మహాభారత నాయిక. మరోవిధంగా చెప్పాలంటే ఇతిహాసాన్ని నడిపించిన సారధి ద్రౌపది. ఇతిహాసం అంటే జరిగిన కథ. అందుకే, మహాభారతంలో దేశ నైసర్గిక స్థితిగతులు స్పష్టంగా కనిపిస్తాయి. రాజధానులు, అడవులు, కొండలు, నదులు మొదలైన వాటి సమగ్ర వివరణ మనకు కనిపిస్తుంది. నాటి రాజకీయ, సాంఘిక పరిస్థితులను, వైవిధ్యాలను మనం గమనించవచ్చు. . యదువంశం, కురువంశం, ద్రుపద రాజవంశం, విరాట వంశం, మగధ వంశం... యివన్నీ మనకు మహాభారతంలో కనిపిస్తాయి.

ద్రుపద రాజ్యానికి రాజు ద్రుపదుడు శౌర్యపరాక్రమములు గల పుత్రుడు కావాలని సంకల్పించి యజ్ఞ్ణం చేశాడు. మహాయజ్ఞ్ణంలో ద్రుపదునికి ఒక పుత్రుడు (దృష్టద్యుమ్నుడు, పుత్రిక (ద్రౌపది) లభించారు. తల్లిదండ్రులకు కూతురంటే విపరీతమైన ప్రేమ. అందుకే వంశం పేరు పెట్టుకున్నారు. అది పాంచాలదేశం కనుక పాంచాలి అన్న పేరు వచ్చింది. యజ్ఞసేనుని కుమార్తె గనుక యాజ్ఞసేని అయింది. ద్రౌపది చామనచాయలో ఉన్నందున కృష్ణ అన్న పేరు కూడా ప్రసిద్ధమే. యజ్ఞసేనుని భార్య పేరు పృషతి. వంశపూర్వీకుని పేరు పృషకుడు. అందుకని వంశీయులను పార్షకులు అన్నారు. వంశానుగుణంగా ద్రౌపదికి పార్శతి అనే పేరు కూడా సంక్రమించింది.