అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం

ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్

కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే

ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్

అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద

ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్

శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!

ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్

రాగం: మలయ మారుతం

వస్త్రమే, ఉదకమే, అన్నమే ధర్మము చేయు

మా స్వామీ! ఓ నందా! ఇక మేలుకో!

ఇంతులలో మేల్బంతీ! ఓ మంగళ దీపమా!

మా స్వామినీ! యశోదా! మేలుకో // వస్త్రమే //

పెరిగి నభమున కరిగి లోకాలు కొలచిన

మా దొరా! నిద్దుర ముద్దు కాదురా!

స్వర్ణారుణ మంజీర శ్రీపాదా బలదేవా!

నీ అనుజుండు నీవు నిద్రమేల్కొనుడు!

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.

గోదాదేవి , మరో పదిమంది గోపికలు కలిసి శ్రీకృష్ణుని పూజించడానికి నందగోపభవనానికి చేరుకున్నారు. అక్కడి భవన, ద్వారపాలకులను అర్ధించి తలుపులు తీయించి లోనకు ప్రవేశించారు. అక్కడ బలరాముడు, యశోధ, శ్రీకృష్ణుడు నిద్రపోతున్నారు. గోదా, గోపికలు వారిని మేల్కొల్పుతున్నారు. "వస్త్రములు, నీరు, అన్నము అవసరం ఐన వాళ్లకు ధర్మము చేయి స్వామి!.నందగోపాలా! మేలుకో..ప్రబ్బలి చెట్లవలె సుకుమారమైన శరీరముగల స్త్రీలలో చిగురువంటి దానివైన ఓ యశోదమ్మా. మా వంశానికే మంగళకరమైన దీపమువంటి దానా మేలుకో! ఆకాశంలోని మధ్యభాగాన్ని చీల్చుకుని పెరిగి లోకాలను కొలిచిన నిత్యసూరులకు నాయకుడా! త్రివిక్రమా! మేల్కొనవయ్యా! ఎర్రని బంగారు కడియాన్ని ధరించిన బలరామా! నీ తమ్ముడు, నువ్వు మేలుకోండి" అని ప్రార్ధించారు.

గోపికలు ముందుగా నందుని ఔదార్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆర్థులందరికీ వస్త్రము, నీరు, అన్నము వారు తృప్తి చెందేవరకు ఇస్తాడు నందుడు. భగవంతుని చేరడానికి ముందుగా ఆచార్యుడైన నందుని ప్రార్ధిస్తున్నారు గోపికలు. శరీరానికి అన్నంలా ఆత్మకు పరిపూర్ణమైన బ్రహ్మానుభవాన్ని ఆహారంగా ఇచ్చేవాడు గురువు. సంసారబంధనాలతో అలసిన జీవునకు భగవంతుని నామస్మరణమనే జలాన్ని ఇచ్చి దప్పిక తీర్చేవాడు గురువు.. వారి మాటలకు మేల్కొన్న నందుడు చిరునవ్వుతో అనుమతినిచ్చాడు. కుమారునిపై వాత్సల్యము, భర్తమీద అనురాగము కలిగిన యశోద వారిరువురి మధ్య మంచంపై నిద్రపోయి ఉంది. నందగోపుడు గురువు కాగా యశోద మంత్రము. 'ఓమ్' అనే ప్రణవంలో అ+ఉ+మ్ అని మూడక్షరాలుంటాయి. అందులో అకారము పరమాత్మ , మకారము జీవుడు కాగా మధ్యలోఉ ఉన్న ఉకారము జీవునకు పరమాత్మకు గల విడదీయరాని అనుబంధము లేదా అమ్మను తెలుపుతుంది. గోపికలు ఆచార్యుని, మంత్రాన్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత మంత్రార్ధమైన శ్రీకృష్ణుని మేల్కొల్పుతున్నారు. ఇక్కడ బలదేవా అని పిలవడంలో శేషావతారం అని కూడా స్పురిస్తుంది. ఓ బలదేవా శేషసాయి ఐన నారాయణుడికి నీవు శయ్యవు కదా? శయ్యమీద పడుకున్నవారు నిద్రిస్తారు కాని శయ్యయే నిద్రించిన విడ్డూరం కాదా? అని గోపికలు చమత్కరిస్తున్నారు.