1. మహాభారతంలో జూదంలో పాచికలు శకుని చేతనే వేయించటంలో అంతరార్థమేమిటి? దుర్యోధనుడు
ఎందుకు వేయలేదు ? దీంట్లో రహస్యమేమిటీ?

* జూదం పాచికలను వశీకరణ చేసుకునే శక్తి శకునికే వున్నదని దుర్యోధనునికి బాగా తెలుసు కనుక
తాను పాచికలు వేయక, మాయావియైన శకుని చేతనే వేయించాడు. అదే దీని రహస్యం.2. పూజ చేసే ముందు ఆచమనం చేసేటప్పుడు నారాయణాయ నమః , గోవిందాయనమః,
మాధవాయ నమః అని నీళ్ళు త్రాగి, కేశవాయ నమః అని నీళ్ళు ఎందుకు వదులుతారు?
కేశవనామము మంచిది కాదా?

* కేశవనామం చాలా గొప్పది. "కశ్చ ఇశ్చ ఈశశ్చ కౌశాః తాన్వాతీతి కేశవః" బ్రహ్మ విష్ణు
మహేశ్వరాత్మకమైన నామం ఇది. అందుకనే అన్నిపనులలో మొట్టమొదటి నామం కేశవ
అని చెయ్యాలి. భగవన్నామములన్నీ గొప్పవే. ఏ నామం తోటీ నీళ్ళు వదలరు. ఎవరో
తెలియని వాళ్ళు చేసిన పని.3. మోక్షప్రదాత శ్రీ మహావిష్ణువు. శివుడు మొదలైన దేవతలకు ఆ శక్తి లేదా?

* 'జ్ఞానమిచ్చేత్ జనార్ధనాత్ "."మోక్షమిచ్చేత్ మహేశ్వరాత్ " విష్ణువును ఆరాధిస్తే జ్ఞానం
కలుగుతుంది. మహేశ్వరుని సేవిస్తే మోక్షం కలుగుతుందన్నారు. జ్ఞానం వుంటే కాని
మోక్షం రాదు.అనగా జ్ఞానం మోక్షం ఒక్కటేనన్నమాట. అంటే శివవిష్ణువులు వేరుకాదని
వారి అర్ధం.4. పెళ్ళిళ్ళలో అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. యముని వెంట వెళ్ళి పతి ప్రాణములను
తెచ్చుకున్న సావిత్రిని, త్రిమూర్తులను చంటిపాపలను చేసి లాలించిన అనసూయను
పేర్కొనరు... ఎందుకని?


* పతివ్రతలుగా చెప్పేటప్పుడు అరుంధతి, అనసూయ, సీత, ద్రౌపది, లోపాముద్ర,
సుకన్య ఎందరెందరో గొప్ప పత్రివ్రతలు భారతీయ సంస్కృతిలో పేర్కొనబడినవారు వున్నారు.
కాని నక్షత్ర రూపాన్ని ధరించినది ఒక్క అరుంధతియే. సప్తఋషులలో వసిష్టుడు ఒకడు
కావటంవలన, ఆయనను ఎప్పుడూ సమీపించి వుండే అరుంధతి నక్షత్రమైంది. అందుకని
ఆమెనే వివాహాలలో నూతన వధూవరులకుమాంగల్యసిద్ధికి చూపించడం జరుగుతుంది.