ఆశ్వీయుజ మాసం
Filed under: మాసం - విశేషం Author: జ్యోతిత్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి, మహాలక్శ్మి, పార్వతీదేవిలకు అత్యంత ప్రీతికరమైన, వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ’ఆశ్వీయుజ మాసం’. చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం ఏడవ మాసం. శరదృతువు ఈ మాసంతో ప్రారంభమవుతుంది. ఈ నెలలోని పూర్ణిమనాడు చంద్రుడు ’అశ్వని నక్షత్రం’ సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి ’ఆశ్వీయుజ మాసం’ అనే పేరు ఏర్పడింది. మనకు వున్న ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వనీ నక్షత్రం మొదటి నక్షత్రం. అలా నక్షత్రాల ప్రకారంగా తీసుకుంటే ఆశ్వీయుజ మాసం తొలి మాసం అవుతుంది.
జగన్మాత అయిన పార్వతీదేవి దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధం తొమ్మిది అవతారాలను ధరించిన, ఆయుర్వేద దేవుడైన ’ధన్వంతరి’ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త అయిన మధ్వాచార్యులవారు జన్మించిన, దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడితే ప్రజలందరూ ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసం ఆశ్వీయుజ మాసం. ఈ మాసంలోని తొలి తొమ్మిదిరోజులు అంటే శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని నవమి వరకు శక్తి ఆరాధనకు విశేషమైన రోజులు. ఈ తొమ్మిది రోజులకు ’దేవీ నవరాత్రులు’ అని పేరు. దేవీ ఆరాధనకు ప్రధానమైన రోజులు కనుక వీటికి ’దేవీ నవరాత్రులు అని, శరత్కాలంలో వచ్చే రాత్రులు కనుక ’శరన్నవరాత్రులు’ అనే పేరు ఏర్పడింది.
ఈ తొమ్మిది రోజులు నవదుర్గలను రోజుకొకరి చొప్పున ఆరాధిస్తారు.
నవదుర్గలు….
1. శైలపుత్రి
2. బ్రహ్మచారిణి
3. చంద్రఘంట
4. కూష్మాండ
5. స్కందమాత
6. కాత్యాయిని
7. మహాగౌరి
8. సిద్ధిధాత్రి
దేవీ నవరాత్రులలో సప్తమిరోజు అంటే మూలా నక్షత్రంనాడు విధ్యాదేవత అయిన శ్రీ సరస్వతిదేవిని పూజించవలెను. అట్లే దుర్గాష్టమినాడు దుర్గాదేవిని పూజించి కూష్మాండ(గుమ్మడికాయ) బలిని ఇవ్వడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ నెలలోని బహుళ పక్షంలో చతుర్దశి, అమావాస్య తిథులలో దీపాలను దేవాలయం, మఠం ప్రాకారాల్లోగాని, వీధులు, ఇంటియందు సాయంత్రం సమయంలో వెలిగించవలెను. అందువల్ల పితృదేవతలు సంతృప్తి పడతారు. శరన్నవరాత్రులలో తిరుమల క్షేత్రములో కొలువై యున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఆశ్వీయుజ మాసంలో స్త్రీలు చేసే వ్రతాలు…
కోజాగరీ వ్రతం.
ఈ వ్రతంను ఆశ్వీయుజ పూర్ణిమనాడు ఆచరించవలెను. ఈ వ్రతం శ్రీమన్నారాయణుడికి, అతని దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. రాత్రి శ్రీమహాలక్ష్మిని పూజించి, బియ్యం, పాలు,పంచదార, కుంకుమపువ్వు వేసి చక్రపొంగలి చేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ దినం రాత్రి శ్రీమహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి చూస్తుందిట. ఎవరైతే మేలుకుని ఉంటారో వారికి సకల సంపదలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గొంతెమ్మ పండుగ
దీనిని కూడా అశ్వీయుజ పూర్ణిమనాడే జరుపుకొనవలెను. ఈ దినం కుంతీ మహేశ్వరీదేవిని పూజించి అరిసెలు, అప్పములు, అన్నము మొదలైన నైవేద్యములు సమర్పించవలెను. ఈ విధంగా పూజించడంవల్ల మహిళల కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
చంద్రోదయ గౌరీవ్రతం
ఈ వ్రతమును ఆశ్వీయుజ బహుళ పక్ష తదియనాడు ఆచరించవలెను దీనికే ’చంద్రోదయోమావ్రతం’ అని, అట్లతద్ది వ్రతం అని కూడా పేర్లు ఉన్నాయి. అట్లతద్దినాడు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నానం చేసి, గౌరీదేవిని, గణపతిని పూజించవలెను పగలంతా అంటే రాత్రి చంద్రుడు ఉదయించేవరకు ఉపవాసం ఉండి అనంతరం అట్లు చేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించవలెను. ఆ అట్లతో భోజనం చేయవలెను.
ఆశ్వీయుజ మాసంలో పండుగలు..
ఆశ్వీయుజ శుక్లపక్ష దశమి : విజయదశమి
పాడ్యమి మొదలుకుని దశమివరకు ఉన్న పదిరోజులకు ’దసరా’ అని పేరు. ’దశహర్’ అనే పదం నుండి ’దసరా’ అనేది ఏర్పడింది. అంటే పది పాపములను హరించునది అని అర్ధం. మొదటి తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు. విజయదశమికే ’అపరాజిత దశమి’ అని కూడా పేరు. అనగా అపజయం లేని రోజు. ఈ దినం ఆయుధపూజ చేసి దేవిని పూజించడంతోపాటు సాయంత్రం శమీవృక్షం వద్దకు వెళ్ళి దర్శించి పూజించవలెను.
ఆశ్వీయుజ శుక్లపక్ష దశమి : విజయదశమి
పాడ్యమి మొదలుకుని దశమివరకు ఉన్న పదిరోజులకు ’దసరా’ అని పేరు. ’దశహర్’ అనే పదం నుండి ’దసరా’ అనేది ఏర్పడింది. అంటే పది పాపములను హరించునది అని అర్ధం. మొదటి తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు. విజయదశమికే ’అపరాజిత దశమి’ అని కూడా పేరు. అనగా అపజయం లేని రోజు. ఈ దినం ఆయుధపూజ చేసి దేవిని పూజించడంతోపాటు సాయంత్రం శమీవృక్షం వద్దకు వెళ్ళి దర్శించి పూజించవలెను.
శుక్లదశమి : శ్రీమధ్వాచార్య జయంతి
త్రిమతాచార్యులలో ఒకరు, ద్వైతమత స్థాపకుడు అయిన శ్రీమధ్వాచార్యులవారు ఈ దినం జన్మించినట్లు చారిత్రక కథనం.
శుక్ల ఏకాదశి : పాశాంకుశ ఏకాదశి
ఈ ఏకాదశి వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాస వ్రతమును అనుసరించడంవల్ల పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయి అని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
కృష్ణపక్ష ఏకాదశి : ఇందిరా ఏకాదశి
ఈ ఏకాదశి వ్రతం పాటించడంవల్ల ఇహలోకంలోని వారికి సౌఖ్యం లభించడమే కాకుండా యమలోకంలో బాధలు అనుభవిస్తూ ఉన్న పితృదేవతలకు విముక్తి లబించి వైకుంఠానికి వెళ్తారని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
కృష్ణపక్ష ద్వాదశి : గోవత్స ద్వాదశి
గోవును శ్రీమహాలక్ష్మి స్వరూపంగా ఆరాధించడం మన ఆచారం.ఈ దినం సాయంత్రం గోవును దూడతో సహా అలంకరించి పూజించవలెను. గోసంబంధమైన అంటే పాలు, పెరుగు, నెయ్యి వంటివాటిని భుజించరాదు. మినుములతో వండిన వంటకము భుజించడం మంచిది.
కృష్ణపక్ష త్రయోదాశి : శ్రీ ధన్వంతరి జయంతి
ఈ రోజు ఆయుర్వేద వైద్యుడైన ధన్వంతరిని, శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇలా పూజించడంవల్ల సకల వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని శాస్త్ర వచనం.
కృష్ణపక్ష చతుర్దశి : నరక చతుర్దశి
దీనికే ’ప్రేత చతుర్దశి’ అని పేరు. ఈ రోజు తెల్లవారుఝూమునే నిద్రలేచి నువ్వులనూనెతో తలంటుకుని స్నానం చేయవలెను. స్నానానంతరం నువ్వులతో యముడికి తర్పణం వదలవలెను. సాయంత్రం దీపములను వెలిగించవలెను.
కృష్ణపక్ష అమావాస్య : దీపావళి
ఈ దినం సూర్యోదయపూర్వమే స్నానమాచరించవలెను. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి లక్ష్మీదేవిని పూజించవలెను. సాయంత్రం నువ్వులనూనెతో ఇంటి ద్వారం, ధాన్యం కొట్టు, బావి, రావిచెట్టు, వంట ఇంటిలో దీపాలను వెలిగించవలెను. ఈ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడని, మహాలయ పక్షాల్లో భూమిమీదకు పితృదేవతలు తిరిగి వెళ్ళేందుకే మగవారు దక్షిణ దిక్కుగా నిలబడి దివిటీలు వెలిగించవలెను. అనంతరం ఇంటిలోనికి వచ్చి తీపి పదార్థాన్ని భుజించి బాణాసంచా వెలిగించవలెను.
ఈ విధంగా ఎన్నో విశిష్టతలను స్వంతం చేసుకున్న మాసం ’ఆశ్వీయుజ మాసం’ . ఈ మాసంలో చేసే పూజలు, విధుల ఆచరణవల్ల అనంతమైన ఫలితాలు కలుగుతాయి.
No response to "ఆశ్వీయుజ మాసం"
Post a Comment