మఘ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3

ఈ రాశివారికి సెప్టెంబరు 9 వరకు జన్మమునందు శని సంచారం, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు, నవంబరు 15 వరకు షష్టమమునందు రాహువు, వ్యయమునందు కేతువు, ఆ తదుపరి అంతా పంచమమునందు రాహువు, లాభమునందు కేతువు, మే 1 వరకు ఆరింట గురువు, ఆ తదుపరి ఏడింట, జులై 30 నుంచి షష్టమమునందు బృహస్పతి డిశంబరు 19వరకు, ఆ తదుపపరి సప్తమమునందు సంచరిస్తారు.

ఈ సంవత్సరము ' సిరిదా వచ్చిన వచ్చును ' అన్నట్లుగా ఊహించిన ధనం సమయానికి సమకూరడం వలన ఆర్ధిక ఇబ్బంది ఉండదు. ఉద్యోగాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్య వ్యాపారాలు చేయువారు ఆచి తూచి వ్యవహరించండి. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్పెక్యులేషన్ వ్యవహారాలు కొంతవరకు అనుకూలిస్తాయి. షేర్స్ వంటి వాటిలో పెట్టుబడి విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. కుటుంబం ప్రేమానురాగాలు బలపడతాయి. సోదరుల మధ్య సరైన ఆవగాహన ఉండదు. ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తినా సమసిపోగలవు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. స్త్రీల సృజనాత్మకతకు, సమయస్పూర్థికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తాయి. వ్యవసాయదారులకు సంతృప్తి లభిస్తుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వలన కాంట్రాక్టర్లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీ మనోవాంచ నెరవేరే సమయం ఆసన్నమయినదని గమనించండి. ఇచ్చి, పుచ్చుకునే వ్యవహారాలలొ జాగ్రత్త వహించండి. తల, పొట్టకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. నూతన ఎగ్రిమెంట్లకు శ్రీకారం చుట్టండి. స్త్రీల నేర్పు, ఓర్పునకు పరీక్షా సమయం అని గమనించండి. విద్యా, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. డాక్యుమెంట్లు, విలువైన వస్తువులను ఖరీదు చేస్తారు. పట్టుదలతో ముందుకు సాగి అన్ని పనులు పూర్తి చేస్తారు.

ఈ రాశివారు ఆదిత్య హృదయం, విష్ణుసహస్రనామం, లలితా సహస్రనామం పారాయణ చేసిన శుభం, లాభం చేకూరుతుంది. మఘ నక్షత్రం వారు వైఢూర్యం, పుబ్బ నక్షత్రం వారు వజ్రం, ఉత్తరా నక్షత్రం వారు కెంపు ధరించిన మంచి అభివృద్ధి పొందుతారు.