జ్వాలాముఖి శ్రీ వైష్ణవి దేవి !
Filed under: యాత్ర Author: జ్యోతిఅమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ చల్లని తల్లి త్రిశక్తి శ్రీ సరస్వతి, శ్రీలక్ష్మి, శ్రీమహాకాళి రూపాల్లో శ్రీ వైష్ణవదేవి పేరుతో కొలువుదీరి భక్తుల ఆరాధానలందుకుంటున్న దివ్యక్షేత్రం. ’జ్వాలాక్షేత్ర” ఇది అష్టాదశ శక్తిపీఠాలలో 15వ శక్తిపీఠం.కాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాకు 14కిలోమీటర్ల దూరంలో శ్రీ మాతా వైష్ణవీ దేవి కొలువై ఉన్న జ్వాలా క్షేత్రం.
త్రేతాయుగంలో శ్రీరాముడు లంకానగరములో దండయాత్రకు బయలుదేరేముందు జగన్మాతను ప్రార్ధించగా జగన్మాత సరస్వతి, లక్ష్మి, మహాకాళి రూపాల్లో ప్రత్యక్షమై ఆయన పూజలందుకున్నట్లు చెప్పబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పూజలందుకున్న ఆ జగన్మాత ద్వాపరయుగంలో ఉత్తర భారతదేశానికి వెళ్ళి జమ్ము ప్రాంతాల్లోని అదవుల్లో కొలువుదీరినట్లు చెప్పబడుతుంది. ఈ విధంగా త్రేతాయుగం, ద్వాపరయుగంలో పూజలందుకున్న ఈ అమ్మవారు కలియుగంలో కొలువుదీరడాన్ని ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.
ఎత్తయిన పర్వత శ్రేణులు, వాటిపైన ఆకాశన్నంటే వివిధ వృక్షాలు, ఆహ్లాదాన్ని కలిగించే అందమైన ప్రకృతి శోభ మధ్య త్రికూట పర్వతం పైన ’శ్రీ వైష్ణవీ దేవి’ ఆలయం ఉంది. ఆలయం సముద్ర మట్టానికి సుమారు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీ వైష్ణవదేవీ యాత్ర కత్రా నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడినుంది ఆలయం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు సాధారణంగా కాలినడకనే వెళతారు. ఈ దారిలో వాహనాలు వెళ్ళలేవు. నడవలేని వారికి , వృద్ధులకు గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. కత్రాకు కొంత దూరంలో ’భూమికా మందిరం ’ ఉంది. .ఇక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్లో భక్తులు దర్శనానికి వెళ్ళేముండు తమ పేర్లను నమోదు చేసుకోని రసీదు పొందాలి. ఆ రసీదు ఉన్నవారే దర్శనానికి అర్హులు. ప్రయాణ మార్గంలో కత్రా నుంచి సుమారు రెండు కిలోమీటర్లు దాటగానే ’దక్షిణ దర్వాజా’ ఉంది. ఇక్కడినుండి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల దీనికి ’దర్సన దర్వాజా’ అని కూడా పేరు. దీనిని దాటిన తర్వాత ’ బాణ్ గంగా’ ఉంది. వైష్ణవీదేవి బాణం వేయగా అక్కడ ఉన్న రాయి నుండి గంగ ఉద్భవించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెపుతారు.
బాణ్గంగాకు ఒకటిన్నార కిలోమీటర్లు దూరంలో ’చరణ పాదుకా’ అనే ప్రాంతం ఉంది. ఇక్కడి అమ్మవారి పాదముద్రల నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. దీని భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు. మరి కొంత దూరంలో ’ఆదికుమారి మందిరం’ ఉంది. తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ’సాంజీ భేట్’ ఉంది. ఇక్కడి నుండి మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శ్రీవైష్ణవీదేవి ఆలయం ఉంది. సాంజీ భేట్ వరకు కొండను ఎక్కుతూ వచ్చిన భక్తులు ఇక్కడ నుండి కొండ దిగుతూ ఆలయాన్ని చేరుకుంటారు. విశాలమైన వివిధ భవనాలుగా, అపార్టుమెంటుల్లాగా కనిపించే ఆలయంపై ఉత్తర భారత శైలిలో నిర్మించిన గోపురం ఉంది. ఆలయం పైభాగంలో సింహం ప్రతిమలు దర్శనమిస్తాయి. శ్రీ ఆంజనేయస్వామి చిహ్నం ఉన్న లోహపతాకం ఎప్పుడూ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులందరూ ఒకే క్యూలైనులో వెళ్ళవలసిందే ప్రత్యేక దర్శనాలు వంటివి లేవు.
జగన్మాత శ్రీవైష్ణవిదేవి గుహలోపల కొలువుదీరి ఉంది. సుమారు 98 అడుగుల గుహలో గుహగోడపై శ్రీవైష్ణవీదేవి దర్శనమిస్తుంది. ఈ గుహలోకి కొంతదూరం వంగి, మరికొంత దూరం పాకుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. గుహలో కొలువుదీరిన జగన్మాత రాయి రూపంలో దర్శనమిస్తుంది.. ఈ మూర్తి క్రిందిభాగం ఒకటిగానే ఉండి శిఖరస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మూడుగా విభజింపబడి ఉంటుంది. ఎడమవైపు తెల్లని భాగం శ్రీ సరస్వతిగా, మధ్యలోని పచ్చని భాగం శ్రీలక్ష్మిగా, కుడివైపున ఉన్న నల్లని భాగం శ్రీమహాకాళిగా చెప్పబడుతూ ఉంది.అంటే ఈమె ముగ్గురు శక్తుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరూపం. అమ్మవారు కొలువుదీరి ఉన్న గుహలో అమ్మవారి కంటే ముందే ’చరణ్ గంగా’ ఉంది. ప్రవహిస్తూ ఉన్న ఈ నీటిలో భక్తులు కాళ్ళు కడుక్కుని అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న బైరవనాధుడిని దర్శించుకుంటారు.
ప్రతీ రోజు పూజలుజరిగే శ్రీవైష్ణవిదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల సంధర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి జమ్ముకు వెళ్ళేందుకు రైలు సౌకర్యాలు ఉన్నాయి. కత్రాతో పాటు మార్గమంతా త్రికూట పర్వత ప్రాంతంలోనూ వసతి గృహాలు, సత్రాలు ఉన్నాయి. రోజంతా ఆలయం తెరిచే ఉంటుంది. అయితే జనవరి , ఫిబ్రవరి నెలల్లో మంచు వల్ల ప్రయాణం కష్టమవుతుంది కనుక మిగతా సమయాల్లో వైష్ణవి దేవి యాత్రకు వెళ్ళడం మంచిది.
Anonymous
November 12, 2007 at 11:56 PM
జ్యోతి
November 13, 2007 at 6:31 PM
this is link where i uploaded the music, u can hear it..
'http://odeo.com/show/14762863/4/download/Gayatri.mp3'/ >
Anonymous
November 13, 2007 at 8:54 PM