అతిథి దేవోభవ ...
Filed under: జిజ్ఞాస Author: జ్యోతిఅతిథులకు అన్నం పెట్టి ఆదరించడం మన సంప్రదాయం. అన్నం పరబ్రహ్మతో సమనం. అన్నం దేవతా స్వరూపమని తైత్తిరీయ బ్రాహ్మణం చెపుతోంది. 'అతిథిదేవోభవ' - అతిథి కూడా మనకు దైవంతో సమానం. అన్నదాన మహిమ గురించి చెప్పాలంటే కఠోపనిషత్తులో చెప్పిన నచికేతుడి వృత్తాంతం గురించి తెలుసుకోవాలి.
నచికేతుడు ఉద్ధాలకుడి కుమారుడు. ఉద్ధాలకుడి తండ్రి వాజశ్రవుడికి గొప్ప అన్నదాత అని పేరు. అతని అన్నదాన మహిమవల్లనే అతనికి నచికేతుడులాంటి యశశ్శాలి మనవడుగా జన్మించాడని ప్రతీతి. తనకున్న ధనాన్నంతటిని దక్షిణగా ఇచ్చే క్రతువును 'విశ్వజిద్యాగము' అని అంటారు. ఒకప్పుడు ఉద్ధాలకుడు విశ్వజిద్యాగమక్రతువు ప్రారంభించాడు. ఆ క్రతువులో భాగంగా ఐదవరోజు తనకున్న మొత్తం ధనాన్ని దక్షిణగా ఇచ్చివేశాడు.
ఉద్ధాలకుడి కుమారుడు నచికేతుడు బుద్ధిమంతుడు. కుశాగ్ర బుద్ధికలవాడు. ఉపనయన యోగ్యమైన వయసు కలవాడు. తన తండ్రి చేస్తున్న క్రతువు గురించి తెలిసినవాడు కావున పుత్రుడైన తానూ తండ్రికి పుత్రధనంతో సమానం కాబట్టి తనను కూడా ఒక ఋత్విక్కునకు దక్షిణగా ఇవ్వాలని తలచాడు.
అందుకనే తండ్రి దగ్గరకు వెళ్ళి ' తండ్రీ, నన్ను ఎవరికి దానంగ ఇస్తున్నావు?' అని ప్రశ్నించాడు.
నచికేతుడి మాటల్ని ఉద్ధాలకుడు ఉపేక్షించాడు.
అయినా పట్టువదలని నచికేతుడు తండ్రిని రెండోసారి, మూడోసారి కూడా అదేవిధంగా ప్రశ్నించాడు.
ఆ విధంగా పలుమార్లు ప్రశ్నించడంతో ఆగ్రహోదగ్రుడైన ఉద్ధాలకుడు కొడుకు మూర్ఖుడని తలచి 'నిన్ను మృత్యువుకు ఇచ్చివేస్తున్నానని' పలికాడు.
వెంటనే ఆకాశవాణి ప్రత్యక్షమై...
'నచికేతా! నువ్వు మృత్యువు యొక్క ఇంటికి వెళ్ళు' అని చెప్పడంతో పాటు అతను అక్కడ నడుచుకోవాల్సిన విధానం గురించి కూడా వివరించింది.
'యముడు ఇంట్లో లేని సమయాన ఆ ఇంటికి వెళ్ళు. మూడు రాత్రులు యముని ఇంట్లో నివసించు. అయితే ఆ మూడురోజులు యముడి భార్యాబిడ్డలు అన్నం తినమని నిన్ను వేడుకున్నా, నువ్వు ఆ ఇంట భోజనం చేయకుండా ఉపవాసం వుండమని ' చెప్పింది. అనే కాకుండా యముడు అడగబోయే మూడు ప్రశ్నలను చెప్పి వాటికి సమాధానాలు కూడా చెప్పి మాయమైంది.
ఆకాశవాణి మాట ప్రకారం నచికేతుడు యముడు ఇంట్లోలేని సమయంలో అతని ఇంటికి వెళ్ళాడు. భోజనం చేయకుండా మూడు రోజులు ఉపవాసం చేశాడు.
యముడు వచ్చాక నచికేతుణ్ణి మూడు ప్రశ్నలడిగాడు.
వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఈ విధంగా ఉంది.
యముడు : నచికేతా, మాఇంట్లో ఎన్ని దినాలున్నావు?
నచికేతుడు: మూడు రాత్రులున్నాను.
యముడు : మొదటి దినమున ఏమి తింటివి?
నచికేతుడు : నీ సంతానాన్ని భుజించితిని.
యముడు : రెండవరాత్రి ఏమి తింటివి?
నచికేతుడు : నీ పశువులను భుజించితిని.
యముడు : మూడవరాత్రి ఏమి తింటివి?
నచికేతుడు : నీ పుణ్యకర్మను భుజించితిని.
ఈ విధంగా నచికేతుడు యమధర్మరాజు అడిగిన మూడు ప్రశ్నలకు తెలివైన సమాధానాలు చెప్పడంతో యముడు నచికేతుడు మామూలు బాలుడు కాడని తలచి, అతన్ని చంపకుండా వదిలివేయాలని నిశ్చయించుకున్నాడు. నచికేతుడు తన ఇంట్లో మూడు రాత్రులు ఉపవాసం చేయడం వల్ల కలిగిన పరిహారార్ధమై అతన్ని మూడు వరాల్ని కోరుకోమన్నాడు.
అప్పుడు నచికేతుడు 'తాను చంపబడకుండా తిరిగి తండ్రిని చేరుకోవాలని, శ్రౌత, స్మార్త కర్మఫలాల అక్షయాన్ని , సాధనను ఉపదేశించమని, తిరిగి జన్మ లేకుండా ముక్తి పొందే మార్గం చెప్పమ'ని కోరుకున్నాడు. ఈ మూడు వరాల్ని యముడు ప్రసాదించాడు.
అన్నదాన మహిమ తెలియడంకోసమే నచికేతుడు జన్మించాడని ముల్లోకాల్లోనూ ఈ కథ ప్రసిద్ధమైంది.
అన్నం గురించి ఓ ఉపాఖ్యానం వుంది.
అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద , దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.
వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే, ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా, దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే, దానికి రుచితోపాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా వుంటాయన్నది పూర్వూకుల విశ్వాసం.
లోకంలో మానవులు దాత, అదాత అని రెండు రకాలుగా వుంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయబ్రాహ్మణం వివరిస్తుంది.
ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే, ఆ అన్నం విషంతో సమానం. దాత, అదాత ఇద్దరూ అన్నసంపాదనకు ప్రయత్నిస్తారు. కాని దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది ఉత్కృష్టమైనది. అదాత తాను తినడంకోసమే సంపాదిస్తాడు. అతను పాపాత్ముడు అని శ్రుతి పేర్కొంటోంది.
అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైంది కూడా. మనం తినే అన్నాని బట్టే మనకు రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెపుతుంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమగల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒక రకంగా విషాన్ని భుజిస్తున్నట్టే.
యజ్ఞయాగాది క్రతువుల్లొ అగ్నికి ఆహుతి చేసే అన్నం 'మేఘం' అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమిమీదున్న నీటిని స్వీకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తుంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు.
పరిశుద్ధమైన , ఏకాగ్రమైన మనస్సుగలవారికి తపస్సు సత్ఫలితాలనిస్తుంది. ముందు మేధస్సు, తర్వాత శాంతి, జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, పరమానందం లభిస్తాయి.
కాబట్టే ఇన్నింటినీ సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుంది.
Bhasker
August 22, 2008 at 1:25 PM
చిలమకూరు విజయమోహన్
August 23, 2008 at 5:47 AM
సుజాత వేల్పూరి
August 23, 2008 at 7:59 AM
బాగా చెప్పారు. బఫే సంప్రదాయం వచ్చాక వృధా విపరీతంగా పెరిగిపోయింది. కావలసింది వడ్డించుకోవడం కాక, కనపడ్డ ప్రతిదీ వడ్డించుకుని విసిరిపారెయ్యడం సంప్రదాయమైపోయింది. ఒకరికొకరు పరిచయం లేకుండా నిలబడి తుఫాన్ బాధితుల్లా, అనామకుల్లా, తినే తిండి మీద గౌరవం లేకుండా తయారైంది వాతావరణం! బయటి గోడవతల పిడికెడు అన్నం కోసం వేచి చూసే అభాగ్యులు(వీళ్లకే అన్నం పరబ్రహ్మ స్వరూపం) వీరి కలలోకైనా రారు. అరిటాకులో భుజించాలంటే పత్నవాస నాగరికత వాసనలంటని ఏదైనా పల్లెటూర్లో మనకు బంధువులుండాలి.
జ్యోతి
August 23, 2008 at 2:31 PM