హైందవుల పూజా విధానాల్లో "పంచాయతనానికి" ఒక విశిష్టమైన స్థానం ఉంది.


ఆదిత్యామంబికా విష్ణుం గణనాధం మహేశ్వరం
పంచయజ్ఞో కరోన్నిత్యం గృహస్తః పంచ పూజయతే
సూర్యుడు, అమ్మవారు, మహావిష్ణువు, గణపతి, పరమశివుడు ఈ అయిదుగురు దేవతలకు ప్రత్యేకంగా జరిగే పూజా విధానమే "పంచాయతనం". ఈ పంచాయతనంలో ఏయే దేవతలు ఏయే దిశల్లో ఉండాలంటే ఈశాన్యంలో, విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యుడు(అగ్ని), నైరుతిలో గణపతి, వాయువ్యంలో అంబికను(అమ్మవారిని) ఉంచి, మధ్యలో శివుడిని ఉంచి చేసే పూజకి "శివ పంచాయతనం " అని పేరు. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఈ అయిదుగురి దేవతలలోను, ఏ దేవతని మధ్యలో ప్రధానంగా ఉంచి పూజ చేస్తారో , దానికి ఆ దేవత పేరిట పంచాయతనంగా వ్యవహరిస్తారు. అనగా, మధ్యలో గణపతిని ఉంచితే గణపతి పంచాయతనం గా వ్యవహరిస్తారు. విష్ణుమూర్తిని ఉంచితే విష్ణు పంచాయతనం అని, అలాగే మిగతావారిని వారి పేర్లతో పంచాయతనాన్ని వ్యవహరిస్తారు.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం - ఇవి పంచ భూతాలు. ఈ పంచ భూతాలకు ప్రతీకలే మనం పైన చెప్పుకున్న దేవతలు. అందువలన ఈ దేవతలను పూజిస్తే పంచభూతాలను అర్చించిన ఫలం దక్కుతుంది.

ముఖ్యంగా గమనించినట్లయితే ఆకాశమ్నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీరునుండి భూమి, భూమినుంచి ఓషధులు, వాటినుండి ఆహారం, ఆహారం వలన ప్రాణికోటి, జంతుజాలం ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయం భగవద్గీతలో గీతాచార్యుడు ఉద్భోదించడమేకాక, అధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. అనగా శివుడు ఆకాశ తత్వాన్ని, అమ్మవారు వాయుతత్వాన్ని, సూర్యుడు అగ్నితత్వాన్నీ, విష్ణుమూర్తీ జల తతత్వాన్ని, గణపతి పృద్వీ తత్వాన్నీ కలిగిఉంటారని పండితుల ఉవాచ.




ఇంక - నాదం శబ్ధప్రధానం. ఆకాశానిది శబ్ధ గుణం. అందుకే శివుణ్ణి ఆకాశ తత్వానికి ప్రతీకగా అభివర్ణించారు.





వాయువు ప్రాణాన్ని ప్రసాదించే శక్తి ఉంది. అమ్మవారు "ప్రాణధాత్రి " కదా! అందుకే అమ్మవారికి వాయుతత్వం ఉందంటారు.


సూర్య అష్టోత్తర శతనామాల్లో "అగ్నిహోత్రాయ నమః" అని అన్నారు. కనుకనే సూర్యుడు అగ్నికి ప్రతీక.




విష్ణువు జల నంభూతుడు. "నార" అంటే జలం. నారనుంచి ఆవిర్భవించినవాడు కాబట్టే ఆయనని "నారాయణుడు" అంటున్నాము.




గణపతి మూలాథార చక్రాధిదేవత. అంటే మూలాధారమన్నది పృద్వీ తత్వం. అందుచేతనే గణపతిని "మట్టితో " చేసి పూజిస్తారు. మట్టి గణపతి మహత్తు చాలా అద్భుతమైనది.






ఇంట్లో నిత్యం చేసే దేవతార్చనలో పంచాయతన పూజా విధానాన్ని తప్పకుండా అనుసరించాలని పెద్దల సూచన.




షోణ నదిలో దొరికే షోణ భద్రం శిలను గణపతి అనీ, గండకీ నదిలో దొరికే శిలను విష్ణువు అనీ, నర్మదా నదిలో దొరికే బాణలింగ శిలను శివుడు అనీ, స్వర్ణముఖిలోను, అలాగే ఖనులలో దొరికే హేమాక్షకం అనే శిలను అమ్మవారు అనీ, యమునా నదిలోను ముఖ్య పర్వత ప్రాంతంలోను లభించే స్పటిక శిలను సూర్యుడు అనీ భావించి వాటిని అరాధిస్తారు.



ఇంక పంచాయతనార్చన చేసేముందు ప్రాతః సంధ్యావందనం విధిగా ఆచరించాలన్నది శాస్త్రవచనం.