1. కురు పాండవుల వంశానికి మూల పురుషుడు ఎవరు?
జ. చంద్రుడు
క్షత్రియ వంశాలలో సూర్యవంశం, చంద్రవంశం ప్రసిద్ధాలు. రాముడు సూర్య వంశీయుడు. కౌరవ పాండవులు చంద్ర వంశీయులు. భారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసం పద్నాలుగవ పద్యం ప్రారంభములోనే హిమకరుడు అంటూ చంద్రుని వంశానికి మూలపురుషునిగా పేర్కొనబడింది.

2. మహా విష్ణువు అవతారాలు పది. మరి ఆంజనేయుడివి కూడా అవతారాలు ఉన్నాయి. అవి ఏమిటి?
జ. ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది.

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.
1. ప్రసన్నాంజనేయస్వామి.
2. వీరాంజనేయస్వామి.
3. వింశతిభుజాంజనేయస్వామి.
4. పంచముఖాంజనేయస్వామి.
5. అషాదశభుజాంజనేయస్వామి.
6. సువర్చలాంజనేయస్వామి.
7. చతుర్భుజాంజనేయస్వామి.
8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
9. వానరాకార ఆంజనేయస్వామి
3. త్రిదండి చినజీయర్ స్వామి అనే పేరు మీరు విన్నదే కదా. ఆ త్రిదండి అని చెప్పబడే త్రిదండములు ఏవి?
జ. త్రిదండములు - వాగ్దండము, మనోదండము, కాయదండము.

"వాగ్దండో కథ మనోదండుః కాయదండస్తధైవచయస్సైత్యే నిహతా బుద్ధౌ త్రిదండీతి స ఉచ్చతే"

త్రిదండి అని ఎవరిని అంటారంటే ఎవరైతే వాగ్దండము అనగా మౌనమును, మనోదండము అనగా ఆశ లేకుండుటను, కాయదండము అనగా స్వధర్మాచరణమును కలిగి వుంటారో అటువంటి మహనీయులు.

4. అర్జునుడికి చిత్రాంగద ద్వారా కలిగిన కుమారుడు ఎవరు?
జ. బభ్రువాహనుడు.

అర్జునుడికి చిత్రాంగదయందు పుట్టిన కుమారుడు బభ్రువాహనుడు. మణిపురం ఇతని రాజధాని. పుట్టిన చాలాకాలానికి కాని తండ్రిని చూడలేదు. రాజసూయ యాగము తర్వాత యజ్ఞాశ్వాన్ని తీసుకుని వచ్చిన అర్జునుని ఎదిరించిన వీరుడు.

5. విష్ణుమూర్తి సేనాపతి ఎవరు?
జ. విష్వక్సేనుడు.

విష్ణువు పరిచరులలో విష్వక్సేనుడు అనేవాడు వైకుంఠములోని సైన్యానికి నాయకుడు. శుకుని కుమార్తె పుత్రుడైన బ్రహ్మదత్తునికి గోదేవియందు పుట్టిన కుమారుడిపేరు కూడా విష్వక్సేనుడే.