కార్తీకమాసం
Filed under: మాసం - విశేషం Author: జ్యోతిస్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.
"న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్"
అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే "కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని అర్ధం.
కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే!
కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ,కొబ్బరినూనెతోగానీ, నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.
నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.
శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.
కార్తీక మాసంలో పండుగలు
శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ
దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.
శుక్లపక్ష చవితి " నాగుల చవితి
కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.
శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి
ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.
శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి
పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను.
శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి
వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ దినం వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను
శుక్లపక్ష పూర్ణిమ :
ఈ దినం శివాలయాల్లో నిర్వహించే 'జ్వాలాతోరణం ' ను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ,వైష్ణ్వాలయంలోగానీ దీపాలను వెలిగించవలెను. ఈ దినం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.
కృష్ణపక్ష చవితి : కరక చతుర్ధి
ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.
వృశ్చిక సంక్రమణం
ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు ఈరోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను ఇస్తుంది.
కార్తీకమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చు.
బ్లాగేశ్వరుడు
November 20, 2007 at 11:05 PM