శ్రావణమాసం తరువాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్న విశిష్టమైన మాసం 'జ్యేష్టమాసం'. చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్టమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది.ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు.

వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అట్లే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలోఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వవలెను.అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.

జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానమాచరించి గంగానదిని పూజించవలెను. అలా వీలు కానివారు ఇంటియందే గంగానదిని స్మరిస్తూ స్నానం ఆచరించవలెను.


మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి.

రంభా వ్రతము.

దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పేరు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించవలెను. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.

వట సావిత్రీ వ్రతం.

జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించవలెను వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రంను పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయవలెను.

జ్యేష్ట శుద్ధ దశమి

దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు.దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది.

జ్యేష్ట శుద్ధ పూర్ణిమ.

దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు.ఈ దినం రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ దినం భూదేవిని పూజించడం మంచిది.