వీరబ్రహ్మము యొక్క వేద వాక్యంబులు

ధరణిలో తప్పక జరిగేనయా

కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు

కడతేరు మార్గంబు వెతకండయా!


స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు

సర్వేశ్వరుని తప్ప తెలియండయా

సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు

వెలుగుతో వెలుగుచున్నాయరా!


అనంత విశ్వములో గోళమెంతరా?

ఇందులో వున్నట్టి నీశక్తి యెంతరా?

సర్వమును కాపాడు సర్వశక్తిని నీవు,

శరణు బొందుటే నీదు ధర్మంబురా!


కోటీశ్వరునికైన కోటి చింతలు వుండు

చింతలేని బ్రతుకు వెతకాలిరా

చింతలపాలైన సిరికి బానిసలయి

శాంతినే కోల్పోయి యేడ్చేరయా!


వచ్చింది తెలియదు పోయేది తెలియదు

మధ్యలో మన బ్రతుకు ఏమౌనో తెలియదు

ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు

అందరిని కాపాడు ఆది పురుషుని నమ్ము!


తనకున్న సంపదను పేరు ప్రతిష్టలను

చెప్పుకొని గర్వించు చుంటారయా

మూన్నాళ్ల బ్రతుకిది యముడు వచ్చాడంటే

మీ గొప్ప ఏమిటో తెలియండయా!


నావారు ఉన్నారు నా ఆస్థులున్నాయి

నా కేమి తక్కువని మురిసేరయా

కాలంబు తీరెనా లోకము నుండి

తరిమివేయ బడును తెలియండయా!


నాది నాది యనుచు గర్వించి చెప్పేరు

తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు

ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు,

అదియును మీదని ఎవరు చెప్పారు?


చేతిలోని ముద్ద నోటి లోనికి పోదు

శివునాజ్ఞ లేనిదే తెలియండయా

సర్వంబు నేననుచు గర్వంబుతో

జడుడు సర్వనాశన మొంది సచ్చేరయా!


లోకమందున పుట్టినందుకు నీవు

గుర్తునకు ఏదైనా మంచి జేసి వెళ్లు

లేకున్న క్రిములకు నీకు తేడా యేమి

ఇంకెంత కాలంబు బ్రతికేవురా!


నీ తల్లి పార్వతీ నీ తండ్రి శంకరుడు,

ఆలి మాయా శక్తి అంశంబురా

నీ కన్నబిడ్డలే గణపతాంశము తెలియ

అట్టి వారి మెప్పు పొందాలిరా!


సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు

చేసే మహా శక్తి మనిషిలో ను ఉంది

నీలోని శక్తిని భక్తిని ధ్యానింప

ఆదైవ దర్శనం కలిగేనయా!


ఎన్ని విద్యలు నేర్చి ఎంత చదివినగాని

ప్రతిక్షణము చావుతో పోట్లాటయా

చావు లేని చదువు నేర్వంగ జాలరు

ఇది యేమి కర్మమో తెలియండయా!


దానంబు చేయకే దరిద్రులయ్యేరు

దైవమును నిందింప ఫలమేమయ

పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే

జన్మ జన్మకు వెంట వచ్చేనయా!


మీరేది చల్లేరో అదియే పండును గాని

లేని దానికి ఏల యేడ్చేరయా

కర్మలకు దేవునికి సంబంధమే లేదు

ప్రకృతియే దీనికి మూలంబయా!


ఆత్మలో మార్పు కలిగినప్పుడేగాని

తత్వంబు మారునని తెలియండయా

వేషభాషలు పెంచి వేయి విద్యలు

నేర్వ వెతలెట్లు పోవునో తెలియండయా


మతముల పేరిట మత్సరంబులు పెరిగి

మదియించి కొట్టుకొని సచ్చేరయా

మనువు వంశం నుండి మనుషులందరూ పుట్టు

మతము లెన్నుండునో తెలియండయా!