సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటె శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు.

తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాలవరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు.

వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరునెలల దాకా అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు. చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చెయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు. బ్రహ్మచారులకు మైలకాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే.