"యమపురి" పురాణాలననుసరించి మనకు ఎంత దూరంలో ఉంది?



వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు(మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి,నగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన,బహ్వా పద,దుఖఃద , నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు.ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడనుంచే వైతరణి దాటాలి. గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేనివారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు.శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట.