ఇటీవలి కాలంలో అత్యధికంగా ప్రాచుర్యంలోనికి వచ్చిన పర్వదినం 'అక్షయ తృతీయ '. ఈ పండుగ రావడానికి చాలా ముందునుంచే బంగారం వ్యాపారులు టీవీలు, పేపర్లలో చేసే ప్రకటనలవల్ల ఈ పండుగకు ప్రాధాన్యం పెరగడంతోపాటు ఈ దినం కనీసం ఒక కాసు బంగారమైన కొనాలనే భావం అధికమైంది.

'అక్షయం' అంటే క్ష్యయం లేకుండుట. జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అనే పేరు ఏర్పడింది.ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియనాడు జరుపుకోవడం ఆచారం. ఈ పండుగను గురించి, ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాలను గురించి భవిష్య, శివపురాణాలలో వివరించబడ్డాయి. పూర్వం ఈ పండుగను గురించి శ్రీకృష్ణపరమాత్మ స్వయంగా ధర్మరాజుకు వివరించినట్టు భవిష్యోత్తర పురాణంలో పేర్కొనబడింది.

వైశాఖ మాసస్య చయా తృతీయా
న నమ్యసౌ కార్తీక శుక్ల పక్షే
నభస్య మాసస్య తమిస్ర పక్షే
త్రయోదశీ పంచదశీ చమాఘే


అని పురాణాల్లో పేర్కొనబడింది.

వైశాఖ శుద్ధ తృతీయ రోజు కృతయుగము, కార్తీక శుక్ల నవమిరోజు త్రేతాయుగము, భాద్రపద బహుళ త్రయోదశినాడు ద్వాపరయుగం, మాఘ బహుళ అమావాస్యనాడు కలియుగం ప్రారంభమైందని విష్ణుపురాణ కథనం. దీని ప్రకారం కృతయుగం ప్రారంభమైన తొలిరోజు కృతయుగాది. ఈ కృతయుగాది పర్వదినానే ఈరోజు అక్షయ తృతీయగా జరుపుకుంటూ వుండడం విశేషం. ఈ దినం ఎంత పుణ్యదినమంటే వారం వర్జ్యం చూసుకోకుండా ఏ శుభకార్యాన్ని అయినా ఈరోజు జరుపుకోవచ్చు.

కాగా దుష్టశిక్షణ, శిష్టరక్షణకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ఎత్తగా అందులో ఆరవ అవతారం 'పరశురాముడు ' పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయనాడే కాబట్టి ఈ దినం వైష్ణవాలయాలను దర్శించడం,పూజించడం శ్రేష్టం.

అక్షయ తృతీయ పర్వదినాన్ని వివిధ ప్రాంతాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. మన రాష్టంలో ఇటీవలి కాలంలో అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించడంతోపాటు బంగారం కొనడం ఆనవాయితీ అయింది. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రంలో కొలువుదీరిన శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి ఈ ఒక్క రోజు చందనం లేకుండా నిజరూపంలో దర్శనమిస్తారు. ఈనాటి సాయంత్రం నుంచి చందనోత్సవం వైభవంగా జరుగుతుంది.

పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఈ దినం ఇష్టదేవతలను పూజించడంతో పాటు అన్ని వర్గాలవారు బంగారం కొంటారు. ఈ విధంగా చేయడం వల్ల తమ జీవితం సంపదలతో నిండిపోతుందని వారి నమ్మకం. కేరళీయులు ఈ సంధర్భంలో 'విషు ' పర్వంను జరుపుకుంటారు. ఓనం తర్వాత వారు జరుపుకునే పెద్ద పండుగ ఇది.

ఉత్తర భారతదేశంలో ఈ పండగనాడు శ్రీలక్ష్మినారాయణుడిని పూజిస్తూ, భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.బదరీనాధ క్షేత్రములో ఉన్న శ్రీ బదరీనారాయణస్వామివారి ఆలయాన్ని ఈ దినం తెరుస్తారు.ప్రత్యేక పూజలు చేస్తారు. హృషికేశంలో అక్షయతృతీయనాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి గంగ, యమున సరస్వతి సంగమ స్థలమైన ఋషికుండంలో ఈ రోజు స్నానమాచరించి పూజలు చేస్తే సకలదోషాలు, పాపాలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఊత్తరభారతీయుల నమ్మకం. ఈ విధంగా దేశవ్యాప్తంగా భక్తిశ్రద్దలతో జరుపుకునే అక్షయతృతీయ పర్వదినం ఎంతో పవిత్రమైనది.