నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ

కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్రాగం: భాగ్యశ్రీ

నాయకుడైనట్టి నందగోపుల వారి
ప్రాసాద రక్షకా! ఓ ద్వారాపాలకా!
మణిమయ ద్వారమ్ము గడి తీయుమయ్యా!
చిన్ని గోపెమ్మలము శ్రీకృష్ణుని చేరెదము //నాయకు //
మాయావి కన్నయ్య మాకు పర ఇత్తునని
నిన్ననే మము కలిసి మాట ఇచ్చేను.
శుద్ధిగా చేరితిమి సుప్రభాతము పాడ
మునుముందుగ నీవు కాదనకు స్వామి!
పొందికగ ఉన్న ఆ తలుపులను తెరువుము
జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..తిరుప్పావై ఒక మణిహారం కాగా ఈ హారంలో పై పూస శ్రీకృష్ణుడైతే మధ్యలోని మణిపూస ఈ పాశురం అని చెప్పవచ్చు. శ్రీ వ్రతం చేసే అర్హత కలిగిన గోపికలను తోడ్కొని గోదాదేవి నందగోపభవనానికి చేరుకుంది. వారందరూ ఆ భవనం లోపలికి ప్రవేశించడానికి ఆ భవన పాలకుని, ద్వారపాలకుని అర్దిస్తున్నారు.


"మా నాయకుడైన నందగోపుని భవనాన్ని కాపాడే భవన పాలకా! మమ్మల్ని లోపలికి పోనిమ్ము. అందమైన పతాకంతో ప్రకాశిస్తున్న ద్వారాన్ని కాపాడే ద్వారపాలకా ఈ మణిమయభూషితమైన తలుపుల గడియ తీయుము. శ్రీకృష్ణుడి మాకు పరవాద్యాన్ని ఇస్తా అని నిన్ననే మాట ఇచ్చాడు. అందుకే మేము ఆ కృష్ణుడికి సుప్రభాతం పాడడానికి పరిశుద్ధులమై వచ్చాము. ఓ ద్వారపాలకా! మూసి ఉన్న తలుపులను తెరిచి మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వు" అని అర్ధించారు.


మనం ఎప్పుడుగాని గురువులను ఆశ్రయించకుండా భగవంతుని చేరరాదు. ఆచార్యులను కలిసేటప్పుడు వారి అంతరంగ శిష్యులను ముందు ఆశ్రయించాలి. దానికి అహంకారము లేకుండా వినయంగా ఉండాలి. అందుకే గోదాదేవి పదిమంది మహాత్ములను ఆశ్రయించి వారిని తీసుకుని అహంకార రహితులై నందగోపుని ఆశ్రయించడానికి ముందుగా అక్కడి భవన, ద్వారపాలకులను అర్ధించారు. భగవంతుని చేరడానికి ముందుగా పది మంది గోపికలను వశపరుచుకోవడంలో ఇంద్రియ నిగ్రహం, భవన పాలకుని అర్ధించడంలో ప్రాణసంయమనం, ద్వారపాలకుని అర్ధించడంలో మనోజయం సూచింపబడింది. ఇక్కడ మరో విశేషం గురించి చెప్పుకోవచ్చు. నందగోపభవనం ముందు పూలతోటలు, కొలనులు, ద్వార వైభవాన్ని చూసి ఆకర్షించబడి లోపలికి వెళ్లడానికి సందేహిస్తారు. కాని ఆ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్లాక ఆ పరమాత్మ సౌందర్యాన్ని చూసి అక్కడే ఉండిపోవాలనుకుంటారు కాని బయటకు రావాలని కోరుకోరు. గోపభవనానికి మూసి ఉన్న తలుపులే మనలో ఉండే అహంకార మమకారాలు. వాటిని బయటకు కాకుండా లోపలకు నెట్టాల్సిన తలుపులు. అందుకే వాటిని తెరవమని ద్వారపాలకుని ప్రార్ధించారు గోపికలు. మన అహంకార మమకారాలను మనమే తొలగించుకునే శక్తి ఉండదు. అది గొప్ప యోగులకే సాధ్యం. అందుకే నీవే వాటిని వెనక్కు త్రోసి మమ్మల్ని ఆ భగవంతుని వద్దకు వెళ్లనిమ్ము అని ద్వారపాలకుడిని అర్ధించారు.