శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడుకొండలని ప్రతీతి.

ఆ ఏడు కొండలు : శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి..

అందమైన లోయలు, చెట్లూ, జలపాతాలు, అనంత ఔషధనిధులతో విలసిల్లే ఆ పవిత్ర సప్తగిరులలో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర చెప్పబడింది.


శేషాద్రి:
ఏడుకొండలలో ప్రధానమైనది "శేషాద్రి." ఒకసారి వాయుదేవుడు విష్ణుమూర్తిని కలిసేందుకు వైకుంఠానికి రాగా, ఆదిశేషుడు అతనిని అడ్డగించాడు. కొంతసేపు వారిమధ్య వాగ్వివాధం జరిగింది. ఆ వాదన ఎటూ తేలకపోవడంతో స్వామివారు వచ్చి ఒక ఉపాయం చెప్పారు.దాని ప్రకారం ఆదిశేషువు మేరుపర్వత భాగమైన ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా, వాయువు దాన్ని కదిలించాలి. ఇద్దరూ తమ తమ ప్రయత్నాలు చేసారు.కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూద్దామని శేషువు పడగ ఎత్తి చూశాడు. అంతే పట్టు సడలింది. అప్పుడే వాయువు ఆ శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ తీరాన దించాడట. అదే శేషాచలమైంది.


నీలాద్రి :
స్వామివారికి తొలిసారిగా తన తలనీలాను సమర్పించిన భక్తురాలి పేరుమీదుగా స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి "నీలాద్రి" అని నామకరణం చేసాడు. తల నీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. తల నీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.


గరుడాద్రి :
దాయాదులైన కద్రువ పుత్రులను సమ్హరించిన తర్వాత పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేసాడు. స్వామి ప్రత్యక్ష్యమవ్వగానే తిరిగి వైకుంఠం చేరే వరము కోరగా, కలియుగంలో గరుడుడిడిని శైలరూపంలో ఉండమని ఆదేశించారట. అదే "గరుడాచాలం".


అంజనాద్రి :
వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం వరకు పిల్లలు పుట్టకుంటే ఆకాశగంగ అంచున ఉన్న కొండలమీద ఏళ్ళ తరబడి తపస్సు చేయగా వాయుదేవుడు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడు. అది భుజించిన తర్వాత ఆంజనేయుడు జన్మించాడు. అంజనాదేవి తపస్సు చేసిన కొండ కావున దానికి "అంజనాద్రి" అన్న పేరు వచ్చిందని అంటారు.వృషభాద్రి
కృతయుగంలో తిరుమలలోని తుంబురుతీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతనికి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. కాని ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడు. చాలాకాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయి ప్రాణాలు విడిచే ముందు తనకు ముక్తి లభించిన ఆ కొండకు తన పేరు పెట్టాలని కోరాడు. ఆ గిరియే "వృషభాద్రి" అని పురాణ గాధ.నారాయణాద్రి.
విష్ణుదర్శనం కోసం తపస్సు చేయడం కోసం నారాయణమహర్షి బ్రహ్మదేవుణ్ణి ఒక మంచి స్థలం చూపాల్సిందిగా కోరాడు. అప్పుడు బ్రహ్మ చూపిన చోట తపస్సు చేసి స్వామి సాక్షాత్కారం పొందిన నారయాణ మహర్షి పేౠమీదుగా ఆ కొండకు "నారాయణాద్రి" అనే పేరు స్థిరమైంది.


వేంకటాద్రి :
ఇదే కలియుగ దైవం వేంకటేశ్వరుడు వెలసిన తిరుమలగిరి. వైకుంఠం నుండి గరుడుడు తీసుకొచ్చిన క్రీడాస్థలం ఇదేనని పురాణాలు చెప్తున్నాయి. 'వేం' అంటే పాపాలు అని, 'కట' అంటే హరించడం అని అర్ధం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయంట. అందుకే ఈ పవిత్ర గిరిని 'వేంకటాద్రి' అంటారు.