శ్రీకృష్ణునికి పదహారువేల నూట ఎనిమిది మంది భార్యలు. వారిలో రుక్మిణి మొదలు అష్టమహిషులు ముఖ్యమైనారు. వారి పుత్రులను గురించి తెలుసుకుందాం. ఆయనకు ఒక్కొక్క భార్య ద్వారా పదిమంది చొప్పున పుత్రులు జన్మించారు. వారిలో పద్ధెనిమిదిమంది చాలా ముఖ్యులు. వారందరూ మహరథులు. వారి పేర్లు; ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహువు, శ్రుతదేవుడు, సునందనుడు, చిత్రబాహువు,విరూపుడు, కవి, న్యగ్రోధుడు.


ఈ పద్దెనిమిదిమంది పుత్రులలో రుక్మిణీ పుత్రుడైన ప్రద్యుమ్నుడు మాత్రం తండ్రితో సమానంగా ఉంటాడు. ఆయన రుక్మి కూతురును (మేనమామ కొతురు) వివాహం చేసుకున్నాడు. ఆయన కుమారుడు అనిరుద్ధుడు. అతనికి పదివేల ఏనుగుల బలం ఉంది. ఆయన రుక్మి మనుమరాలిని పరిణయం చేసుకున్నాదు. ఆమె ద్వారా ఆయనకు వజ్రుడు జన్మించాడు. యాదవులందరూ యుద్ధంలో మరణించినప్పుడు ఈ వజ్రుడొక్కడే మిగిలి ఉన్నాడు. ఈ వజ్రునికి ప్రతిబాహువు, అతనికి సుబాహువు, అతనికి శాంతసేనుడు, అతనికి శతసేనుడు జన్మించారు.


శ్రీకృష్ణుని వంశంలో అల్పవీర్యులు, అల్పాయుష్కులు, ధనహీనులు, బ్రహ్మద్వేషులు, అల్పసంతతి గలవారు ఎవ్వరూ లేరు. యదువంశీయులలో కేవలం ప్రముఖులను మాత్రమే లెక్కపెట్టడానికి పదివేల సంవత్సరాల కాలం కూడా చాలదు. యాదవ కుమారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు మూడుకోట్ల ఎనభై ఎనిమిదివేల వందమంది ఆచార్యులు ఉండేవారంట.


ఈ వివరాలు శ్రీ వ్యాసభాగవతంలోశుకుడు పరీక్షిత్తు మహారాజుతో చెప్పబడినవి..