ఇస్లాం  మతానికి మూలాధారమైన పవిత్ర "ఖురాన్" గ్రంధం ఆవిర్భవించిన మాసం పవిత్ర "రంజాన్ ... ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ద్వారా 'అల్లా' (దేవుడు) పవిత్రమైన ఖురాన్ గ్రంధాన్ని మానవాళికి అందచేసాడని ముస్లీముల నమ్మకం. ఇస్లాం మతంలో ఐదు మూల సూత్రాలు ఉన్నాయి. 

1. ఇమాన్. దేవుడు ఒక్కడే, మహమ్మద్ ప్రవక్త ఆ దేవుడి దూత అనే నమ్మకం.
2. నమాజ్ : రోజు చేసే ప్రార్ధనలు
3. రోజా : ఉపవాస దీక్షలు
4. జకాత్ : పేదలకు తమ సంపాదన నుండి కొంత మొత్తం దానం చేయడం.
5. హజ్:  మక్కలోని కాబా మసీదును దర్శించడం. 
 
ఈ పవిత్ర సూత్రాలతో పాటు  ఆ అల్లా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను పాటించి, ఆత్మశుద్ధి చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఈ నెల రోజులు ప్రతి ముస్లీం ఉపవాస దీక్ష, ప్రార్ధనలు, స్వార్ధ చింతనలు లేకుండా అందరికి సహాయపడే విధంగా మెలగాలి. ఈ నెలలో నరక ద్వారాలకు తాళం వేసి, స్వర్గ ద్వారాలు తెరచి ఉంచుతారంట. అందుకే ఈ నెల రోజులు శ్రద్ధతో, పగటిపూటంతా పచ్చి మంచినీరైనా ముట్టకుండా ఉంటారు. ఈ దీక్షలో అబద్ధం ఆడకూడదు, నియమంగా ప్రార్ధనలు చేయాలి, తప్పులు చేయక్కూడదు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మొదలైనవి. ఇంద్రియ నిగ్రహంతో వ్యవహరించడం దీక్షలో ప్రధాన విధి. 

పవిత్ర రంజాన్ మాసంలో స్తోమత్తు గలిగిన ముస్లీములందరూ తప్పనిసరిగా తమ సంపాదనలనుండీ పేదవారికి జకాత్ (దానం) చెల్లిస్తారు. నగదు, వస్తువులు, దుస్తులు వగైరా ఇస్తారు. 

పండగ రోజు కొత్త బట్టలు ధరించి, ప్రార్ధన చేసుకుని తమ స్నేహితులకు , బంధువులకు షీర్ ఖోర్మా ఇస్తారు. వారు హిందువులైనా, క్రిస్టియనులైనా సరే . పెద్దల ఆశీర్వాదం పొందడానికి వెళ్లిన చిన్నవారికి తప్పకుండా ఈదీ లభిస్తుంది. అది డబ్బు కాని వస్తువు కాని కావొచ్చు.    

పవిత్ర రంజాన్ మాసంలో తప్పనిసరిగా పాటించే ఉపవాస దీక్ష వలన ఎంతో మేలు జరుగుతుంది. అందరికీ సద్గుణాలు అలవడతాయి. దీక్షలో ఉన్నవారు తప్పనిసరిగా బీడి, సిగరెట్, మద్యం, అబద్ధాలు చెప్పడం, లాంటి దురలవాట్లను త్యజించక తప్పదు. దీనివలన రంజాన్ పండగ తర్వాత కూడా ఆ దురలవాట్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది.