర మరియు ఉత్తరము దిక్కుగా వెలిగించాలి. ఇక ఐదు వత్తులను వెలిగించదలచిన తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మరియు ఈశాన్య దిక్కుగా వత్తుల నుంచి వెలిగించాలి.
ఇలా వెలిగించిన దీపాన్ని ఆర్పేయాల్సి వస్తే నోటితో ఊదరాదు. వత్తిని చమురులోకి జార్చినచో అది ఆరిపొతుంది. లేదా వెలుగుతున్న వత్తిపై కొద్దిగా నూనె పోస్తే ఆరిపోతుంది.
దీపారాధన సమయంలో చదవవలసిన శ్లోకం.
దీపం జ్యోతి పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే!
No response to "దేవుడికి దీపం ఎలా వెలిగించాలి??"
Post a Comment