మన మెదడులో కుడిభాగం (స్త్రీతత్వం) శరీరంలోని ఎడమభాగంతోనూ, ఎడమ మెదడు (పురుష తత్వం) కుడి శరీర భాగాలతోనూ అనుసంధానమై ఉంటాయి. చూపు, మాట పురుష తత్వాలైతే, వినికిడి స్త్రీతత్వం. ప్రతి మనిషిలో ఈ రెండు తత్వాలు సమపాళ్ళలో ఉంటేనే మనిషి వ్యక్తిగతంగానూ, దాంపత్య సంబంధాలలోనూ ఆనందంగా ఉండగలడు. కాని ఈ కాలంలో దాంపత్య సంబంధాలు బాగా దెబ్బ తింటున్నాయి. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండే శత్రువుల్లాగా, "మూడు ముడులు - మూడు ముళ్ళలాగా తయారయ్యాయి. మన ఆధునిక విద్యావిధానం కూడా స్త్రీపురుష తత్వాలను సమన్వయ పరచకపోగా కేవలం చైతన్యపరిచేదిగా మాత్రమే ఉంటోంది. మొత్తం మెదడు సామర్ధ్యంలో ఎడమభాగం కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది. దైవత్వానికి దగ్గరగా ఉండే ప్రేమ, దయ, ఆననదం, సృజనాత్మకత కుడి మెదడులో ఉంటాయి. ఈ కుడిభాగం మొత్తం మెదడులో 95 శాతం ఉంటుంది. కాని నేటి మనిషి దీనిని ఉపయోగించుకోకుండా తర్కం, లక్ష్యసాధన, అధికారం వైపు పరుగులు తీస్తున్నాడు. అందుకే ప్రేమ, ఆనందం లాంటివి బాగ లోపించి యాంత్రికంగా జీవిస్తున్నాడు. ఈ పరిణామాల వల్ల భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి. 
  
సైన్సు ప్రకారం  ఐక్యూ, ఇక్యూ అనే విషయాలు వింటూ ఉంటాం. ఐక్యూ అంటే ఇంటెల్లిజెన్స్ కోషంట్. ఇది ఎడమ మెదడు సామర్ధ్యాన్ని సూచిస్తుంది. మన సమాజంలో దీనికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మనిషిలో యాంత్రికత పెరుగుతోంది. ఇక్యూ అనేది  కుడి మెదడుకు సంబంధించినది. హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఇక్యు మనలోని భావసమతుల్యతకు, పరిస్థితులను ఎదుర్కొనే సామర్ధ్యానికి ఒక సూచిక. ఈ తత్వం ఆడవారిలో సహజంగానే ఉంటుంది. ఈ రెండూ ప్రతి మనిషిలో సమపాళ్ళలో ఉన్నప్పుడే ఎస్.క్యూ అంటే స్పిరిట్యువల్ కోషంట్ సంభవం. ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలన్నా కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉండాలి. "కామిగాక మోక్షగామి కాడు" అన్న ఆర్యోక్తికి అర్ధం ఇదే. స్తీ పురుష తత్వాలను పరస్పరం అర్ధం చేసుకుంటూ ప్రవర్తిస్తే దాంపత్య జీవితం ఆనందమవుతుంది. దానికి చిన్న చిన్న విషయాల్లో మీ ప్రవర్తనలో మార్పులు తీసుకురండి. అదెలాగో చూద్దాం.  


మీ భార్య పనిమనిషి రాలేదని పనెక్కువై అలసిపోయానని మీతో చెప్పుకున్నప్పుడు మీరు  'అయ్యో, అలాగా! " అని అనాలని ఆశిస్తుంది. కాని భర్త తనదైన శైలిలో "వేరే పనిమనిషిని పెట్టుకొమ్మని చెప్పాను కదా" అంటాడు. తాను ఆశించిన ఓదార్పు లభించక భార్య చికాకుపడుతుంది. మీ పెంపుడు కుక్క సైతం మీరు ఇంటికి రాగానే తలపై నిమిరి పలకరించేవరకు ఊరుకోదు. అలాంటిది జీవిత భాగస్వామి కోరుకోదా? అలాగే భర్త విషయానికొస్తే అతను తన నిర్ణయాలను భార్య తప్పు పడితే సహించలేడు. భార్యాభర్తలనే పాత్రలను, బాధ్యతలను,హక్కులను, సమస్యలను పక్కనపెట్టి ఇద్దరూ స్నేహితుల్లా కొద్దిసేపైనా మనసు విప్పి మాట్ట్ట్లాడుకోండీ. కలిసి టి.వి. చూస్తే కలిసున్నట్టు కాదు. ఇద్దరూ టి.విలో కలిసి ఉంటారు. కాని ఒకరితో ఒకరు కాదు. ఏడడుగులంటే మనలోని ఏడు చక్రాలను అధిరోహించి దైవత్వాన్ని చేరడం.

భాగస్వామిని గత జ్ఞాపకాలతో, ఊహలతోనూ పోల్చకుండా ఈ క్షణంలో ఆమె ఎలా ఉన్నదో దాన్నే చూడండి...మీ భాగస్వామిని చూసే చూపులో, వాసనలో , వినికిడిలో , స్పర్శలో పూర్తిగా జీవిస్తూ, ఆస్వాదిస్తూ, హృదయంలో ఉండండీ. అప్పుడే శరీరం, మనస్సు, ఆత్మల కలయిక జరిగి మూడు ముళ్ళ బంధం సంపూర్ణమవుతుంది. ఇద్దరూ కలిసి మోక్షం వైపు ప్రయాణించగలరు.