సృష్టికి పూర్వం ప్రపంచమంతా జలమయమైపోయింది. ఆ జలంలో నారాయణుడు శేషతల్పం మీద కన్నులు మోడ్చి సహస్ర చతుర్యుగాలు శయనించాడు. అలా శయనించినప్పటికి ఆయన చైతన్యశక్తి అంతర్ముఖంగా జాగృతంగానే ఉంది. ఆ తర్వాతా కాలమే స్వీయశక్తి ప్రేరేపించగా ఆయనకు సృష్టి చెయ్యాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే తనలో లయం చెందిన సమస్త విశ్వం మీద ఆయన దృష్టి పెట్టగా రజోగుణం పుట్టింది. దాని ప్రభావంతో ఆయనలో నిక్షిప్తమైన సూక్ష్మతత్వాలన్నీ కలిసి నాభిస్థానం నుంచి పద్మకోశంగా వ్యక్త్తమయ్యాయి. సకల లోకాలకు ఆధారమై, ప్రకృతి గుణాలకు ఆలవాలమై ప్రకాశించే ఆ పద్మంలో విష్ణువు తన అంశను ప్రవేశపెట్టాడు. అప్పుడు వేదమయుడైన బ్రహ్మ అందులోంచి ఆవిర్భవించాడు. ఆయన్నే స్వంభువుడు అంతారు. అలా ఆవిర్భవించిన బ్రహ్మ పద్మకర్ణిక(తామర దుద్దు)లోంచి ఆకాశం వైపు దృష్ణిని సారించి నాలుగు దిక్కులూ చూస్తూ చతుర్ముఖుడయ్యాడు. కాని ఆయనకేమీ అర్ధం కాలేదు. అప్పుడాయన "ఇక్కడ నాకేమీ కనిపించడం లేదు. సముద్ర జలమూ, ఈ పద్మమూ తప్ప. ఈ పద్మ కర్ణికలో కూర్చున్న నేను ఎవరిని? అసలు ఈ పద్మం ఎలా పుట్టింది? దీనికేదో ఆధారం ఉండాలి " అనుకుంటు పద్మనాళం ద్వారా జలంలోకి ప్రవేశించి నాభి వద్దకు వెళ్ళాడు. కానీ దానినీ గుర్తించలేకపోయాడు. ఇలా పద్మోద్భవ స్థానాన్ని తెలుసుకోలేక, తన ప్రయత్నం విరమించి, తిరిగి పద్మాన్నే చేరుకున్నాడు. ఆ పద్మంలోనే కూర్చుని శ్వాసను నియంత్రించి, ధ్యానమగ్నుడై వంద సంవత్సరాలు సమధి స్థితిలో ఉన్నాడు. చివరికి ఆయనకు జ్ఞానోదయమైంది.

అప్పుడు శిరోరత్నకాంతులు ప్రళయజలంలోని చీకటిని పటాపంచలు చేస్తుండగా పదివేల పడగలనే చత్రాల క్రింద తామరతూడులాంటి తెల్లని శరీర తల్పం మీద శయనించి ఉన్న ఒక పురుషుడు బ్రహ్మదేవుని హృదయంలో సాక్షాత్కరించాడు.

సంధ్యాకాల మేఘాలనే వస్త్రాలను ధరించి, రత్నాలతో, ఓషధులతో, నీటి ధారలతో, పుష్పాలతో చేసిన వనమాలను కంఠసీమలో అలంకరించుకుని, వెదుళ్ళే భుజాలు కాగా, వృక్షాలే పాదాలు కాగా, బంగారు శిఖరాలతో శోభించే పచ్చల పర్వతం యొక్క సోయగాన్ని ఆ మహాపురుషుడి దేహకాంతులు తలదన్నుతున్నాయి.

లోకత్రయాన్ని తన కుక్షిలో నిక్షిప్తం చేసుకుని, విచిత్ర దివ్యవస్త్ర, దివ్యాభరణ భూషితుడై, సాటిలేని మేటి విరాట దేహంతొ ఆ దివ్యపురుషుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రవంకల వంటి నఖాలతో ఆయన పాదపద్మాంగుళులు తామరరేకుల్లాగా అందగించి వున్నాయి. వేద నిర్దేశిత మార్గంలో అర్పించేవారికి వాంచాఫల సిద్ధినిస్తాయి ఆ పాదాలు.

ఆ దేవదేవుడు కడిమి పువ్వుల పుప్పొడిలాగా పసుపు పచ్చని కాంతులీనే వస్త్రాలు ధరించాడు. శ్రీవత్సమనే పుట్టుమచ్చతో పాటు కౌస్తుభరత్నం ఆయన వక్షాన్ని అలంకరించింది. ఆయన ధరించిన వనమాల చుట్టూ వేదాలు భ్రమరాలై ఆయన కీర్తిని గానం చేస్తున్నాయి.

అటువంటి ఆ ఆదిపురుషుణ్ణి దర్శిస్తున్న సమయంలో బ్రహ్మదేవునికి తన శరీరంతో పాటు నాభి అనే సరస్సు, పద్మం, సముద్రజలం, ప్రళయవాయువు గోచరించాయి కాని విశ్వసృష్టికి కావల్సిన తత్వాలు ఆయన కంటికి కనిపించలేదు.అప్పుడాయన శ్రీహరిని స్తుతించగా ఆయన కర్తవ్యం బోధించి అంతర్హితుడయ్యాడు.

విష్ణువు అంతర్హితుడయిన తర్వాత బ్రహ్మదేవుడు నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానవంతుడూ, విజ్ఞానవంతుడూ అయ్యాడు. ఆ సమయంలో వాయువు ప్రచండంగా వీచింది. బ్రహ్మ అధిష్టించిన పద్మమూ, సముద్ర జలమూ కంపించాయి. ఇది గ్రహించి దివ్యతపశ్శక్తి సంపన్నుడైన బ్రహ్మ ఆ జలాన్ని పానం చేసి, వాయువును లోపలికి పీల్చేసాడు. అనంతరం తాను ఆసీనుడైన పద్మం ఆకాశమంతా వ్యాపించి ఉండడం గమనించి పూర్వం ఆ పద్మంలోనే లీనమైపోయిన అన్ని లోకాలను తిరిగి సృష్టించాలనుకున్నాడు. ముందుగా ఆ పద్మాన్ని మూడు విభాగాలుగా చేసి (ముల్లోకాలు) తర్వాత దానిని పద్నాలుగు భాగాలుగా( చతుర్దశ భువనాలు) విభజించాడు. ఈ లోకంలో జీవులు తమ కర్మఫలాన్ని అనుభవిస్తారు.

ఈ విధంగా బ్రహ్మ చేత సృష్టించబడిన జగత్తు పూర్వం ఎలా ఉండేదో, ఇప్పుడూ అలాగే ఉంటుంది, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది. అంటే క్రమబద్ధంగా ఏర్పడి, పెరిగి నశిస్తుంది.