నవదుర్గలు ....
Filed under: భక్తి Author: జ్యోతిఅమ్మలకే అమ్మ , ముగురమ్మల మూలపుటమ్మ దుర్గా మాత నవ విధ అవతారాలని అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ దసరా నవరాత్రులు. దేవీ భాగవతంలో శక్తిస్వరూపిణీ మాతకు త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులకన్నా అధిక ప్రాధాన్యమివ్వబడింది. విజయం ప్రాప్తించాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి.' త్రిపురార వ్యాసం'లోని మహాత్మ్యఖంఢం శక్తి ఉపాసనా విశిష్టతను స్పష్టం గావించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం 'సప్తశతీ, 'లలితాత్రిశతి ', లలితా సహస్రనామం ఆదిగాగల గ్రంధాలలో కూడా కనపడుతుంది. ఆమెయే త్రిపురా రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అట్టి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు.
తల్లిని దేవతగా గుర్తించి పూజించడం శక్తాభావ వికాసంలోని పద్ధతి . నీవే సరస్వతివి, నీవే మహాలక్ష్మివి, నీవే శాకంభరివీ, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణాన్ని సమన్వయాన్ని సాధించే దిశలో శ్రీ శంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు.
వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తులుగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనానికీ, ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు మహాలక్ష్మి, విద్య విజ్ఞానానికి మహా సరస్వతి అధిష్టాన దేవతలుగా రూపొందారు.
నవదుర్గలు -మహిమలు
శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.
శైలపుత్రి:
' వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్'
కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.
బ్రహ్మచారిణి:
'దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా '
ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.
చంద్రఘంట:
'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా
ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'
దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.
కూష్మాండ రూపం:
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
స్కందమాత:
'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '
శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.
కాత్యాయిని:
'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '
కాత్యాయనీ మాత వింధ్యాచలవాసిని. ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి.
కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '
కాళరాత్రీ దేవి కాలవర్ణంతో , త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధబం. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. ఈమెకు గల మరో నామం శుభంకరి.
మహాగౌరి:
'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'
అష్టమశక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.
సిద్ధిధాత్రి:
'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ
తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.
ఈ వ్యాసం ఆంధ్రభూమి పత్రిక నుండి సేకరించినది:
ramya
October 17, 2007 at 1:47 AM