చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని
చేరి మ్రొక్కితే బ్రతక నేర్చేరూ.

చెప్పలేదంటనక పొయ్యేరు
తప్పదిదిగో గురుని వాక్యము
తప్పు ద్రోవల బోవు వారల
చప్పరించి మ్రింగు శక్తులు
ముప్పెతనమున మోసపొయ్యేరు అదిగాక కొందరు
గొప్పతనమున గోసుమీరేరు.

ఇప్పుడప్పుడనగరాదు
ఎప్పుడో ఏ వేలనో మరి
గుప్పు గుప్పున దాటి పోయేడు
గుర్రపడుగులు ఏరుపడును
తాకుతప్పులు తలచకున్నారు - తార్కాణమైతే
తక్కువెక్కువ తెలియనేర్తూరు

జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాకి శోకము చేసి ప్రజలు
కాయ కసురులు నమిలి చత్తురు
కేక వేసియు ప్రాణమిడిచేరు - రాకాసి మూకలు
కాక బట్టి కలవరించేరు

ఆకసమ్మది ఎర్ర బారును
ఆరు మతములు ఒక్కటౌను
లోకమందలి జనములందరు
నీరునిప్పున మునిగి పోదురు
అగలు విడిచి పొగలు దాటేరు-అది గాక పట్ట
పగలు చుక్కలు చూసి భ్రమసేరు

భుగులు భుగులు ధ్వనులు మింటున
పుట్టియేగిన పిమ్మటాను
దిగులు పడుచూ ప్రజలు చాలా
దిక్కులేని పక్షులౌదురు
పాతకూతా పదట గలిసేరు -పరిపూత చరితులు
సాధువులు సంతసింతురు

భూతలంబున నిట్టి వింతలు
పుట్టియనగిన పిమ్మటాను
నీతికృతయుగ ధర్మమప్పుడు
నిజము నిలకడ మీద తెలియును
ఏమో ఏమో ఎరుగకున్నారు - ఎందెందు జూచిన
యముని పురికే నడవమన్నారు

భూమి మీదను ధూముధాములు
పుట్టిపెరిగిన పిమ్మటానూ
రామ రామ యనని వారలు
రాలిపోదురు కాలి పోదురు
ముందు వెనకలు గాన కున్నారు - మూర్ఖావలీ భువిలో
ముందు గతినే యెరగ కున్నారు

కందువతో పిన్న పెద్దల
కన్నుగానక గర్వములచే
మందే వేలములాడువారిని
బందు బందుగ గోతురక్కడ
కీడెయైనను కూడదందూరు - ఒనగూడినపుడు
యేడ జూచిన వాడుకొందురూ