చింతా రామకృష్ణగారి అమ్మాయి రామలక్ష్మి గానం చేసిన తిరుప్పావై..

మొదటిభాగం...

రెంఢవ భాగం...


తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గమిది. తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరుమోసిన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతము.

తిరుప్పావై లో 30 పాశురములు ఉంటాయి. పాశురము అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలని అర్ధం. ఆండాళ్ లోని ఈ భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా మనకు అందించారు, తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలున్నాయి. వేకువజామున నిద్రలేచి స్నానం చేయడం, స్వామి కీర్తనలను, ప్రతిరోజూ క్రమం తప్పకుండా తిరుప్పావై పాశురములను పాడడం, పేదలకు దానములు, పండితులకు సన్మానము చేయడం, స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యము చేయడం, ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించడం మొదలైనవి పాటించాలి.

ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరు పెట్టగా, అది క్రమంగా గోదాగా మారింది.. అటువంటి గోదాదేవి రచించిన 30 పాశురాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచిగా జీవించమని, తోటివారికి సాయపడమని, భగవదారాధన తప్పనిసరిగా చేయమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి.

తమకు మంచి భర్త లభించాలని కోరుకుంటూ కన్నెపిల్లలు చేసే వ్రతాలలో తిరుప్పావై వ్రతం ఒకటి....ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక.. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావై పాశురాలను గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి మరియు ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు. చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.

మొదటి పాశురము:

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్

కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్

ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం

కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱైతరువాన్

పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .

మాసములన్నింటిలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవంతుడు చెప్పియున్నాడు. మార్గశిర మాసమనగా మనం అవలంభించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము. శ్రీకృష్ణుడనే చెట్టు నీడ ఎక్కువ చల్లగానూ వేడిగానూ ఉండదు. అలాగే వాసుదేవ స్వరూపమైన మార్గశిరమాసం కూడా సమశీతోష్ణముగా ఉండే కాలం. మనం ఉదయం మేల్కొనే కాలం సత్వగుణసంపన్నమైన బ్రాహ్మి ముహూర్తము. అంతేగాక ఈ మార్గశిర మాసంలో పైరుపంటలన్ని విరగ కాసి పండి ఉంటాయి. అతి మనోహరమైన వెన్నెలలు వెదజల్లే శుక్లపక్షంలో పవిత్రమైన రోజున ఈ వ్రతం ప్రారంభించినామని కాలాన్ని ప్రశంసించుట ఇందులోని అర్ధము. భగవంతుని సమాగమమును కోరుకుని ఆతని సంతోషపరచడానికి అతనికిష్టమైన పనులు చేయడానికి ఇది ఉత్తమోత్తమైన సమయమని చెలికత్తెలను మేల్కొని స్నానము చేసి, రండని పిలుస్తూ ప్రకృతి మండలమందు ఆనందము అనుభవించేవారలారా అని ఆండాళ్ సంబోధించింది. ఈ పిలుపులో ఒక మహత్తరమైన భావముంది. పరమపదమున నివసించుటకంటే ప్రకృతిమండలమైన గోకులంలో నివసించుట అంటే ఆ భగవంతునితో కలిసి మెలిసి ఉంటూ మహదానందము అనుభవించే మహాద్భాగ్యం లభిస్తుంది అని ఆమె నమ్మిక..